జెన్ జీలో జోష్ నింపుతోన్న జానపదం.. దేనికి సంకేతం
ABN , Publish Date - Nov 09 , 2026 | 10:56 PM
తరాలు మారినా తరగని పెన్నిధి మన జానపదం. ఒకప్పుడు జనాల్లో నానిన పదాలతో జానపదగీతాలు వస్తే చాలు ‘జెన్ జీ’ సైతం బెంజి ఎక్కినంత ఆనందిస్తోంది. దాంతో మన తెలుగు సినిమాల్లో ఫోక్ సాంగ్స్ కిర్రెక్కించేలా రూపొందుతున్నాయి.
ఒకప్పుడు జనాలకు పరమానందం పంచిన జానపద గీతాలను (telugu folk songs) మన సినిమాల్లోనూ ఉపయోగించి ప్రేక్షకులను అలరించేవారు. ఇప్పుడు పాతపంథాలోనే కొత్తగా పాటలు కట్టి పరవశింప చేస్తున్నారు జానపద కవులు. బుల్లెట్ బండి ఎక్కి ‘డుగు డుగు...’ మంటూ పోతా అనే పంథాలోనే 2021లో తెలంగాణ పదాలతో ఓ జానపదం వెలుగు చూసింది. దాంతో మళ్ళీ ఫోక్ సాంగ్స్‌కు ఓ కొత్త ఊపు వచ్చింది. అంతకు ముందే త్రివిక్రమ్ తన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘రాములో రాములా...’ అంటూ సాగే పాటను తెలంగాణ పదాలతోనే రంగరించి రంజింప చేశారు. ఆ ఫోక్ సాంగ్ ఏ రేంజ్లో అలరించిందో అందరికీ తెలుసు. ‘అల వైకుంఠపురములో’ సినిమాను థియేటర్లో వీక్షించినవారిని సీట్లలో కుదురుగా కూర్చోనీయకుండా చేసింది ఈ ఫోక్ సాంగ్. ఆ సినిమా ఘనవిజయంలో ఈ పాటకు ప్రత్యేక వాటా ఉందనీ చెప్పొచ్చు.
ఒకప్పుడు తెలుగునేలపై విశేషాదరణ పొందిన జానపద గీతాలను, తత్త్వాలను ఆధారం చేసుకొని మన సినిమాల్లోనూ ఫోక్ సాంగ్స్ సాగాయి. సినిమాల్లో జానపదం అనగానే కొసరాజు రాఘవయ్య దగ్గరకే మూవీ మేకర్స్ ముందుగా పరుగులు తీసేవారు. ఆయనకు తెలుగు భాషపైనే కాదు, జనపదాల్లో నానే మాటలపైనా ఎంతో పట్టుండేది. తెలుగునేలపైని అన్ని యాసలను పుక్కిట పట్టేసిన ఘన చరిత కొసరాజు సొంతం. అందుకే ఆయనను ‘జానపద కవిబ్రహ్మ’ అన్నారు. ఆ తరువాతి రోజుల్లో ఎందరు జానపద గీతాలను సినిమా కోసం పలికించినా, ఫోక్ సాంగ్ అనగానే కొసరాజునే తలచుకొనేవారు జనం. కొసరాజు కలం నుంచి జాలువారిన జానపదాలు తెలుగుజనాన్ని ఈ నాటికీ పులకింప చేస్తూనే ఉండడం విశేషం. ఆయన కోస్తా, ఆంధ్ర, నెల్లూరు, రాయలసీమ, తెలంగాణ పదాలతో పాటలను పరుగులు తీయించారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో తెలంగాణ పదాలతో సాగే జానపదాలే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం విశేషం. అడపా దడపా కొన్ని చిత్రాల్లో రాయలసీమ, కోస్తాంధ్ర జానపదాలూ వెలుగు చూస్తున్నాయి.
చిన్నతనం నుంచీ ఇంగ్లిష్ చదువులతోనే అధికంగా సాగిన నవతరానికి మాతృభాషపై పట్టులేదు. అయితే మనలో ఇంకిపోయిన మాతృభాషాభిమానం ఎక్కడో ఒకచోట మన పల్లెపదాలపై ఆసక్తిని కలిగిస్తోంది. అందువల్లే ఇప్పుడు వస్తున్న జానపద గీతాలలో అంతగా జీవం లేకపోయినా, ఆ పదాల్లోని సహజత్వం మనవాళ్ళను ఆకర్షిస్తోంది. ఈ కారణంగానే పలు చిత్రాల్లో జానపదాలు వెలుగు చూస్తున్నాయి. అయితే అత్యధికులు తెలంగాణ జానపదంతోనే సాగుతూ ఉండడం విశేషం. ‘చల్ మోహనరంగ’లోని ‘పెద్దపులి...’, ‘ఫిదా’లోని ‘మెల్లగ వచ్చిండే...’, ‘లవ్ స్టోరీ’లోని ‘సారంగదరియా...’, ‘పలాస 1978’లోని ‘నక్కిలీసు గొలుసు..’, ‘కోట బొమ్మాళీ పీఎస్’లోని ‘లింగి లింగి లింగిడీ...’, ‘బలగం’లోని ‘బలరామ..’, ‘ద ప్యారడైజ్’లోని ‘ఏషనాగుల..’ వంటి సాంగ్స్ జనాన్ని మెప్పించాయి. త్వరలో విడుదల కానున్న ‘భోగి’లోని ‘యెగిలివారంగా.’ అంటూ సాగే గీతం అలరిస్తోంది. రాబోయే ‘రాయవలస’లోని ‘రింగుడు రింగుడు పిల్లా..’ సాంగ్ కూడా జానపద బాణీల్లోనే ఊపేస్తోంది. మరి మునుముందు మన తెలుగు సినిమాల్లో ఇంకా ఎన్ని జానపద గీతాలు పరవశింప చేస్తాయో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
సుమయా రెండో చిత్రానికి అంతా సిద్ధం.. వివరాలివే
సూర్య ‘సీన్’ 3 డేస్ కలెక్షన్స్.. హ్యాట్రిక్ కొట్టినట్టే
‘ధురంధర్ 2’ రికార్డులు బద్దలవుతున్నాయ్.. అంతా రామ మయం