నన్ను చంపేందుకు కుట్ర.. ఫిర్యాదులో సుమలత పేర్కొన్న అంశాలివే!
ABN, Publish Date - Sep 23 , 2026 | 10:44 PM
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ వైఫ్ సుమలతా దేవి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ.. ఆరోపణలు చేశారు.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ వైఫ్ సుమలతా దేవి (Sumalatha Devi) బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ.. ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 23న ఇందిరానగర్‌లోని రాఘవ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం వేదికగా తనపై ముందస్తు పన్నాగంతో హత్యాయత్నం జరిగిందని, తనను తీవ్రంగా గాయపరిచి ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ భేటీకి ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేనితో పాటు పలువురు హాజరయ్యారని పేర్కొన్నారు.
సుమలత తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రధానాంశాల ప్రకారం.. శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, భాను మాస్టర్, అజయ్ సాయి మాస్టర్, జోసెఫ్ ప్రకాష్ మాస్టర్, శ్రష్టి వర్మ మాస్టర్ తదితరులు వేరొక అసోసియేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రస్తుత యూనియన్‌లో విభేదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. గతంలో రఘు మాస్టర్‌పై నమోదైన ఫోర్జరీ కేసును మనసులో పెట్టుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తూ, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని ప్రోద్బలంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో తీర్మానాలు, ఎజెండా అంశాలను అసోసియేషన్ మినిట్స్ బుక్‌లో సక్రమంగా నమోదు చేయకుండా ఖాళీ కాగితాలపై సంతకాలు సేకరించి, ఆ కీలకమైన మినిట్స్ బుక్‌ను ఫెడరేషన్ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు యత్నించారని ఆరోపించారు. అధికారిక రికార్డులను తీసుకెళ్లకుండా తాను అడ్డుకోగా.. దీప్తి, పూజిత, కల్యాణి, సుమతి, విమల, కోకిల, మాధుర్య, శ్రీదేవి, ఏడుకొండల శ్రీను సహా మరికొందరు వ్యక్తులు తనను చుట్టుముట్టి చేతులతో విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ దాడి సమయంలో ‘‘ఇక్కడ నుంచి రాజీనామా చేయకపోతే చంపేస్తాం’’ అంటూ నేరుగా ప్రాణహాని బెదిరింపులకు దిగారని సుమలత వాపోయారు. తనను కాపాడేందుకు ప్రయత్నించిన కార్యవర్గ సభ్యుడు ఎం. రాములు, మహిళా సభ్యురాలు మధు షామిలిపై కూడా దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కుట్ర వెనుక ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి ఎల్లంకి శ్రీనివాస్‌తో పాటు కొరియోగ్రాఫర్లు శేఖర్, రఘు, భాను, అజయ్ సాయి, జోసెఫ్ ప్రకాష్, శ్రష్టి వర్మల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలు, సభ్యుల మొబైల్ వీడియోలు, ఆడియో ఆధారాలను వెంటనే స్వాధీనం చేసుకుని నిందితులపై క్రిమినల్ కేసులు (BNS చట్టాల ప్రకారం) నమోదు చేయాలని, తనకు, తన కుటుంబ సభ్యులకు తక్షణ పోలీసు రక్షణ కల్పించాలని సుమలత కోరారు.
ఇవి కూడా చదవండి:
‘మండాడి’.. మొన్న రజనీకాంత్.. ఇప్పుడు యూనివర్సల్ హీరో
‘మిస్ కాళికా మిస్సింగ్’.. ఎంత వరకు వచ్చిందంటే
సరికొత్త రికార్డులు సృష్టించాలి.. నాని ‘ద ప్యారడైజ్’కు మెగా ఆశీస్సులు