Tharun Bhaskar: ఈఎన్ఈ రిపీట్ లో బాలకృష్ణ గెస్ట్ అప్పీయరెన్స్

ABN , Publish Date - Jul 02 , 2025 | 04:30 PM

'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ గా రాబోతున్న 'ఈఎన్ఈ రిపీట్' చిత్రంతో నందమూరి బాలకృష్ణ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) తీసినవి మూడే చిత్రాలు. 'పెళ్లిచూపులు' కోసం మెగాఫోన్ చేతిలోకి తీసుకున్న తరుణ్‌ భాస్కర్ మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత వచ్చిన 'ఈ నగరానికి ఏమైందీ' (Ee Nagaraniki Emaindi) క్రేజీ ప్రాజెక్టే అయినా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఈ మధ్య వచ్చిన 'కీడా కోలా' అందరినీ నిరాశ పర్చింది. ఈ నేపథ్యంలో తనకు పేరు తెచ్చిపెట్టిన 'ఈ నగరానికి ఏమైందీ' కి సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు తరుణ్ భాస్కర్.


విశేషం ఏమంటే... 'ఈ నగరానికి ఏమైంది?' ఫస్ట్ రిలీజ్ కంటే రీ-రిలీజ్ లో మంచి ఆదరణ పొందింది. మొదట్లో ఆడకపోయినా... ఇది కల్ట్ మూవీస్ జాబితాలోకి చేరిపోయింది. దాంతో దాని సీక్వెల్ తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని తరుణ్ భాస్కర్ భావిస్తున్నాడు. ఇప్పుడీ సినిమా 'ఇఎన్ఈ రిపీట్' అనే టైటిల్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మళ్ళీ అదరగొట్టబోతోందనే హామీని తరుణ్‌ భాస్కర్ ఇస్తున్నాడు. ఒరిజినల్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం తో తిరిగి వస్తున్న ఈ సీక్వెల్ నోస్టాల్జియా ఫీలింగ్ ని కలిగిస్తుందని ఆయన చెబుతున్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్‌ కాకుమాను ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విశేషం ఏమంటే... డి. సురేశ్‌ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. సహజంగా కుర్రకారు ఏ సినిమా అయినా థియేటర్లలో 'జై బాలయ్యా' అని అరవడం పరిపాటి అయ్యింది. ఇక బాలయ్య అతిథి పాత్రలో కనిపించే ఈ సినిమా విషయంలో వారెంత గొడవ చేస్తారో మరి.

Also Read: Refugee: మధుర స్మృతుల్లో ఆ ఇద్దరూ...

Gopichand 33: మంచి టైటిల్ పట్టిన గోపీచంద్.. వర్కవుట్ అయితే అదే ఆనందం

Updated Date - Jul 02 , 2025 | 04:33 PM