ఐదుగురు హీరోయిన్లకు అగ్నిపరీక్ష
ABN, Publish Date - Nov 17 , 2026 | 05:09 PM
నవతరం ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా సినీజనం అడుగులు వేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో కుర్రాళ్ళను కిర్రెక్కించడానికి న్యూ హీరోయిన్స్ ను రంగంలోకి దించారు. త్వరలో మురిపించే ఆ భామలెవరు.
వారానికి ఐదారు సినిమాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త ముఖాలు కోకొల్లలుగా వస్తున్నాయి. సక్సెస్ అందుకుంటేనే ఆనందం- ఆ పై అవకాశాలు- ఇలా వచ్చి అలా పోతున్న సినిమాల్లో ఎందరో ముద్దుగుమ్మలు తమ కెరీర్ ను పరీక్షించుకుంటున్నారు. అయితే కొందరికే క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్సెస్ దక్కుతున్నాయి. అలా అవకాశాలు దక్కించుకున్న ఐదుమంది అమ్మాయిలు సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తున్నారు. వారిలో సాత్విక వీరవల్లి ముందుగా జనాన్ని పలకరించనుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆకాశంలో ఒకతార' నవంబర్ 20న విడుదల కానుంది. ఈ చిత్రంలోనే సాత్విక వీరవల్లి నాయికగా పరిచయమవుతోంది. తెలుగునాట దుల్కర్ కు మంచి క్రేజ్ ఉంది. పైగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా భాగస్వామ్యంలో లైట్ బాక్స్ మీడియా బ్యానర్ పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. అలా 'ఆకాశంలో ఒకతార'కు ఓ స్పెషల్ బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీ మురిపిస్తే సాత్వికకు సక్సెస్ దక్కినట్టే. అప్పుడు అమ్మడి చెంతకు మరిన్ని అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి.
డిసెంబర్ లో ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే రోజున ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'లెగసీ' చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా ఏక్తా రాథోడ్ నాయికగా పరిచయమవుతోంది.'లెగసీ' రిలీజ్ రోజునే నితిన్ హీరోగా రూపొందిన 'అలియాస్ రుక్మిణి' జనం ముందుకు వస్తోంది. ఈ చిత్రం ద్వారా అఫియా సయ్యద్ హీరోయిన్ గా ఇంట్రడ్యూసవుతోంది. విశ్వక్ సేన్ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ డ్రామా అందువల్ల 'లెగసీ'పై క్రేజ్ ఏర్పడింది. ఇక నితిన్ 'అలియాస్ రుక్మిణి' చిత్రానికి హీరో నాని సమర్పకుడు, దీప్తి గంటా నిర్మించిన ఈ చిత్రానికి 'దండోరా'ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. ఈ కారణంగా 'అలియాస్ రుక్మిణి' సినీ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ రెండు సినిమాల ద్వారా పరిచయమవుతున్న ఏక్తా, అఫియా తెలుగువారిని ఏ రీతిన ఆకర్షిస్తారో చూడాలి.
'ఇడుపు కాయితం' సినిమా టైటిల్ తోనే జనాన్ని తనవైపుకు తిప్పుకుంది. ప్రియదర్శి హీరోగా రూపొందుతోన్న 'ఇడుపు కాయితం' ద్వారా ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందిన 'ఇడుపు కాయితం' డిసెంబర్ 11న విడుదల కానుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే తన డాన్స్ తో అలరించిన నాగదుర్గ ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన 'ఇడుపు కాయితం'లో ఎలా రక్తి కట్టిస్తుందో మరి!?. కిరణ్ అబ్బవరం నటించి దర్శకత్వం వహించిన 'రియాలిటీ' సినిమాకు ఓ స్పెషల్ బజ్ నెలకొంది. ఈ సినిమాతో దేవికా భట్ నాయికగా పరిచయమవుతోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే 'రియాలిటీ' జనాన్ని పలకరించనుంది. అలా కూడా 'రియాలిటీ'పై ఆసక్తి కలుగుతోంది. ఇలా ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు కొత్త హీరోయిన్లు. వీరిలో ఎవరు ఎంతగా నవతరం ప్రేక్షకులను ఆకర్షిస్తే వారికి అన్ని అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరి లక్ ఎలా ఉందో మరి!?.
ఇవి కూడా చదవండి:
మిడ్నైట్ అప్డేట్స్.. జక్కన్నా నీ స్ట్రాటజీని అందుకోవడం కష్టమే..
James Bond 007: కొత్త జేమ్స్‌బాండ్.. అదిరిపోయాడు