Sai Palalvi: మనకేం రాసుందో అదే జరుగుతుంది.. దానికోసం యుద్దాలు అక్కర్లేదు
ABN , Publish Date - Nov 01 , 2026 | 08:15 AM
సహజమైన అందం... అద్భుతమైన అభినయం... అదిరిపోయే డ్యాన్స్... సాయి పల్లవి (Sai Pallavi) ప్లస్పాయింట్స్. ఈ నేచురల్ బ్యూటీ ‘రామాయణ’లో (Ramayana)సీతమ్మగా కనిపిస్తుండటంతో అందరి దృష్టి ఆమెపైనే ఉంది.
సహజమైన అందం... అద్భుతమైన అభినయం... అదిరిపోయే డ్యాన్స్... సాయి పల్లవి (Sai Pallavi) ప్లస్పాయింట్స్. ఈ నేచురల్ బ్యూటీ ‘రామాయణ’లో (Ramayana)సీతమ్మగా కనిపిస్తుండటంతో అందరి దృష్టి ఆమెపైనే ఉంది. ఈ సందర్భంగా వెండితెర సీతమ్మ చెబుతున్న కబుర్లివి...
ఇద్దర్నీ బ్యాలెన్స్ చేస్తూ...
చిన్నప్పుడు నాన్న చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పేవారు. అమ్మ చదువుతో పాటు.. ఇతరత్రా కళలు తెలిసుండాలనేవారు. అందుకే ప్రాపంచిక విషయాల గురించి నాన్నతో, ఎమోషనల్ విషయాలు అమ్మతో ఎక్కువగా పంచుకుంటా. అలా ఇద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చా. కోపం వస్తే కొట్టినా కూడా... నాన్నంతలా భయపెట్టేది కాదు అమ్మ. అయితే ఆశ్చర్యంగా ఇప్పుడు వాళ్లిద్దరికీ నేనంటే భయం.
ఆ విషయం తెలిసి షాకయ్యా...
నాన్న ఫుట్‌బాల్ ప్లేయర్. ఇండియా తరపున కూడా ఆడారు. కానీ ఆ విషయం నాకు కొన్ని సంవత్సరాల క్రితమే తెలిసింది. ఈ విషయం తెలిసినప్పుడు నేను షాకయ్యా. ఎప్పుడూ ఆయన గొప్పతనం మాకు తెలియాలనుకోలేదు. సింపుల్ జీవితాన్ని ఇష్టపడతారు. మాకూ అదే అలవాటు చేశారు. ఆటల్లో రెండు కాళ్లకు దెబ్బ తగిలి, రెండు కాళ్లల్లో స్టీల్ ప్లేట్స్ వేశారట. అందువల్లే ఆటకు గుడ్ బై చెప్పేశారు.

వేగం వద్దు...
డాక్టర్‌గా ఇంటర్న్‌షిప్ సమయంలో ఒక పేషెంట్‌తో మాట్లాడిన ఐదు నిమిషాల తర్వాత ఆవిడ చనిపోయారని తెలిసింది. నేను అప్పుడే మాట్లాడిన మనిషి లేదు అనే విషయం నన్ను చాలా బాధించింది. యాక్సిడెంట్ కేసులు చూసినా, విన్నా కూడా నేను తట్టుకోలేను. నిమిషం నెమ్మదిగా వెళితే ఏమన్నా అవుతుందా? వేగం మనుషుల్ని చంపేస్తుంది. అది గుర్తుపెట్టుకొని జీవించాలి.
ప్రయత్నం చేస్తే...
మనకేం రాసుందో, మనకేం జరగాలో అదే జరుగుతుంది. దానికోసం యుద్ధాలు చేయడం, అరిచేయడం చేయొద్దు. చేసే పని కోసం కష్టపడాలి. ఆ ప్రయత్నమే ఎవరినైనా విజయతీరాల వైపు నడిపిస్తుంది. ఈ నమ్మకం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అది అమ్మ దగ్గర నుంచి అలవాటు చేసుకున్నా.

వర్క్‌షాపుల్లో పాల్గొన్నా..
చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్య నన్ను చూసి దేవతనే మా ఇంట్లో పాపగా పుట్టింది అనేవారు. నేను సీత పాత్ర చేస్తున్నా అన్నప్పుడు వారి సంతోషం మాటల్లో చెప్పలేను. ఎప్పుడెప్పుడు నన్ను సీతగా చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రామాయణ’లో సీత పాత్ర గురించి జూమ్‌కాల్‌లో నాకు దర్శకుడు నితిష్ తివారీ చెప్పారు. ఆ తర్వాత ముంబయిలో చిన్నపాటి ఆడిషన్ చేశారు. కొన్ని యాక్షన్ సీన్స్ కోసం వర్క్‌షాపులు కూడా నిర్వహించారు. మొత్తానికి మూడేళ్ల శ్రమ, నిరీక్షణ తర్వాత సీతగా వెండితెరపై కనిపించబోతున్నా.
ఆ ఫొటోలు చూడను..
నా చెల్లి పూజ పెళ్లి జరిగినప్పుడు చాలా ఎమోషనలయ్యా. అప్పటిదాకా నేను తనని నా కూతురిలా చూసుకున్నా. నాతో పాటు ఉన్న నా పాప ఇంకో ఇంటికి పోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయా. అమ్మానాన్న కన్నా నేనే ఎక్కువ ఏడ్చేశా. తన పెళ్లయ్యి ఏడాది కావొస్తోంది. అయితే నేను ఇప్పటిదాకా తన పెళ్లి ఫొటోలు చూడలేదు. ఒకవేళ వాటిని చూస్తే మళ్లీ ఎమోషనల్ అవుతానేమోనని భయం.