Dheeraj Mogilineni: పవన్‌ను కలిసి మా సమస్యలు చెబుతాం!
ABN, Publish Date - May 27 , 2026 | 05:35 PM
యువ నిర్మాత ధీరజ్ మొగినేని తన మిత్రుడు గిరిబాబుతో కలిసి 'సమ్మర్ హాలిడేస్' మూవీని నిర్మించారు. 'దిల్' రాజు, యువ దర్శకుల సమక్షంలో ఈ సినిమా టీజర్ విడుదలైంది.
యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని అభిరుచి మిగిలిన కమర్షియల్ నిర్మాతలకు భిన్నంగా ఉంటుంది. కథాబలం ఉన్న సినిమాలను నిర్మించడానికి ఆయన తాపత్రయ పడుతుంటాడు. అందుకే తాజా ఓ చిల్డ్రన్ మూవీని ఆయన నిర్మించారు. అదే 'సమ్మర్ హాలిడేస్'. ప్రతి ఒక్కరి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఈ అందమైన కథా చిత్రాన్ని శ్రీకర్ తెరకెక్కించారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషీ ఇందులో కీలక పాత్రలు పోషించారు. అతి త్వరలో ఈ సినిమా జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో బుధవారం టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ దిల్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, 'ఇటీవల కాలంలో ఇంత సందడిగా మరే సినిమా ఈవెంట్ జరగలేదు. ధీరజ్... వంశీ పైడిపల్లి కజిన్. రెస్టారెంట్ బిజినెస్ రన్ చేసేవాడు. ఒక సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి రావాలనే తన ఆలోచన నాతో షేర్ చేసుకున్నాడు. రెస్టారెంట్ బిజినెస్‌లో బాగున్నావు కదా సినిమా ఇండస్ట్రీ రిస్క్ అని చెప్పాను. అయినా పట్టుదలగా ఇండస్ట్రీకి వచ్చాడు ధీరజ్. తనదైన దారి వేసుకుంటూ ఈ రోజు హిట్స్ మీద హిట్స్ అందుకున్నాడు. మనకు చిల్డ్రన్ ఫిలిం వచ్చి చాలా కాలమవుతోంది. పిల్లలతో చేసిన ఈ సినిమా ఈ సమ్మర్‌లో అందరినీ ఎంటర్ టైన్ చేయాలి, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నా. ఇవాళ ఇండస్ట్రీ బ్యాడ్ పొజిషన్ లో ఉంది. కొత్త దర్శకులు చాలా మంది ఈ ఈవెంట్‌కు వచ్చారు. చిన్న చిత్రాలతో వారు సాధిస్తున్న విజయాలు ఇండస్ట్రీకి బలంగా నిలబడుతున్నాయి. వాళ్లు చిన్న చిత్రాలతో మరిన్ని విజయాలు సాధించాలి, ఇండస్ట్రీ పచ్చగా ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, 'నేను ఇండస్ట్రీలోకి వచ్చేందుకు అరవింద్ గారు కారణం. ఆయనతో కలిసి గత నాలుగు చిత్రాలు చేశాను. సోలోగా ఇప్పుడు మూవీ చేస్తున్నా. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. ఈ కథ గత డిసెంబర్ లోనే విన్నాను. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాం. సమ్మర్ కు ఎలాగైనా రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ బెటర్ మెంట్స్, ఇతర అనుకోని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోతున్నాం. రిలీజ్ ఆలస్యమవుతున్నా సూపర్బ్ కంటెంట్ తో వస్తున్నామనే గర్వంగా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ గురించి చెబితే కొందరు పిల్లల సినిమా ఎవరు చూస్తారని నిరుత్సాహపరిచారు. నేను చిన్నప్పుడు 'లిటిల్ సోల్జర్స్' లాంటి మూవీ చూసి ఎంజాయ్ చేశాను. ఇలాంటి జానర్‌లో ఏడాదికి ఒక సినిమా వచ్చినా పిల్లలు, ఫ్యామిలీస్ థియేటర్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తారని నమ్మాను. నా టీమ్ అంతా సినిమా కోసం కష్టపడుతున్నారు. లక్కీగా ఈ కథకు కావాల్సిన ముగ్గురు మంచి పర్ ఫార్మర్స్, పిల్లలు దొరికారు. వాళ్లతో పాటు వాళ్ల పేరెంట్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ చిత్రంలో అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తున్న జయసుధ గారికి, కీ రోల్స్ చేస్తున్న వాసుకి, హర్షవర్థన్, రాజీవ్ కనకాల, హర్షిణి గారికి థ్యాంక్స్. ఇలాంటి మూవీ సక్సెస్ అయితే మరో నలుగురు ప్రొడ్యూసర్స్ ఈ జానర్ మూవీస్ చేస్తారు. నా స్నేహితుడు గిరి ఈ కథ వినగానే నా మీద నమ్మకంతో ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాడు. రీసెంట్ గా డిఫ్యూటీ సీఎం కల్యాణ్ గారిని పెద్ద ప్రొడ్యూసర్స్ వెళ్లి కలిశారు. పెద్ద ప్రొడ్యూసర్స్‌కు సమస్యలు ఉన్నట్లే మా చిన్న నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు మేమూ వెళ్లి పవన్ కల్యాణ్ గారిని కలిసి వివరిస్తాం. పైరసీ అరికట్టేందుకు పవన్ కల్యాణ్ గారి సహకారంతో కేంద్రమంత్రి అమిత్ షా గారిని కలవబోతున్నాం' అని అన్నారు.
ఇందులో తను తూర్పు గోదావరి జిల్లా యాసలో మాట్లాడే పాత్ర పోషించానని రాజీవ్ కనకాల తెలిపారు. స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో వస్తున్న సినిమా ఇదని, ఈ కథతో, ఇందులోని సన్నివేశాలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని నటి వాసుకీ అన్నారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం నిర్మాత ధీరజ్ కే చెందుతుందని దర్శకుడు శ్రీకర్ చెప్పారు. గతంలో 'దేవర, డాకూ మహరాజ్' చిత్రాలను తాను పంపిణీ చేశానని, ధీరజ్ ఈ సినిమా కథచెప్పిన తర్వాత నచ్చి నిర్మాణ భాగస్వామిగా మారానని గిరిబాబు అన్నారు. రైటర్ కొండల్ రావు, ఎడిటర్ సంతోష్ నాయుడు, లిరిసిస్ట్ కిట్టు విస్సుప్రగడ, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, బేబీ ఖుషి, మాస్టర్ అరుణ్, మాస్టర్ రోహన్, నటి హర్షిణి తదితరులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు కౌషిక్, నందకిశోర్, రవి నంబూరి, సాయి మార్తాండ్, రామ్ అబ్బరాజు, పవన్ సాదినేని, రాహుల్ రవీంద్రన్, సాయి రాజేశ్ తదితరులు 'సమ్మర్ హాలిడేస్' చక్కని విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!
మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా!
System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ