దేవిశ్రీ సినిమాకు మ్యూజిక్ చేస్తానని నేనే అడిగా: థమన్
ABN, Publish Date - Jun 09 , 2026 | 09:26 PM
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాకు తనే సంగీతం అందిస్తానని స్వయంగా తనే అడిగినట్లుగా చెప్పుకొచ్చారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ (S Thaman) తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో అందరినీ బాగా ఆకర్షించిన విషయం ఏమిటంటే.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) హీరోగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమాకు తనే సంగీతం అందిస్తానని స్వయంగా అడగడం. ఒకప్పుడు దేవిశ్రీ వర్సెస్ థమన్ అనేలా పోటీ ఉండేది. ఒకరంటే ఒకరికి పడదనే భావం అందరిలో ఉండేది. అలాంటి అభిప్రాయాలు ఉన్న వారందరికీ తాజాగా సమాధానం ఇచ్చేశారు. ఈ విషయమై థమన్ మాట్లాడుతూ.. ‘‘గేమ్ ఛేంజర్ షూటింగ్ సమయంలో దిల్ రాజు నాకు ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్ చెప్పారు. కథ నాకు బాగా తెలుసు, అది డెఫినెట్‌గా సూపర్ హిట్ సినిమా. దేవి అన్న ఆ సినిమా కోసం చాలా బాగా వర్క్ చేస్తున్నాడు. అందుకే నేనే ఆ చిత్రానికి మ్యూజిక్ చేస్తానని అడిగాను’’ అని థమన్ చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో తన నటనపై స్పందిస్తూ.. ‘‘నేను మాత్రం హీరోగా చేయను. దేవుడు నాకు ఏసీ రూమ్‌లో కూర్చొని హ్యాపీగా మ్యూజిక్ వర్క్ చేసుకునే అవకాశం ఇచ్చాక.. మళ్లీ ఎండల్లో ఒళ్లు హూనం చేసుకుని నటించడం ఎందుకని’’ నవ్వుతూ సమాధానమిచ్చారు. తన ఇంటిపేరు గురించి మాట్లాడుతూ.. ఘంటశాల అనేది తన ఇంటిపేరని, కానీ దాన్ని ఒక పెద్ద బాధ్యతగా ఫీలవుతాను కాబట్టే సింపుల్‌గా ‘తమన్’ అని మార్చుకున్నానని, అయితే జనాలు మాత్రం తనకు నందమూరి, కొణిదెల అంటూ కొత్త ఇంటిపేర్లు కలిపేస్తున్నారని చమత్కరించారు.
ఇక తన డ్రీమ్స్, రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఒక మైథలాజికల్ (పౌరాణిక) సినిమాకు వర్క్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు థమన్ తెలిపారు. ఇండస్ట్రీలో ఎ.ఆర్. రెహమాన్, ఇళయరాజా వంటి లెజెండ్స్‌ను తాము ఎప్పుడూ పోటీగా ఫీలవ్వమని, వారు తమకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని స్పష్టం చేశారు. ఈ వయసులో కూడా ఏ.ఆర్. రెహమాన్ గారు ‘చికిరి చికిరి’ లాంటి ట్రెండీ పాట చేయడం చాలా ఆహ్లాదకరంగా అనిపించిందని, అలాగే 75 ఏళ్ల వయసులో ఇళయరాజా సరికొత్తగా స్టూడియో కట్టడం తమకు ఎంతో ఇన్‌స్పిరేషన్ ఇస్తుందని కొనియాడారు. ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఇట్లు అర్జున’, ‘ఆదర్శకుటుంబం’, చిరంజీవి-బాబీ కాంబినేషన్ చిత్రాలు దేనికవే వైవిధ్యమైనవని చెప్పారు. అలాగే అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమా కోసం పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, అతనికి ఈ సినిమాతో ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. క్రికెట్ గురించి ప్రస్తావిస్తూ వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ ఇండియా సూపర్ స్టార్ అంటూ ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు