Anchor Suma: నా వృత్తిజీవితాన్ని గెలిపిస్తూ వచ్చింది అదే.. నా నిర్ణయం సరైనదే!

ABN , Publish Date - Nov 01 , 2026 | 09:03 AM

యాంకర్‌ సుమ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన చలాకీతనంతో... గలగల మాటలతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకొనే సుమ... యాంకరింగ్‌ రంగంలోకి ప్రవేశించి 25 ఏళ్లు పూర్తయింది.

యాంకర్‌ సుమ (Suma) గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన చలాకీతనంతో... గలగల మాటలతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకొనే సుమ... యాంకరింగ్‌ (Suma Anchoring) రంగంలోకి ప్రవేశించి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...

నేను సినీ రంగంలోకి వచ్చి 36 ఏళ్లు అయింది. యాంకరింగ్‌ ప్రారంభించి 25 ఏళ్లు అయింది. మొదట్లో నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని. ఎవరికీ ఎదురు చెప్పేదాన్ని కాదు. బయట ఎక్కడా నోరెత్తి మాట్లాడేదాన్ని కాదు. ప్రతి చిన్నదానికీ కంగారుపడుతుండేదాన్ని. ఇప్పుడు నేను చాలా విషయాల్లో మారాను. కానీ మారనది ఒకటుంది. సంతోషంగా ఉండటం. అప్పటికీ ఇప్పటికీ ఈ స్వభావం మాత్రం మారలేదు.

మీ తొలినాళ్లు గుర్తున్నాయా?

నా కెరీర్‌ దూరదర్శన్‌లో మొదలైంది. ఆ రోజుల్లో దూరదర్శన్‌ కోసం కొందరు ప్రైవేట్‌ ప్రొడ్యూసర్స్‌ ప్రోగ్రాములు నిర్మించేవారు. వాటిలో మేము యాంకరింగ్‌ చేసేవాళ్లం. ఒక పాట ప్రసారం చేయాలంటే.. దాని ముందు మేము వచ్చి ఆ పాట గురించి చెప్పేవాళ్లం. ఇప్పుడైతే ఆధునిక టెక్నాలజీలు వచ్చాయి కానీ ఆ రోజుల్లో యాంకరింగ్‌కు కూడా డబ్బింగ్‌ చెప్పాల్సి వచ్చేది. మొదట్లో మమ్మల్ని అనౌన్సర్‌, వీడియో జాకీ, హోస్ట్‌.. ఇలా రకరకాల పేర్లతో పిలిచేవారు. నేను వచ్చిన 9 ఏళ్ల తర్వాత యాంకర్‌ అని పిలవటం మొదలుపెట్టారు.

హీరోయిన్‌గా ఎందుకు స్థిరపడలేకపోయారు?

మొదట్లో కొన్ని సినిమాలు చేశాను. కానీ నా స్వభావానికి వెండితెర కంటే బుల్లి తెరే అనువుగా అనిపించింది. అప్పుడు హీరోయిన్‌గా కొనసాగి ఉంటే ఈపాటికి క్యారెక్టర్‌ ఆరిస్టు అయ్యేదాన్ని. యాంకరింగ్‌లోకి రావటంవల్ల నాకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు వచ్చాయి. ఈ కోణం నుంచి చూస్తే నా నిర్ణయం సరైనదే అనిపిస్తుంది.

పాతికేళ్ల ఈ ప్రయాణం ఎలా సాగింది?

నా జీవితం రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ అని చెప్పాలి. నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు.. వాళ్లు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా యాంకరింగ్‌ చేసేదాన్ని. అప్పుడు ఇటు యాంకర్‌గా.. అటు అమ్మగా సతమతమయ్యేదాన్ని. జీవితంలో ఎలాంటి సందర్భం ఎదురైనా.. రాత్రంతా బాధపడినా.. ఉదయాన్నే ఓ గుడ్‌ మార్నింగ్‌తో అందరినీ నవ్వుతూ పలకరిస్తూ నాలో నేనే ఉత్సాహాన్ని నింపుకుంటూ సాగిపోయే స్వభావం నాది. ఇదే నా వృత్తిజీవితాన్ని గెలిపిస్తూ వచ్చింది. కాళ్లకు సర్జరీలై స్టిచె్‌సతో నిలబడిన రోజులు, గొంతుపెగలకపోయినా మాట్లాడిన రోజులు, అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను వెంట తెచ్చుకుని స్టేజ్‌ ప్రోగ్రామ్‌లు చేసిన రోజులు, వర్టిగోతో కళ్లు తిరిగి పడిపోయినా గంటలో సెట్‌ చేసుకుని లైవ్‌ ప్రోగ్రామ్‌ చేసిన రోజులు ఉన్నాయి. నాన్నగారు చనిపోయినప్పుడు ఆ కార్యక్రమం పూర్తయిన తెల్లారే స్టేజ్‌మీద నిలబడాల్సి వచ్చింది. ఇలా ఎన్ని కష్టాలొచ్చినప్పటికీ ఎప్పుడూ మాట తప్పలేదు. ఆ అంకితభావమే లేకుంటే ఇన్నాళ్లు యాంకర్‌గా నిలబడగలిగేదాన్ని కాదేమో!

మిమల్ని మీరు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారా?

ప్రతి రోజూ చేసుకుంటా! ఉదయం లేవగానే ముందు రోజు చేసిన ప్రోగ్రామ్‌లో ఏం మాట్లాడానో అంతా గుర్తుకువస్తుంటుంది. ఏ మాటనైనా సరిచేసుకోవాలా? ఇంకో రెండు ప్రశ్నలు అడిగి ఉండాల్సిందా? లాంటి ప్రశ్నలెన్నో మనసును తొలుస్తూ ఉంటాయి. ట్రెండ్‌కు తగ్గట్టు మాట్లాడాల్సిన తీరు.. విభిన్నంగా అడగాల్సిన ప్రశ్నలు.. వాడే టెక్నాలజీ.. వేసుకొనే బట్టలు- ఇలా ప్రతి విషయం గురించి ఆలోచిస్తూ ఉంటా! ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉంటాను. ఇక నాకు మా పిల్లలే క్రిటిక్స్‌! మా అబ్బాయి కన్నా అమ్మాయి తన అభిప్రాయం కరాఖండిగా చెబుతుంది.

సుమ కట్టుకొనే చీరలకు క్రేజ్‌ ఉంది కదా... వీటిని ఎలా ఎంపిక చేసుకుంటారు?

నాకు హ్యాండ్‌లూమ్‌ చీరలంటే చాలా ఇష్టం. వైట్‌, క్రీమ్‌, స్కై బ్లూ కలర్స్‌ అంటే ఇష్టం. ఇక్కడో తమాషా విషయం చెబుతా. మా చిన్నప్పుడు నాన్నగారికి ఉద్యోగరీత్యా సంపాదన తక్కువ. ఏడాదికో డ్రెస్‌ కొనిపెట్టేవారు. వేసవికాలంలో అయితే రోడ్డుమీద అమ్మేవి ఒకట్రెండు కొనేవారు. అమ్మ ఊరెళ్లినప్పుడు పెద్దమ్మ, చిన్నమ్మలు ఇచ్చిన డ్రెస్‌లు తెచ్చేది. వాటిని జాగ్రత్తగా వేసుకుంటూ నాలుగైదేళ్లు గడిపేవాళ్లం. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన నేను షోల కోసం రోజుకు నాలుగైదు డ్రెస్‌లు మారుస్తున్నా!

0001m-navya.jpg

మహిళలు-మహారాణులు షో చేసే రోజుల్లో నేను వేసుకున్న బ్లౌజ్‌లను చూసి చాలామంది ఆడవాళ్లు ఫొటోలు తీసుకుని అలాగే కుట్టించుకునేవారు. రంగుల కాంబినేషన్లను కూడా రాసిపెట్టుకునేవారు. సుమకి బాగుంది కాబట్టి నాక్కూడా నప్పుతుంది అనుకునేవారు. ఇప్పటికీ అలా అనుకొనేవారు అనేక మంది ఉన్నారు. ఇక డ్రెస్‌ల ఎంపిక విషయానికి వస్తే- నా దగ్గర అన్నపూర్ణ అని ఉన్నారు. ఆమె నాకు రకరకాల డ్రెస్‌లు సోర్స్‌ చేసి పెడుతుంది. నా ముందు నాలుగైదు పెడితే- సందర్భానికి తగ్గట్టుగా నేనొకటి ఎంపిక చేసుకుంటా. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నాకు ఇంట్లో ఎక్కువ బట్టలు ఉంటే టెన్షన్‌ వచ్చేస్తుంది. కేవలం ఒక పది చీరలు మాత్రమే ఉంచుకుంటా. మిగిలినవన్నీ మా ఇంట్లో పనిచేసేవాళ్లకు ఇచ్చేస్తా.

మొదట్లో బాధగా ఉండేది..

నేడు సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా ఉంది. నా ఉద్దేశంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లు పొగడ్తలను, విమర్శలను అంతగా పట్టించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే కొందరు తమ వ్యూస్‌ పెరగాలనే ఉద్దేశంతో నెగిటివిటీని ప్రచారం చేస్తూ ఉంటారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. ఓ ప్రోగ్రామ్‌లో యాంకరింగ్‌ చేసేటప్పుడు ఎవరి గురించో మనం అన్న మాటలను పూర్తిగా వక్రీకరించి లేని ఉద్దేశాలను ఆపాదిస్తూ చేసేవారు ఉంటారు. ఇలాంటి కామెంట్స్‌ చదివినప్పుడు మొదట్లో బాధపడేదాన్ని. ఇప్పుడు పట్టించుకోవటం మానేశా! సోషల్‌ మీడియా వచ్చిన కొత్తల్లో నాలో కూడా ఒక భయం ఉండేది... స్టేజ్‌మీద చిన్న జోక్‌ చెప్పినా దాన్ని అవతలవాళ్లు ఎలా అర్థం చేసుకుంటారోనని. అప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టా. నా ప్రవర్తన నాకే కృత్రిమంగా అనిపించేది. దాంతో నా సహజసిద్ధమైన సరదా ధోరణిని కొనసాగించటం మొదలుపెట్టా. మన ఇంట్లో అక్కతో పిన్నితో బాబాయితో ఎంత సందడిగా ఉంటామో.. బయట ప్రొగ్రామ్‌లలో కూడా అలాగే ఉంటా!

ALSO READ:

RC17: అఫీషీయల్.. ఆర్సీ17 పూజ అప్పుడే

Sai Palalvi: మనకేం రాసుందో అదే జరుగుతుంది.. దానికోసం యుద్దాలు అక్కర్లేదు

Updated Date - Nov 01 , 2026 | 10:35 AM