సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆ మాత్రం దానికి.. హీరోయిన్ ఎందుకు? హీరోయిన్ల పాత్రలపై కంప్లయింట్స్

ABN, Publish Date - Sep 27 , 2026 | 06:09 PM

మంచి కథ, సమర్థుడైన డైరెక్టర్, స్టార్ హీరో.. హిట్ సినిమాకు ఇవి చాలా? చక్కటి హీరోయిన్ అక్కర్లేదా? మరి ఏరి కోరి తెచ్చుకున్న హీరోయిన్‌ని కూరలో కరివేపాకులా పక్కన పెట్టేస్తామంటే ప్రేక్షకులు ఊరుకుంటారా?

Tollywood Heroine Roles

మంచి కథ, సమర్థుడైన డైరెక్టర్, స్టార్ హీరో.. హిట్ సినిమాకు ఇవి చాలా? చక్కటి హీరోయిన్ అక్కర్లేదా? మరి ఏరి కోరి తెచ్చుకున్న హీరోయిన్‌ (Heroine)ని కూరలో కరివేపాకులా పక్కన పెట్టేస్తామంటే ప్రేక్షకులు ఊరుకుంటారా? ‘ఆ మాత్రం దానికి ఆమె ఎందుకు?’ అంటూ ముఖం మీదే చెప్పేయరూ.. కొన్ని సార్లు సినిమాలు హిట్ కావచ్చుగాక.. మరికొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడొచ్చుగాక.. రీసెంట్ టైమ్స్‌‌లో నాయికల పాత్రల మీద కంప్లయింట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.

మల్టీస్టారర్లలో...

‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal)ని అనుకున్నారు. అయితే ఇద్దరు హీరోలు, చెర్రీ పక్కన పూజా హెగ్డే (Pooja Hegde) ఉండటంతో కాజల్ రోల్‌కి న్యాయం చేయలేమని మేకర్స్ ముందే గుర్తించారు. ఆ విషయాన్ని రిలీజ్‌కు ముందే స్పష్టం చేసి, ఆ కేరక్టర్‌ని తీసేశారు. ఈ సినిమాకన్నా ముందే రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’లోనూ అదే పరిస్థితి. ఎంత సేపూ తారక్, చరణ్ మీదే ఫోకస్ చేశారు జక్కన్న. ఆలియా (Alia Bhatt) లాంటి అందగత్తెను కొన్ని సీన్లకే పరిమితం చేశారనే కంప్లయింట్స్ వినిపించాయి. అదేపనిగా హీరోయిన్ల చుట్టూ రాసుకున్న కథయితే తప్ప, మల్టీస్టారర్లలోనే కాదు, స్టార్ హీరోల సినిమాల్లోనూ నాయికలకు ప్రాధాన్యం ఉండట్లేదన్నది పదే పదే వినిపిస్తున్న విమర్శ.


బిజినెస్ కోసమేనా?

కోట్లకు కోట్లు పారితోషికం ఇచ్చి తీసుకొస్తున్న బాలీవుడ్ నాయికలకు మన సినిమాల్లో సరిగ్గా ప్లేస్‌మెంట్ ఇవ్వలేకపోతున్నారనే అపవాదు ఎప్పటి నుంచో ఉన్నదే. ‘కల్కి’ సినిమాలో దీపిక (Deepika) పాత్రకు మంచి పేరు వచ్చిన మాట ఎంత వాస్తవమో, దిశా పటానీ రోల్ అంతే చిన్నదన్నది ఒప్పుకొని తీరాల్సిందే. నిడివి విషయం పక్కన పెడితే, అసలు కొందరు నాయికలకు ప్రాధాన్యం ఉండట్లేదన్నది వారి అభిమానులకు అసంతృప్తి కలిగిస్తున్న అంశం. ‘కల్కి’లోనే కాదు, ‘కంగువ’లోనూ దిశా పటానికి పెద్దగా పని లేదు. ‘లైగర్’ తర్వాత అనన్య పాండే సౌత్ వైపు తిరిగి చూడకపోవడానికి కారణం కూడా ఇదేనా? అనే చర్చ కూడా అప్పట్లో జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో పేరున్న నాయికలను తీసుకున్నప్పుడు, వారి పేరుతో ఆయా మార్కెట్లలో బిజినెస్ చేస్తున్నప్పుడు వారికి తగ్గ కేరక్టర్లు రాసుకోవడంలో మేకర్స్ ఆశ్రద్ధ ఎందుకు చేస్తున్నట్టు? అనే ప్రశ్న నెట్టింట్లో కనిపిస్తోంది.

జాన్వీ కపూర్ పరిస్థితేంటి?

అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులోకి వచ్చారన్న ఆనందం ఇప్పటికీ చాలా మందిలో లేదు. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘దేవర’. అందులో ఆమె చేసిన తంగం పాత్ర నిడివి చాలా తక్కువ. దాంతో పోలిస్తే ‘పెద్ది’లో కాస్త నిడివి పెరిగినప్పటికీ, పాత్రని డిజైన్ చేసిన తీరు అభిమానులను మెప్పించలేకపోయింది. జాన్వీ పరిస్థితే కాదు, కియారా సిట్చువేషన్ కూడా అలాగే ఉంది. శంకర్ తీసిన ‘గేమ్ చేంజర్’, యష్ నటించిన ‘టాక్సిక్’ సౌత్‌లో ఈ భామకు వేరే లెవల్ ఎలివేషన్స్ ఇస్తాయని భావించిన వారిలో నిరుత్సాహం నింపాయి.


కథ విన్నప్పుడే..!

అంతంతమాత్రం కేరక్టర్లుంటే పేరున్న నాయికలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరన్న ఆలోచన దర్శకుల్లో రావాలి. అది జరగాలంటే ముందు నాయికల్లో మార్పు కనిపించాలి. స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందనో, పేరున్న సంస్థ నుంచి ఫోన్ చేశారనో, కనీవినీ ఎరుగనంత పారితోషికం అందిస్తున్నారనో.. కథలను, కేరక్టర్లను పట్టించుకోకుండా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కెరీర్ కుంటుపడుతుంది. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే ఆది నుంచి ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలా చేసినప్పుడు ఇండస్ట్రీలో గౌరవం, అవకాశాలతో పాటు అభిమానుల ఆదరణ కూడా సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’ ఈవెంట్ టెన్షన్‌.. ఏడుపొచ్చేసింది: కార్తికేయ

ప్రభాస్ లిస్ట్‌లోకి మరో దర్శకుడు.. ఊహించని కాంబినేషన్!

ఆ బ్రేకప్ సీన్ చేస్తున్నప్పుడు నిజంగానే ఏడ్చేశా: మమితా బైజు

Updated Date - Sep 27 , 2026 | 06:09 PM