ఈ వారం 11 సినిమాల సందడి.. బరిలో శర్వ 'భోగి'
ABN, Publish Date - Nov 25 , 2026 | 03:42 PM
ఈ వారం థియేటర్లలోకి 11 సినిమాలు రాబోతున్నాయి. శర్వానంద్ భోగి, హే కన్నమ్మా, నాన్న కుట్టి సహా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
లాస్ట్ వీకెండ్లో వచ్చిన ఎనిమిది సినిమాల్లో మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో మురిపించాయి. 'ఆకాశంలో ఒకతార, ఈఎన్ఈ రిపీట్, ఓం' చిత్రాలకు ప్రేక్షకాదరణ లభించింది. దాంతో ఈ వారం కూడా డబ్బింగ్‌తో కలిపి పదకొండు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి.
హీరో శర్వానంద్ కు ఈ యేడాది కలిసొచ్చిందనే చెప్పాలి. సంక్రాంతి కానుకగా వచ్చిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'బైకర్' కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయినా, శర్వానంద్ ఇమేజ్ను కాస్తంత పెంచింది. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమానే 'భోగి'. 1960లో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను సంపత్ నంది తెరకెక్కించారు. శర్వా సరసన అనుపమా పరమేశ్వరన్ 'శతమానం భవతి' తర్వాత కలసి నటించింది. డింపుల్ హయతీ కీలక పాత్రను పోషించింది. ఐదుగురు చెల్లెళ్ళ అన్నయ్యగా శర్వ నటించాడు. ఆ నాటి పరిస్థితులు ఓ కమ్మరి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయన్నదే ఈ సినిమా కథ. వయొలెన్స్ అధికంగా ఉన్న కారణంగా 'భోగి' చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. అయితే కథానుగుణంగా ఉన్న హింస తప్పితే అనవసరంగా ఏదీ పెట్టలేదని సంపత్ నంది అంటున్నాడు. ఈ వారం వస్తున్న చిత్రాలలో ఇదే భారీ చిత్రం కావడంతో అందరి దృష్టి దీని మీదనే ఉంది. దీనిని నిర్మాత రాధామోహన్ ప్రతిష్ఠాత్మకంగా భావించి నిర్మించారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు... తన వారసులతో ప్రారంభించిన 'దిల్ రాజు ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటికీ 'బలగం, లవ్ మీ, జనక అయితే గనక' చిత్రాలు వచ్చాయి. ఈ బ్యానర్ నుంచి వస్తున్న నాలుగో సినిమా 'హే కన్నమ్మా'. నిజానికి ఈ సినిమాను మూడేళ్ళ క్రితం ప్రారంభించినప్పుడు దీని పేరు 'ఆకాశం దాటి వస్తావా'. బహుశా మరీ పొయిటిక్ గా ఉందని భావించారేమో మేకర్స్ ఇప్పుడు 'హే కన్నమ్మా' పేరుతో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ధనశ్రీ వర్మ, కార్తీక మురళీధరన్ కీలక పాత్రలు పోషించారు. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని శశికుమార్ ముత్తులూరి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతో పాటే శుక్రవారం 'సిద్దుగాడి లవ్ స్టోరీ, బాల 369, హై, ఐ హేట్ మ్యారేజ్, డాడ్స్ లిటిల్ ఫ్రెండ్' సినిమాలు వస్తున్నాయి. ఒకప్పటి ప్రముఖ నటీనటులు నటించిన 'ఆలోచన' చిత్రమూ శుక్రవారం విడుదల అవుతోంది. ఇందులో కీలక పాత్రను పోషించిన జీవీ నారాయణ రావు ఇప్పుడు మన మధ్య లేరు. ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సురేంద్ర చాచా దర్శకుడు. ఈ సినిమాను మొదటి మూడురోజులు సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీ గా ప్రదర్శించబోతున్నారు. దాదాపు ఇలాంటి ఆఫరే మరో సినిమా 'డేంజర్ బాయ్స్'కూ వర్తించబోతోంది. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ను అందరికీ ఫ్రీగా చూపిస్తామంటున్నారు మేకర్స్.
ఈ వారం వస్తున్న వాటిలో తొమ్మిది స్ట్రెయిట్ మూవీస్ కాగా రెండు అనువాద చిత్రాలు. అందులో ఒకటి ఇప్పటికే హిందీలో విడుదలైన 'ఫూలే' చిత్రం. ప్రముఖ దర్శకుడు అనంత మహదేవన్ హిందీలో జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే జీవితాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగువారి ముందుకు పొన్నం రవిచంద్ర తీసుకొస్తున్నారు. ఇప్పటికే 'ఫూలే' సినిమాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చూసి ప్రశంసించారు. ఇక ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ నటించిన 'నాన్న కుట్టి' పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ శుక్రవారం విడుదల అవుతోంది. మదర్ సెంటిమెంట్ తో విజయ్ ఆంటోని నటించి, నిర్మించిన 'వంద దేవుళ్ళు' సినిమా ఈ యేడాది జూన్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ కమర్షియల్‌గా ఆడలేదు. ఇప్పుడు తండ్రీకూతుళ్ళ అనుబంధంపై 'నాన్న కుట్టి' సినిమాను విజయ్ ఆంటోని నిర్మించారు. ఆయనతో పాటు ప్రీతి అస్రాని, లిథాన్య ఇందులో కీలక పాత్రలు పోషించారు. ము. మారన్ దీనికి దర్శకత్వం వహించారు.
తమిళంలోనూ రికార్డ్ స్థాయిలో సినిమాలు!
తమిళ చిత్రసీమలో సరికొత్త రికార్డు నమోదు కానుంది. ఈ నెలలో చివరి శుక్రవారమైన 27న ఏకంగా 13 కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. కోలీవుడ్‌లో ఒకే రోజు ఇన్ని చిత్రాలు విడుదల కావడం ఈ మధ్య కాలంలో జరగలేదు. శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల జాబితాలో '606', 'చిట్టుకురింజి', 'డెలివరీ బాయ్' 'సిగ్నల్ ఎట్ 11.30' వంటి చిత్రాలున్నాయి. అయితే, చివరి నిమిషంలో తగినన్ని థియేటర్లు లభించిక ఎన్ని చిత్రాలు వాయిదా పడతాయో తెలియదు. ఈ వారం విడుదల కానున్న చిత్రాల్లో దిండిగల్ లియోనీ కుమారుడు లియో శివకుమార్, రాధిక, బ్రిగిడ నటించిన 'డెలివరీ బాయ్', ముగేన్ రావ్ నటించిన 'నిరమ్', సినీ నేపథ్యగాయకుడు మనో కుమారుడు షకీర్ హీరోగా నటించిన 'మౌన మొళిగల్, 'సంతోష్ ప్రతాప్ నటించిన 'సిగ్నల్ ఎట్ 11.30' చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. చిన్న బడ్జెట్ చిత్రాలన్నీ ఒకేసారి విడుదలకు పోటీ పడుతుండటంతో థియేటర్ల కేటాయింపులో తీవ్ర పోటీ నెలకొంది. గత వారం విడుదలైన ధనుష్ 'ఓం' చిత్రం పాజిటివ్ టాక్ తో రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టి విజయవంతంగా ప్రదర్శిత మవుతోంది. దీంతోపాటు విజయ్ ఆంటోనీ 'అప్పాకుట్టి, కీర్తి సురేష్ 'సత్యవాన్ సావిత్రి' సినిమాలు కూడా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. దీంతో ఈ నెల 27న విడుదలకానున్న 13 చిత్రాలకు థియేటర్లు, స్క్రీన్ల కేటాయింపు ఇపుడు సవాల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
‘రామాయణ’ రికార్డ్ అవుట్.. రిలీజ్‌కు ముందే ‘అవెంజర్స్ : డూమ్స్‌డే’ సంచలనం
‘ఐ హేట్ మ్యారేజ్’ కేవలం బోల్డ్ సినిమా కాదు.. దర్శకుడు ఏం చెప్పారంటే
‘భోగి’ ప్రమోషన్స్.. డింపుల్ కోసమే అనుపమని పక్కన పెట్టారా?