System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ
ABN , Publish Date - May 26 , 2026 | 10:57 PM
సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవార్కర్ కీలక పాత్రలు పోషించిన కోర్ట్ డ్రామా 'సిస్టమ్'. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కోర్ట్ డ్రామాలకు ఇవాళ కొదవలేదు. మరీ ముఖ్యంగా ఏ ఓటీటీ ఆన్ చేసినా... వెబ్ సీరిస్ రూపంలోనూ, ఓటీటీ సినిమాల రూపంలోనూ అవి కనిపిస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే... కోర్టు డ్రామాలంటేనే వ్యూవర్స్ పెదవి విరిచే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి సమయంలో రివేంజ్ ప్టోరీని కోర్ట్ డ్రామతో మిక్స్ చేసి... దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారి 'సిస్టమ్' సినిమాను తీశారు.
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, తమిళనటి జ్యోతిక, హిందీ చిత్రాల దర్శకుడు, నటుడు అశుతోష్ గోవార్కర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. దాంతో సహజంగానే దీనిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సిస్టమ్' ఎలా ఉందో తెలుసుకుందాం.
ప్రముఖ న్యాయవాది రవి రాజ్ వంశ్ (అశుతోష్ గోవార్కర్) లా ఫర్మ్ ను నడుపుతుంటాడు. అతని దగ్గర న్యాయవాదిగా పనిచేయాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి. సొంత కూతురైనా సరే ఆయన పెట్టే పరీక్షలో నెగ్గాల్సిందే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన కూతురు నేహా (సోనాక్షి సిన్హా)కూ రవి రాజ్ వంశ్ వరుసగా పది కేసులు గెలిస్తేనే తన లా ఫర్మ్ లోకి తీసుకుంటానని చెబుతాడు. కోర్టులో తడబడుతూ వాదనలు మొదలు పెట్టిన నేహాకు... కోర్ట్ స్టెనో సారిక రావత్ (జ్యోతిక) సహాయపడుతుంది. ఆమె సలహాలు, సూచనలతో వరుసగా తొమ్మిది కేసుల్ని నేహా గెలిచేస్తుంది. ఇక పదో కేసు గెలిచి తండ్రి లా ఫర్మ్ లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఆయనతోనే కోర్టులో తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రముఖ బిల్డర్, తన తండ్రి చిరకాల మిత్రుడైనా విక్రమ్ భజ్‌లాల్... ఇనయా కొఠారి అనే ఇన్ ఫ్లుయెన్సర్ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అతనికి శిక్ష పడేలా చేయాలని నేహా వాదిస్తే... తన స్నేహితుడు, క్లయింట్ అయిన విక్రమ్ ను సేవ్ చేయడానికి రవి రాజ్ వంశ్ ప్రయత్నిస్తాడు. ఈ తండ్రీ కూతుళ్ళ వాదప్రతివాదనలలో ఎవరిది పై చేయి అయ్యింది? నేహాను గైడ్ చేసి విజయపథంలోకి తీసుకొచ్చిన సారిక నేపథ్యం ఏమిటీ? ఇవాళ నిజంగా కోర్టులలో బాధితులకు న్యాయం జరుగుతోందా? అనేదే ఈ సినిమా.
లాయర్ వృత్తిని స్వీకరించిన వారిలో ఇవాళ మెజారిటీ న్యాయవాదులు తాము ఎవరి పక్షాన నిలిచామో వారు గెలవాలని అనుకుంటారు తప్పితే... న్యాయం గెలవాలని కోరుకోవడం లేదు. న్యాయమూర్తులు సైతం 'సాక్ష్యం'కు ఇచ్చే ప్రాధాన్యం 'నిజం'కు ఇవ్వడం లేదు. దాంతో దొంగ సాక్ష్యాలు, బలమైన వాదనలతో నిజానిజాలు తారుమారవుతున్నాయి. నిరపరాధులు జైళ్ళలో మగ్గిపోతుంటే, నేరస్థులు ఎంచక్కా సమాజంలో తలెత్తుకుని బతికేస్తున్నారు. ఈ అంశాలతో తెరకెక్కిందే 'సిస్టమ్'. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, డబ్బున వారి పక్షాన తీర్పులు అనుకూలంగా ఎలా వస్తోయో దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారీ చెప్పే ప్రయత్నం చేశారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి కోర్టులో న్యాయం దక్కనప్పుడు, తన తెలివి తేటలు, వ్యవస్థలోని లోపాలను ఉపయోగించి ఓ మధ్యతరగతి ఇల్లాలు ఎలా కక్ష తీర్చుకున్నదనే విషయాన్ని ఆసక్తికరంగా తెరపై చూపించారు. ఇందులోని ప్రతి పాత్రను అర్థవంతంగా మలిచారు. భారీ ట్విస్టుల జోలికి పోకుండా కన్వెన్సింగ్ గా తాను చెప్పాలని అనుకున్నది దర్శకురాలు చెప్పేశారు.
నటీనటుల విషయానికి వస్తే... యువ న్యాయవాదిగా సోనాక్షి సిన్హా చక్కగా నటించింది. ఆ మధ్య తెలుగులో వచ్చిన 'జటాధర' మూవీలోని పాత్రతో పోల్చితే ఇది ఎన్నో రెట్లు బెటర్. ప్రొఫెషనల్‌గా తండ్రిని ఢీ కొట్టే పాత్రలో మెప్పించింది. జ్యోతిక బేసికల్‌గానే మంచి నటి. దానికి తోడు ఇందులో ఆమెకు వైవిధ్యమైన పాత్ర లభించింది. ఈ పాత్ర ప్రవర్తన అనైతికం అనే భావన అక్కడక్కడా కలిగినా, వేరే మార్గం లేక అలా చేసిందనే సానుభూతి కలిగేలా జ్యోతిక ఆ పాత్రను పోషించింది. ఇందులో మరో కీలకమైన పాత్రను అశుతోష్ గోవార్కర్ సమర్థవంతంగా పోషించారు. ఇతర పాత్రలను అజయ్ మధోక్, ఆదినాథ్ కొఠారి, నిషాంత్ సింగ్, సయన్ దీప్ సేన్ గుప్తా తదితరులు చేశారు. అయితే వీరంతా తెలుగువారికి అపరిచితులే. కె. రంగరాజన్ రామభద్రక్ సినిమాటోగ్రఫీ, కార్తీక్ మాణికవాసకం నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎక్కడా లౌడ్‌గా అనిపించకుండా, సీన్ మూడ్ కు తగ్గట్టుగా సంగీతం ఉంది. ఇందులోని సంభాషణలను ప్రత్యేకంగా పేర్కొనాలి. 'రాయదగ్గవి చేయండి, చదవి దగ్గవి రాస్తాను' అని కోర్ట్ రిపోర్టర్ తో అనిపించడం బాగుంది. అలానే 'న్యాయం భగవంతుడు లాంటిది... అతి కష్టం మీదే దొరుకుతుంది' వంటివి ఆకట్టుకుంటాయి.
న్యాయవ్యవస్థలోని డొల్లతనం మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయినా దీనిని వాటి గాటన కట్టలేం. ఇది సమ్ థింగ్ స్పెషల్ కోర్ట్ డ్రామా! వాచ్ చేసిన తర్వాత మీరూ అదే అంటారు!
ట్యాగ్ లైన్: ఎంగేజ్డ్ కోర్ట్ డ్రామా!
రేటింగ్: 3.25/5
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్ బ్యాన్.. సడెన్ గా అక్కడ కనిపించిన ధురంధర్ హీరో
పెద్ది.. పస లేదు.. ఇంకా ఏదో కావాలి
Ntr Fans: తారక్ బర్త్‌డే.. ఆ కుటుంబానికి ఎంత అభిమానమో..