రోమియో జూలియట్.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్.. ప్రభాస్ సపోర్ట్

ABN , Publish Date - Sep 28 , 2026 | 07:55 AM

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తోన్న తాజా యూత్‌ఫుల్ బోల్డ్ జెన్-జీ లవ్ ఎంటర్‌టైనర్ ‘రోమియో జూలియట్’. భార్గవ్ మాచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర స్టోరీని రిలీజ్‌కు ముందే మేకర్స్ రివీల్ చేశారు.

Romeo Juliet Still

హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తోన్న తాజా యూత్‌ఫుల్ బోల్డ్ జెన్-జీ లవ్ ఎంటర్‌టైనర్ ‘రోమియో జూలియట్’ (Romeo Juliet). భార్గవ్ మాచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవ రస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల నిర్మిస్తుండగా.. గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాడిరెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త ‘స్టోరీ రివీల్ గ్లింప్స్’ను పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.


రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్..

సాధారణంగా ఏ సినిమా అయినా మొదటి ఆట పడేవరకు కథ, కథలోని ట్విస్టులు బయటకు తెలియకుండా చిత్ర బృందం ఎంతో జాగ్రత్త పడుతుంటుంది. కానీ ‘రోమియో జూలియట్’ మేకర్స్ మాత్రం ఇందుకు భిన్నంగా పూర్తి ధైర్యంతో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు దాదాపు నాలుగు వారాల ముందే అసలు కథేంటో తెలిపే ‘స్టోరీ గ్లింప్స్’ను ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తమ కంటెంట్, కథనంపై మేకర్స్‌కు ఉన్న నమ్మకానికి ఈ నిర్ణయం నిదర్శనంగా నిలుస్తోంది.


నేటి ఆధునిక సంబంధాలపై బోల్డ్ సెటైర్!

తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హీరో ఒక లోకల్ గన్ డీలర్‌ను కలిసి ఓ అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతో తుపాకీని కొనుగోలు చేయడానికి ప్రయత్నించే సన్నివేశంతో వీడియో మొదలవుతుంది. అక్కడి నుంచి నేటి తరం రిలేషన్‌షిప్స్ చుట్టూ తిరిగే ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. హుక్‌అప్, వన్ నైట్ స్టాండ్, ఫ్లింగ్, బెంచింగ్, సిట్యుయేషన్‌షిప్, బాయ్ బెస్టీ వంటి ఆధునిక పదజాలాలను వివరిస్తూ హీరో చెప్పే డైలాగులు నేటి యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న జెన్-జీ (Gen-Z) యువత ప్రేమను, బ్రేకప్స్‌ను, గొడవలను ఎలా చూస్తున్నారు? సోషల్ మీడియా యుగంలో మారుతున్న మానవ సంబంధాల డైనమిక్స్ ఏంటి? అనే అంశాలను బోల్డ్ ట్రీట్‌మెంట్‌తో, వారి సహజ భాషలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాఘతి కథ అందించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వరల్డ్ రెబల్స్ డే సందర్భంగా, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న ‘రోమియో జూలియట్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా వచ్చిన ఈ బోల్డ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

ఆ మాత్రం దానికి.. హీరోయిన్ ఎందుకు? హీరోయిన్ల పాత్రలపై కంప్లయింట్స్

‘వారణాసి’ ఈవెంట్ టెన్షన్‌.. ఏడుపొచ్చేసింది: కార్తికేయ

ప్రభాస్ లిస్ట్‌లోకి మరో దర్శకుడు.. ఊహించని కాంబినేషన్!

Updated Date - Sep 28 , 2026 | 07:55 AM