అప్పుడు వెంకీకి నేనెవరో తెలియదు: త్రివిక్రమ్

ABN , Publish Date - Sep 28 , 2026 | 09:05 AM

విక్టరీ వెంకటేశ్‌ నా అభిమాన నటుడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ‘పవిత్రబంధం’ చిత్రం కోసం మొదటి డైలాగ్‌ రాశానని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

Aadarsha Kutumbam Song Launch Event

‘‘చాలా ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం. ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయి. ‘ఆదర్శ కుటుంబం’.. ఇది మామూలు కుటుంబం కాదు..వేరే లెవల్‌లో ఉంటుంది’’ అని అన్నారు హీరో వెంకటేశ్‌ (Victory Venaktesh). ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) తెరకెక్కించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం- హౌస్‌ నెం 47’ (Aadarsha Kutumbam House No: 47). శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. సినిమా అక్టోబరు 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన వేడుకలో ఈ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రభ, రామ్‌ మిర్యాల ఆలపించారు.


ఈ కార్యక్రమంలో వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘పెళ్లికాని ప్రసాద్‌’ లాంటి పాత్రలు అయిపోయాయి కాబట్టి, ఓ సరికొత్త స్ర్కిప్ట్‌తో త్రివిక్రమ్‌ వచ్చారు. ఈ సినిమాను మీరంతా తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. ఇందులో యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటిమెంట్‌ అన్నీ ఉంటాయి. చినబాబు, నాగవంశీ మంచి మనుషులు. వారి బ్యానర్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉందని అన్నారు.


త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. విక్టరీ వెంకటేశ్‌ నా అభిమాన నటుడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ‘పవిత్రబంధం’ చిత్రం కోసం మొదటి డైలాగ్‌ రాశాను. అప్పుడు ఆయనకు నేనెవరో తెలియదు. ఒక రోజు ‘అతనెవరు? చాలా బాగా డైలాగ్స్‌ రాస్తున్నారు’ అని ముత్యాల సుబ్బయ్యగారితో మాట్లాడుతూ మెచ్చుకోవడం చూశా. ‘నువ్వు నాకు నచ్చావ్’ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు, నేను చెప్తే గుర్తు చేసుకున్నారు. అలా నా జర్నీ మొట్టమొదట ఆయనతోనే స్టార్ట్ చేశాను. ఆయన నాతో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ, నేను కాస్త భయంగానే ఉంటాను. గౌరవంతో కూడిన ఇష్టం వలన వచ్చిన భయం అనుకుంటాను అది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన సినిమా పట్ల అంతే తపన చూపిస్తూ ఉంటారు. ఒంట్లో బాగోకపోయినా సరే డబ్బింగ్ పూర్తి చేశారని అన్నారు. హీరోయిన్లు శ్రీనిధి శెట్టి, డింపుల్‌ హయతి, నివేదా పేతురాజ్‌, సంగీత దర్శకుడు తమన్‌, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వేదికగా పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు

సూర్యతో సినిమా ఎప్పుడు?.. రాజమౌళి ఏమన్నారంటే

రోమియో జూలియట్.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్.. ప్రభాస్ సపోర్ట్

Updated Date - Sep 28 , 2026 | 09:05 AM