మరోసారి దిల్ రాజు వర్సెస్ మైత్రీ.. దేవుడిపై భారం వేసిన ఎస్కేఎన్

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:22 PM

టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా దిల్ రాజు వర్సెస్ మైత్రీ మూవీ మేకర్స్ వివాదం ఏదో ఒక రూపంలో చర్చల్లో నిలుస్తూనే ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత, వ్యాపార వైరుధ్యాలను ఇండస్ట్రీ సమస్యగా చిత్రీకరిస్తూ ఇటీవల కొన్ని పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి.

SKN on Dil Raju vs Mythri

టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా దిల్ రాజు (Dil Raju) వర్సెస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వివాదం ఏదో ఒక రూపంలో చర్చల్లో నిలుస్తూనే ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత, వ్యాపార వైరుధ్యాలను ఇండస్ట్రీ సమస్యగా చిత్రీకరిస్తూ ఇటీవల కొన్ని పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా మరోసారి వీరి మధ్య బాక్సాఫీస్ వార్‌కు రంగం సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan), కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) సినిమాల రూపంలో టాలీవుడ్ మరోసారి వేడెక్కుతోంది. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమా విషయంలోనూ ఇలాంటి థియేటర్ల వివాదమే నడిచింది. ఆ అడ్డంకులను అధిగమించి సినిమా థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ‘పెద్ది’ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ను కట్టడి చేయలేకపోయిన దిల్ రాజుకు, ఇప్పుడు ‘జననాయగన్’ రూపంలో సరైన అవకాశం దొరికినట్లు టాలీవుడ్ మీడియా విశ్లేషిస్తోంది.


అసలు విషయానికొస్తే.. విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నైజాం ఏరియాలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. దీనికి సరిగ్గా ఒక రోజు తర్వాత, అంటే జూలై 24న కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను మైత్రీ సంస్థ పంపిణీ చేస్తోంది. ఒక రోజు ముందే వస్తోన్న ‘జననాయగన్’ సినిమాకు నైజాంలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లను దక్కించుకునేలా దిల్ రాజు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అదే కనుక జరిగితే, మరుసటి రోజు విడుదలయ్యే కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్‌స్టోరీ’కి తగినన్ని థియేటర్లు దొరకడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ థియేటర్లు లభించినప్పటికీ, మెయిన్ థియేటర్లు, ప్రైమ్ సెంటర్లను దక్కించుకోవడం మైత్రీ సంస్థకు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో నైజాం బాక్సాఫీస్ వద్ద థియేటర్ల పంపకం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అగ్ర నిర్మాత దిల్ రాజు నైజాం పంపిణీ రంగంలో తనకున్న పట్టుతో ‘జననాయగన్’కు మెజారిటీ స్క్రీన్లను కేటాయించే ప్రయత్నాల్లో ఉండగా, మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ కూడా ‘చెన్నై లవ్ స్టోరీ’ కోసం గట్టిగానే రంగంలోకి దిగుతోంది. గతంలో ‘పెద్ది’ సినిమాను విజయవంతంగా థియేటర్లలోకి తెచ్చిన మైత్రీ, ఈసారి కూడా దిల్ రాజు వ్యూహాలను తట్టుకుని కిరణ్ అబ్బవరం సినిమాకు థియేటర్లను సాధించగలదా లేదా అనేది చూడాలి. ఏదేమైనా, ఈ ఇద్దరు అగ్ర నిర్మాతల మధ్య నడుస్తున్న ఈ ఈగో వార్ టాలీవుడ్‌లో మరోసారి థియేటర్ల రాజకీయాలను హీటెక్కిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఎస్కేఎన్ స్పందనిదే..

ఇదే విషయాన్ని ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎస్కేఎన్‌ను (Producer SKN) మీడియా ప్రశ్నించగా.. ‘‘మా సినిమాకు మంచి థియేటర్లే లభిస్తాయని అనుకుంటున్నాము. నేను పిఆర్ఓ‌గా ఉన్నప్పుడు దిల్‌ రాజు నిర్మించిన సినిమాలకు కూడా పని చేశాను. రాజేష్ (మరో నిర్మాత సాయి రాజేష్) కూడా ఆయనకు చాలా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఎలాంటి ఫైట్ ఉండదు. మాకు కూడా మంచి థియేటర్స్ ఇస్తారని వినమ్రంగా నమ్ముతున్నాను. ఆ నమ్మకం నెక్స్ట్ వారంలో నిజమైనప్పుడు, వెంటనే ప్రెస్ మీట్‌ పెట్టి వాళ్లకి ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలని అనుకుంటున్నాము. సినిమా రిలీజ్ విషయంలో మాపై ఒత్తిడి లేదు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు ఇంకో రెండు మూడు డేట్స్ అనుకున్నాం. అదే టైమ్‌లో మా ఫ్రెండ్స్ నిర్మించిన సినిమాలు ఉండటంతో.. వారికి అడ్డుగా ఉండకూడదని చెప్పి, తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాము. స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా యాడ్ అయినాయని అనుకుంటున్నాము. ఏదిఏదైనా సరే ముందుకు వెళ్ళాలి. ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. ఎందుకంటే ఆ మాట వచ్చింది ఆయన పాదాల చెంత కాబట్టి ఆయన ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో మంచి స్ట్రెంత్ ఉంది. ఒక సీజన్‌లో రెండు మూడు సినిమాలు ఆడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో నేను వేరే సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను, మా సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

టాలీవుడ్ ఎంట్రీ.. అమ్మ, నాన్న ఏం చెప్పారంటే : రాషా తడానీ

నిన్న తండ్రితో... రేపు కొడుకుతో... నయన్ నట విన్యాసం!

పోసాని భార్యను బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా

Updated Date - Jul 15 , 2026 | 05:32 PM