150 కోట్ల క్లబ్‌లోకి ‘ద ప్యారడైజ్’.. అసలు పరీక్ష స్టార్ట్
ABN , Publish Date - Sep 28 , 2026 | 10:20 AM
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్‌లో విధ్వంసం సృష్టించింది. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వచ్చిన తాజా భారీ చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్‌లో విధ్వంసం సృష్టించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలనిజం, కయాదు లోహర్ కీలక పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మొదటి మూడు రోజుల్లోనే రూ. 136 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించగా.. ఆదివారం నాటి వసూళ్లతో కలిపి సునాయాసంగా రూ. 150 కోట్ల మార్కును దాటేసింది. అయితే, అసలైన బాక్సాఫీస్ పరీక్ష మాత్రం ఈ సినిమాకు ఈ రోజు (సోమవారం) నుంచే మొదలుకానుంది.
సాధారణంగా ఏ భారీ చిత్రానికైనా తొలి వీకెండ్ తర్వాత వచ్చే ‘సోమవారం’ (Monday Test) అత్యంత కీలకం. మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, వీకెండ్ కావడంతో నాని స్టార్‌డమ్, అనిరుధ్ మ్యూజిక్ హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. కానీ వీక్‌డేస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత సాధారణ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎంతవరకు వస్తారనేదే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పెంచిన టికెట్ ధరలు కూడా వీక్‌డేస్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశముంది. వర్కింగ్ డేస్‌లో అధిక టికెట్ రేట్లు ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి కాస్త వెనుకాడతారు. ఒకవేళ టికెట్ ధరలను సాధారణ రేట్లకు తగ్గిస్తే థియేటర్లలో ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టాలంటే ఈ వారం రోజులూ నిలకడగా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. నేటి ‘మండే టెస్ట్’లో ఈ చిత్రం ఎలాంటి పట్టు ప్రదర్శిస్తుంది? బుకింగ్స్ ట్రెండ్‌ను బట్టి నిర్మాతలు టికెట్ల ధరల తగ్గింపుపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీక్‌డేస్‌ను కూడా విజయవంతంగా దాటేస్తే మాత్రం నాని ఖాతాలో మరో ఆల్-టైమ్ రికార్డ్ లాక్ అయినట్లే!
ఇవి కూడా చదవండి:
అప్పుడు వెంకీకి నేనెవరో తెలియదు: త్రివిక్రమ్
సోషల్ మీడియా వేదికగా పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు
సూర్యతో సినిమా ఎప్పుడు?.. రాజమౌళి ఏమన్నారంటే