బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్
ABN , Publish Date - Jun 09 , 2026 | 07:11 PM
నటసింహ నందమూరి బాలకృష్ణ జూన్ 10న 66 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు... బాలయ్య ఫ్యాన్స్ ఆయన బర్త్ డేని పండగలా జరుపుకుంటారు... నవతరం ప్రేక్షకుల్లోనూ క్రేజ్ సంపాదించుకున్న బాలయ్యకు అంతటి క్రేజ్ ఎక్కడిది?.
బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ 'భోళా బాలయ్య' అనే స్పెషల్ సాంగ్ ను రూపొందించి ఆనందిస్తున్నారు. ఆరు పదులు దాటితే వయసు మళ్ళింది అంటారు. కానీ, బాలయ్య మాత్రం యంగ్ హీరోగా సాగిన రోజుల్లో చూపిన ఉత్సాహమే ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే కొరటాల శివ డైరెక్షన్ లో మరో మూవీ మొదలు కానుంది. ఈ రెండు చిత్రాలే కాదు బాలయ్యతో సినిమాలు తీయడానికి యంగ్ డైరెక్టర్స్, మూవీ మేకర్స్ కూడా ఉరకలు వేస్తున్నారు. టాప్ స్టార్స్ సినిమాలు అధిక సంఖ్యలో వస్తేనే థియేటర్స్ మనుగడ సాగుతుందని ఎగ్జిబిటర్స్ ఆశిస్తున్నారు. వారికి ఊరటనిస్తూ బాలయ్య తాను ఏడాదికి రెండు, మూడు చిత్రాల్లో నటిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య ఎక్కువ సినిమాల్లో నటించడానికి సై అంటున్నారని తెలుస్తోంది. ఆయన సినిమాల సంఖ్య పెంచినా చూడటానికి నవతరం ప్రేక్షకులు సైతం ఉత్సాహం చూపించడమే ఇక్కడి విశేషం.
నవతరం హీరోల ముందు సీనియర్ స్టార్స్ నిలవలేరు అనే చాటింపు విశేషంగా సాగేది. అయితే కరోనా కల్లోలంలో థియేటర్స్ కు రావడానికే జనం జంకుతున్న సమయాన బాలకృష్ణ 'అఖండ'తో తొలి అడుగు వేశారు. జనాన్ని థియేటర్స్ వైపు వచ్చేలా చేసిందీ చిత్రం. అలా 'అఖండ' అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన ఇతరుల చిత్రాలకూ ఊపిరి పోసింది. బాలయ్య 'అఖండ'తో సాధించిన విజయం ఇతర సీనియర్ స్టార్స్ కు కూడా మరింత ఉత్సాహం నింపింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ప్రతి యేటా సీనియర్ స్టార్స్ ఏదో ఒక చిత్రంతో జైత్రయాత్ర చేస్తూ యంగ్ హీరోస్ కు సవాల్ విసరుతున్నారు. 'అఖండ' తరువాత నుంచీ బాలయ్య కూడా వరుస విజయాలతో పయనిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య బర్త్ డేకు మూడు రోజుల ముందే అభిమానులు 'భోళా బాలయ్య' సాంగ్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. బాలయ్యకు వరుస విజయాలు అందించిన బోయపాటి శ్రీను 'భోళా బాలయ్య' గీతాన్ని ఆవిష్కరించి ఫ్యాన్స్ కు మరింత ఆనందం పంచారు.
ఈ సారి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా చిత్రం గ్లింప్స్ రిలీజ్ కానుంది. దానికోసం సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు బాలయ్యతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని 'వీరసింహారెడ్డి' వంటి గ్రాండ్ సక్సెస్ చూశారు. ఇప్పుడు అదే కాంబోలో వస్తోన్న మూవీ కాబట్టి బాలయ్య లేటెస్ట్ వెంచర్ గ్లింప్స్ పై భారీ అంచనాలున్నాయి. మరి జూన్ 10న బాలయ్య తాజా చిత్రం గ్లింప్స్ ఏ తీరున ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు
Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్