Karikala: ముగ్గురు కథానాయికలతో.. సందీప్ కిషన్ ‘కరికాల’ ఆరంభం
ABN , Publish Date - Oct 15 , 2026 | 08:51 PM
సందీప్ కిషన్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న కరికాల సినిమా ఘనంగా ప్రారంభమైంది.
హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కరికాల’ (Karikala) ఘనంగా ప్రారంభమైంది. యుగంధర్ ముని (ugandhar Muni) దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా (Catherine Tresa), గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj), సాక్షి మడోల్కర్ (Sakshi Madolkar) కథానాయికలుగా నటిస్తున్నారు. గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది. తొలి సన్నివేశానికి ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘కరికాల’ కథను రెండు భాగాలుగా చెప్పినా ఎక్కడా బోర్ అనిపించలేదని తెలిపారు. ఆరు, ఏడు నెలలుగా దర్శకుడు యుగంధర్ ముని ప్రీ ప్రొడక్షన్ కోసం ఎంతో కష్టపడుతున్నారని ప్రశంసించారు. ఈ సినిమా తన కెరీర్లోనే బెస్ట్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. నాగలోకం, వానర లోకం వంటి విభిన్న ప్రపంచాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. కేథరిన్ థ్రెసా తన పాత్రపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పగా, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమా ప్రేక్షకులకు ఓ అందమైన మాయాలోకాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. సాక్షి మడోల్కర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు.
‘కరికాల’ తొలి భాగం 2027 జూలై 2న, రెండో భాగం అక్టోబర్ 28న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. భారీ ఊహా ప్రపంచం, ముగ్గురు కథానాయికలు, రెండు భాగాల కథతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.