James Bond 007: కొత్త జేమ్స్‌బాండ్‌.. అదిరిపోయాడు

ABN , Publish Date - Nov 17 , 2026 | 09:14 AM

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులకు జేమ్స్ బాండ్ అంటే ఒక పవర్ ఫుల్ బ్రాండ్, దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఒక అద్భుతమైన ఎమోషన్.

Robert Pattinson James Bond

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులకు జేమ్స్ బాండ్ (James Bond) అంటే ఒక పవర్ ఫుల్ బ్రాండ్, దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఒక అద్భుతమైన ఎమోషన్. చేతిలో గన్, రయ్‌మని దూసుకెళ్లే లగ్జరీ కార్లు, కళ్లు చెదిరే యాక్షన్, క్లాసిక్ సూట్‌లో కనిపించే రాయల్టీ 007 సొంతం. 2021లో వచ్చిన ‘నో టైమ్ టు డై’తో డానియల్ క్రేగ్ (Daniel Craig) బాండ్ పాత్రకు వీడ్కోలు పలికినప్పటి నుంచి, తదుపరి ఏజెంట్ ఎవరనే చర్చ హాలీవుడ్‌ను ఊపేసింది. ఎట్టకేలకు ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, హాలీవుడ్ స్టార్ నటుడు రాబర్ట్ పాటిన్సన్ (Robert Pattinson) ఏడవ అధికారిక జేమ్స్ బాండ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అధికారిక సోషల్ మీడియా వేదికగా విడుదలైన సరికొత్త వీడియోతో ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

ఈ సరికొత్త ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే, గత ఆరు దశాబ్దాల బాండ్ చరిత్రలో తిరుగులేని రికార్డులను నెలకొల్పిన డానియల్ క్రేగ్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకోవాలి. షాన్ కానరీ తొలిసారి తెరరూపమిచ్చిన ఈ పాత్రలో రోజర్ మూర్ అత్యధికంగా ఏడు చిత్రాల్లో నటించారు. అయితే, కాలపరిమితి పరంగా బాండ్ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన ఏకైక హీరో డానియల్ క్రేగ్ మాత్రమే. 2006లో క్యాసినో రాయల్ తో మొదలుపెట్టి 2021 వరకు ఏకంగా 15 సంవత్సరాల పాటు ఆయన బాండ్‌గా ప్రపంచాన్ని అలరించారు. కేవలం కాలపరిమితిలోనే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త చరిత్ర లిఖించారు.

క్రేగ్ నటించిన ఐదు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3.96 బిలియన్‌ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టాయి. మన భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 33,000 కోట్ల రూపాయలకు పైమాటే. తొలి సినిమాకు 26 కోట్ల రూపాయలు అందుకున్న క్రేగ్, చివరి చిత్రానికి వచ్చేసరికి ఒక్కో సినిమాకు 200 కోట్లకు పైగా తీసుకుంటూ, బాండ్‌కు రియలిస్టిక్, ఇంటెన్స్ ఇమేజ్‌ను అందించారు. ఇంతటి అద్భుతమైన లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇప్పుడు రాబర్ట్ పాటిన్సన్ భుజాలపై పడింది. హ్యారీ పోటర్, ట్విలైట్ లతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుని, ది బ్యాట్‌మ్యాన్ తో తనలోని అసమాన నటనను నిరూపించుకున్న పాటిన్సన్, ఈ పాత్ర కోసం భారీ మొత్తాన్నే అందుకోనున్నారు.

సాధారణంగా కొత్తగా వచ్చే బాండ్ నటులకు తొలి సినిమాకు తక్కువ పారితోషికం ఇవ్వడం ఆనవాయితీ. కానీ, ఇప్పటికే గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన పాటిన్సన్ తన మొదటి బాండ్ చిత్రానికే సుమారు 12 మిలియన్‌ డాలర్ల నుండి 15 మిలియన్‌ డాలర్ల వరకు బేస్ రెమ్యూనరేషన్‌గా అందుకోనున్నారు. దీనితో పాటు లాభాల్లో వాటా కూడా దక్కనుంది. మొదటి సినిమాకే ఇంతటి భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న తొలి బాండ్ నటుడిగా పాటిన్సన్ రికార్డు సృష్టించారు. ఈ చిత్రం కేవలం హీరో ఎంపికతోనే కాకుండా, వెనుక ఉన్న టెక్నికల్ టీమ్‌తోనూ భారీ హైప్ తెచ్చుకుంది.

డ్యూన్ (Dune) దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ (Denis Villeneuve) ఈ నూత‌న బాండ్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, పీకీ బ్లైండర్స్ (Peaky Blinders) రూపకర్త స్టీవెన్ నైట్ (Steven Knight) కథను అందిస్తుండ‌డం విశేషం. బాండ్‌ సిరీస్‌లో రాబోతున్న ఈ 26వ చిత్రాన్ని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ (Amazon MGM Studios) నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2027లో ప్రారంభమై, 2028 ద్వితీయార్థంలో లేదా 2029 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డానియల్ క్రేగ్ 15 ఏళ్ల పాటు నెలకొల్పిన బాండ్‌ లెగసీని రాబర్ట్ పాటిన్సన్ తనదైన శైలితో ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Nov 17 , 2026 | 09:18 AM