సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కార్తికేయను వెంటాడుతున్న ‘ఆకాశవాణి’.. ఫహద్ 'అసరీరి' తెలుగులో!

ABN, Publish Date - Nov 24 , 2026 | 04:05 PM

ఫహద్ ఫాజిల్ నటించిన తమిళ చిత్రం ‘అసరీరి’ తెలుగు హక్కులను ఎస్.ఎస్. కార్తికేయ సొంతం చేసుకున్నారు. జనవరి 1న విడుదల కానున్న ఈ సినిమా టైటిల్‌కు, గతంలో కార్తికేయ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ‘ఆకాశవాణి’ సినిమాకు ఆసక్తికరమైన సంబంధం ఉంది.

Fahadh Faasil's Asareeri

దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు ఎస్. ఎస్. కార్తికేయకు ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. తండ్రి తరహాలో దర్శకుడు కాకుండా, మొదటి నుంచి ప్రొడక్షన్ వ్యవహారాలపైనే ఆసక్తి కనబరుస్తూ వచ్చాడు. రాజమౌళి తెరకెక్కించే సినిమాల నిర్మాణ వ్యవహారాలను కార్తికేయ చూసుకుంటూ ఉంటాడు. ఈ యేడాది ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా కార్తికేయ, సీనియర్‌ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనితో కలిసి 'డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్‌' అనే సినిమాను నిర్మించాడు. అగ్రతారలు 'అమోఘం' అంటూ బాకా ఊదిన ఈ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండకపోవడంతో జనాలు ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వైపు వెళ్ళడానికే భయపడ్డారు. అయితే ఫహద్‌తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నా.. కార్తికేయ మాత్రం ఆయన్ని వదిలిపెట్టడం లేదు. ఫహద్‌ నటించిన తమిళ చిత్రం 'అసరీరి' తెలుగు హక్కులను సొంతం చేసుకుని, జనవరి 1న విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటన ఇలా వచ్చిందో లేదో విమర్శలు మొదలయ్యాయి. 'అసరీరి' అంటే అర్థం ఏమిటో తెలియక తెలుగు జనాలు గూగుల్‌ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. నిజానికి అది 'అశరీరి'. అంటే శరీరం లేనిది... 'ఆకాశవాణి' అని అర్థం. తమిళంలో దీనిని 'అసరీరి' అని పలుకుతారు కాబట్టి... అదే పేరును తెలుగులోనూ ప్రకటించారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది.


ఇది ఆరేళ్ళ క్రితం నాటి మాట. ఎస్.ఎస్. కార్తికేయ సినిమా రంగంలోకి నిర్మాతగా అడుగు పెట్టాలనుకున్నప్పుడు 'ఆకాశవాణి' అనే సినిమాను ప్రకటించాడు. అశ్విన్ గంగరాజు ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. సముతిరకని కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు ఎ. పద్మనాభ రెడ్డి నిర్మాత. కొంత కాలం షూటింగ్‌ జరిగిన తర్వాత క్రియేటివ్‌ డిఫరెన్సెస్ కారణంగా కార్తికేయ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి సినిమా జనం ముందుకు వచ్చింది కానీ విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పుడు 'ఆకాశవాణి' ప్రాజెక్ట్ నుంచి కార్తికేయ తప్పుకున్నా... ఇప్పుడు మరోసారి 'అసరీరి' పేరుతో 'ఆకాశవాణి' అతన్ని వదిలి పెట్టకుండా పట్టుకుంది. ఇంతకూ 'అసరీరి' పేరుతోనే ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తారా లేక రిలీజ్‌ ముందైనా తెలుగు పేరు పెడతారా? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే

సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

RC17: రామ్ చరణ్ సరసన ఆ ‘తార’ ఫిక్స్ అయినట్టేనా?

Updated Date - Nov 24 , 2026 | 04:32 PM