సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డాన్సర్స్ వివాదం: ఫెడరేషన్ సీరియస్‌

ABN, Publish Date - Jul 16 , 2026 | 03:44 PM

తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ వివాదం రోజు రోజుకు ముదిరి పాకాన పడుతోంది. వీలైనంత త్వరగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ భావిస్తోంది.

Telugu Dancers Association

తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. జానీ, శేఖర్ మాస్టర్స్ వర్గాలు రెండుగా చీలి ఆదివారం జరిగిన సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో గొడవకు దిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఆ మర్నాడే ఇద్దరిని తన సినిమా షూటింగ్‌ దగ్గరకు పిలిపించి, మాట్లాడి సర్దుబాటు చేశారు. అనంతరం జానీ మాస్టర్... ఈ విషయాన్ని తెలియచేస్తూ శేఖర్ మాస్టర్ తో తనకు ఎలాంటి గొడవ లేదని, అదంతా మీడియా సృష్టి అని స్పష్టం చేశారు. అయితే శేఖర్ మాస్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదే సమయంలో జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డాన్సర్స్ అసోసియేషన్ లో ఇంటి దొంగలు ఉన్నారని, వారి అక్రమాలను ప్రశ్నించినందుకే తమను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. జానీ మాస్టర్, సుమలత మాట్లాడుతుండగానే డాన్సర్స్ అసోసియేషన్ లో తమ పదవులకు రాజీనామా చేసిన వారు వాగ్వివాదానికి దిగారు. తెలుగు డాన్సర్స్ కు జానీ మాస్టర్ అవకాశం ఇవ్వడం లేదని, ఆయన వైఖరి ఎండగట్టినందువల్లే తమను బయటకు పంపారని ఆరోపించారు.


ఇదే సమయంలో సుమలత ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పైనా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తమ అసోసియేషన్స్ అన్ని కలిస్తేనే ఫెడరేషన్ అవుతుందని, ఫెడరేషన్ తన ఇష్టానుసారంగా రూల్స్ పెడితే కుదరదని ఖరాఖండిగా తెలిపారు. ఫెడరేషన్ కనుసన్నలలో తాము నడిచే ప్రసక్తి లేదని సుమలత చెప్పారు. డాన్సర్స్ అసోసియేషన్ లోని ఇంటి దొంగలను ఫెడరేషన్ వారు సమర్థిస్తున్నారని, తమ బై లా లో లేని వాటిని తమపై రుద్దాలని చూస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలను ఫెడరేషన్ కార్యవర్గం సీరియస్ గా తీసుకుంది. గురువారం జరిగిన ఫెడరేషన్ నాయకుల సమావేశంలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలి వైఖరిని వారు తప్పుపట్టారు. ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని ఫెడరేషన్ నాయకులు భావిస్తున్నట్టు తెలిపారు. ఇరు వర్గాలను కూర్చోపెట్టి మాట్లాడి, ఓ పరిష్కారానికి రావాలని వారు ఆశిస్తున్నారని తెలిసింది. డాన్సర్స్ అసిసోయేషన్ ను అలానే వదిలేస్తే... అది ఫెడరేషన్ చేతకాని తనం క్రిందకు వస్తుందని, ఆ తర్వాత వివిధ యూనియన్లు కూడా ఇదే ధోరణితో ప్రవర్తిస్తే ఫెడరేషన్ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని వారు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే ఆదివారానికి ఈ వివాదానికి ఓ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే... ఫెడరేషన్ నాయకులను కార్యాలయంలో కలిసిన డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. తమ అసోసియేషన్ లోని అక్రమార్కులను ఫెడరేషన్ వెనకేసుకు వస్తోందని, తమ యూనియన్ ఎన్నికలకు ఫెడరేషన్ కు సంబంధం లేదని ఆమె తెలిపారు. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళతోనే పనిచేయాల్సి వస్తే తాము రాజీనామా చేస్తాము తప్పితే తప్పుడు పనులను సమర్థించలేమని ఆమె తెలిపారు. ఫెడరేషన్ నాయకులు గతంలో ఒకలా, ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని, దీనిని తాము ఎంతమాత్రం అంగీకరించమని ఆమె స్పష్టం చేశారు. మరి డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ఫెడరేషన్ నాయకులు ఎలాంటి పరిష్కారాన్ని యోచిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..

KA13: కిరణ్ అబ్బవరం పుట్టినరోజు స్పెషల్‌గా క్రేజీ మేకింగ్ వీడియో

మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్

Updated Date - Jul 16 , 2026 | 03:45 PM