Anchor Suma: ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్’ వెనుక సుమ మనసులోని మాట!
ABN, Publish Date - Nov 01 , 2026 | 10:55 AM
యాంకర్ సుమ.. యాంకరింగ్ రంగంలో 25 ఏళ్ల మైలురాయిని అందుకున్నారు. అంతే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు.
బుల్లితెరపై సుమ అంటేనే సందడి.. ఆమె మాటల్లో చమత్కారం, నవ్వులో ప్రత్యేకత, యాంకరింగ్‌లో తిరుగులేని శైలి. ఇలా పాతికేళ్లుగా ప్రేక్షకులను తన మాటల మాయలో ముంచెత్తుతున్న యాంకర్ సుమ.. యాంకరింగ్ రంగంలో 25 ఏళ్ల మైలురాయిని అందుకున్నారు. అంతే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఆమె నడిపిస్తున్న ‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్’ ఎలా పుట్టుకొచ్చిందో చెప్పుకొచ్చారు. సుమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
అలా వచ్చిన ఆలోచనే
చిన్నప్పుడు మా అమ్మతో కలిసి గుడికి వెళుతుండేదాన్ని. గుడి ముందు ఉన్న బిచ్చగాళ్లలో ఒకరికి అమ్మ పది రూపాయలు ఇచ్చి అందరినీ తీసుకోమని చెప్పేది. అందరికీ తలో పది రూపాయలు ఇవ్వాలంటే..? నా దగ్గర చాలా డబ్బులు ఉండాలని అనిపించేది. పెద్దవుతున్న కొద్దీ ఆ ఆలోచన మారింది. డబ్బు ఇవ్వడం కాదు అలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన పెరుగుతూ వచ్చింది. చదువు పూర్తయి నేను సంపాదించడం మొదలుపెట్టాక కొద్దికొద్దిగా ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టా. మొదట మా ఇంట్లో పనిచేసే వాళ్ల పిల్లలకు చదువు చెప్పించడం, వాళ్ల అవసరాలకు ఆదుకోవడం లాంటివి చేసేదాన్ని. కానీ ఎక్కువ మందికి సాయం చేయటానికి నా స్తోమత సరిపోదనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఈఎంఐలు, పిల్లలు చదువులు, కుటుంబ భాధ్యతలు ఉంటాయి కదా! కానీ నాలా సాయం చేయాలనుకొనేవారు ఉంటారు కదా.. వారిని ఒక తాటి మీదకు తెచ్చి.. సాయం కావాల్సిన వారితో అనుసంధానం చేస్తే బావుంటుందనిపించింది. అలా పుట్టిందే ‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్’. అందరి జీవితాల్లో వెలుగు నింపటమే ఈ సంస్థ ఉద్దేశం. దీని ద్వారా అనేక మందికి సాయం అందించగలిగాను. ఈ మధ్యే ఈ సంస్థ ప్రారంభించి ఐదేళ్లు అయిన సందర్భంగా ఘనంగా ఒక కార్యక్రమం కూడా నిర్వహించాం.
ఇమిటేట్ చేస్తున్నానంతే..
నా బంధువులంతా కేరళలోనే ఉన్నారు. పండుగలప్పుడు, సెలవులు దొరికినప్పుడు కేరళ వెళుతుంటాను. మా మావయ్యలు, బాబాయిలు, కజిన్స్ అందరూ ఎప్పుడూ సరదాగా జోక్‌లు వేసుకుంటూ ఒకరినొకరు నవ్వించుకుంటూ ఉంటారు. అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఇక్కడ కేవలం భాషను మార్చి ఆ ధోరణిని ఇమిటేట్ చేస్తున్నానంతే. స్కూలు, కాలేజీల్లో కూడా అందరూ నన్ను ఓ కామెడీ పీస్‌లా చూసేవారు. టీచర్లను, లెక్చరర్లను, ప్రిన్సిపాల్‌ని అనుకరిస్తూ సరదాగా ఉండేదాన్ని. ప్రోగ్రామ్‌లో స్టేజ్‌మీదే కాదు ఇంట్లో స్నేహితులతో ఉన్నా కూడా అంతే సందడిగా ఉంటా.
ఆ జీన్సే అనుకుంటా
మా తాత పి.బి. మీనన్‌గారి వందో పుట్టినరోజుని ఈమధ్యే చాలా గ్రాండ్‌గా జరిపాము. ఆయన కేరళలో అడ్వకేట్. ఇప్పటికీ ఆయన ప్రతి రోజూ కోర్టుకు వెళ్తారు. ఆయన లా సెక్షన్లేమి మర్చిపోలేదు.. ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మా అమ్మ తరపు వాళ్లు చాలా క్రమశిక్షణతో ఉంటారు. బహుశా నాకు ఆ జీన్స్ వచ్చి ఉంటాయి.
ALSO READ:
Anchor Suma: నా వృత్తిజీవితాన్ని గెలిపిస్తూ వచ్చింది అదే.. నా నిర్ణయం సరైనదే!
RC17: అఫీషీయల్.. ఆర్సీ17 పూజ అప్పుడే
Sai Palalvi: మనకేం రాసుందో అదే జరుగుతుంది.. దానికోసం యుద్దాలు అక్కర్లేదు