సోషల్ మీడియా వేదికగా పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు

ABN , Publish Date - Sep 28 , 2026 | 08:36 AM

హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన శబ్దంతో మైకులు మోగిస్తుండటంపై ప్రముఖ నటుడు అల్లు శిరీష్ ఆందోళన వ్యక్తం చేశారు.

Allu Sirish

హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన శబ్దంతో మైకులు మోగిస్తుండటంపై ప్రముఖ నటుడు అల్లు శిరీష్ (Allu Sirish) ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళల్లో సైతం ఆలయాల నుంచి వస్తున్న భారీ శబ్దాల వల్ల స్థానిక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఉద్యోగులు నిద్రలేక నరకం చూస్తున్నారంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షేక్‌పేట్‌లోని ‘అపర్ణ వన్’ గేటెడ్ సొసైటీ నివాసి అయిన అల్లు శిరీష్.. తన ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యను వివరిస్తూ ‘ఎక్స్’ వేదికగా హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ‘‘నేను షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ సొసైటీలో నివసిస్తున్నాను. గత కొద్ది రోజులుగా సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి అనుమతించిన డెసిబుల్స్ పరిమితికి మించి విపరీతమైన శబ్దంతో లౌడ్ స్పీకర్లలో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకు కూడా ఈ మైకుల మోత కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు.


ఈ సమస్యపై గతంలోనే తాము ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. ‘‘అయితే వినాయక నిమజ్జనం వరకు కాస్త సర్దుకుపోవాలని పోలీసులు మాకు సూచించారు. సెప్టెంబర్ 25తో గణేష్ నిమజ్జనం పూర్తయింది. పండుగ అయిపోయినా కూడా ఆ ఆలయంలో మైకుల శబ్దం మాత్రం తగ్గడం లేదు. దీనివల్ల మా సొసైటీలోని వృద్ధులు, పసిపిల్లలు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ నిద్రలేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికులు గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను’’ అంటూ శిరీష్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


సాధారణంగా రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు, డీజేలను నిషేధిస్తూ నిబంధనలు ఉన్నప్పటికీ, అర్ధరాత్రి 3 గంటల వరకు మితిమీరిన డెసిబుల్స్‌తో మైకులు పెడుతుండటంపై స్థానికులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ అయిన అల్లు శిరీష్ నేరుగా ఈ సమస్యను వెలుగులోకి తేవడంతో నెటిజన్లు కూడా స్పందిస్తూ.. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యంపై గట్టి నిఘా ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

సూర్యతో సినిమా ఎప్పుడు?.. రాజమౌళి ఏమన్నారంటే

రోమియో జూలియట్.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్.. ప్రభాస్ సపోర్ట్

ఆ మాత్రం దానికి.. హీరోయిన్ ఎందుకు? హీరోయిన్ల పాత్రలపై కంప్లయింట్స్

Updated Date - Sep 28 , 2026 | 08:36 AM