సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Paradise: అందరి చూపు శ్రీకాంత్‌ ఓదెల పైనే!

ABN, Publish Date - Sep 15 , 2026 | 10:21 AM

ఫస్ట్ మూవీతోనే మురిపించిన వారికి సెకండ్ సినిమా అగ్నిపరీక్ష లాంటిది. ఆ ఎగ్జామ్ లో పాసవ్వకుంటే జనం అదోలా చూస్తారు. అలాంటి పరీక్షలో ఈ మధ్య కొందరు టాలీవుడ్ డైరెక్టర్స్ బోల్తా కొట్టారు. దాంతో రెండో సినిమా తీస్తోన్న శ్రీకాంత్‌ ఓదెల వైపు సినీ ఫ్యాన్స్ చూపు సాగుతోంది.

Tollywood Directors

ప్రస్తుతం అందరి చూపు న్యాచురల్ స్టార్ నాని నటించిన 'ద ప్యారడైజ్' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వైపు సాగుతోంది. శ్రీకాంత్ మొదటి సినిమా 'దసరా' దర్శకునిగా ఆయనకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. 'దసరా'లో నాని కూడా విలక్షణమైన గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన రెండో చిత్రం 'ద ప్యారడైజ్'లోనూ నానినే హీరోగా ఎంచుకున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాలోనూ నానీని విలక్షణమైన గెటప్ లో జడలతో చూపిస్తున్నారు. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలని సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి చోటు చేసుకుంది. సెకండ్ మూవీతోనూ శ్రీకాంత్ మంచి మార్కులు సంపాదిస్తే ఆ తరువాత ఆయన సక్సెస్ రూటులో సాగిపోవడానికి ఆట్టే అడ్డంకులు ఉండవని పరిశీలకులు అంటున్నారు.


గతంలోనూ ఎందరో తెలుగు చిత్ర దర్శకులు మొదటి సినిమాతో మంచి మార్కులు సంపాదించి, రెండో చిత్రంతో బోల్తా కొట్టిన వారున్నారు. ఇలా మొదటి సినిమా, రెండో చిత్రం అన్నవి ఏ దర్శకునికైనా అతి ప్రధానమైనవి. అప్పట్లో తేజ సైతం 'చిత్రం'తో సూపర్ డూపర్ హిట్‌ అందుకుని ఆ తర్వాత 'ఫ్యామిలీ సర్కస్‌'తో బోర్లా పడ్డారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే... తొలి చిత్రం 'ఉప్పెన'తో అనూహ్య విజయం సాధించిన బుచ్చిబాబు సానాపై ఎంతో నమ్మకంతో రామ్ చరణ్‌ లాంటి స్టార్ హీరో అవకాశమిచ్చారు. చెర్రీతో బుచ్చిబాబు రూపొందించిన తన రెండో చిత్రం'పెద్ది' ఆశించిన స్థాయిలో చప్పుడు చేయలేకపోయింది. 'ఆర్ఎక్స్ 100'తో ఒక్కసారిగా అజయ్ భూపతి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే రెండో సినిమా 'మహా సముద్రం'తో నీరుగార్చారు. మొదటి సినిమా 'అ'తోనే డైరెక్టర్ గా శభాష్ అనిపించుకున్న ప్రశాంత్ వర్మ రెండో చిత్రం 'కల్కి'తో మురిపించలేక పోయారు. 'నీది నాది ఒకే కథ'తో మంచి మార్కులు పోగేసిన వేణు ఊడుగుల రెండో సినిమా 'విరాటపర్వం'తో ఆకట్టుకోలేకపోయారు. ఇలా ఈ మధ్య కాలంలో కొందరు దర్శకులు మొదటి సినిమాతో కనికట్టు చేసి, రెండో సినిమాతో పట్టుకోల్పోయారు. అందువల్లే 'ద ప్యారడైజ్'తో శ్రీకాంత్ ఓదెల ఏ స్థాయిలో అలరిస్తారో అన్న ఆసక్తితో ఉన్నారు సినీ ఫ్యాన్స్.


మొదటి సినిమాతో ఆకట్టుకొని, రెండో చిత్రంతో నిరాశ పరచినవారు తరువాతి సినిమాలతో తేరుకొని సక్సెస్ రూటులో సాగిన సందర్భాలూ ఉన్నాయి. మరికొందరు మొదటి చిత్రంతో నిరాశ చెందినా ఆ పై అదరహో అంటూ పయనించారు. ఏది ఏమైనా మొదటి సినిమాతోనే భళా అనిపించిన వారికి రెండో చిత్రం ఓ అగ్నిపరీక్ష అనే చెప్పాలి. అందులో పాసై పోయారో ఇక వారి క్రేజ్ అంతా ఇంతా ఉండదు. మొదటి రెండు సినిమాలు భళా అనిపించి, మూడో సినిమాతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న వారూ ఉన్నారు. అయితే ఎందువల్లో దర్శకులకు రెండో సినిమా అన్నదే ప్రధానంగా మారింది. శ్రీకాంత్ ఓదెల 'ద ప్యారడైజ్'తో సక్సెస్ సాధిస్తే సరిపోదు. ఆ విజయం 'దసరా'ను మించి ఉండాలి. అప్పుడే శ్రీకాంత్ కు సినీజనం జై కొడతారు. బుచ్చిబాబు 'ఉప్పెన'తో అందరి దృష్టిని ఆకర్షించడానికి కారణం ఆ సినిమాను కేవలం 20 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే, వంద కోట్లు పోగేసింది. రెండో సినిమా 'పెద్ది'కి పెట్టుబడి 300 కోట్లయింది. రాబడి 350 కోట్ల దాకా వచ్చింది. ఈ యేడాది ఇప్పటికీ టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో 'పెద్ది'నే నంబర్ వన్ గా నిలచి ఉంది. అయితే ఏం లాభం పెట్టుబడికి తగ్గ రాబడి లేదనే టాక్ తో 'పెద్ది' సాగింది. అందువల్లే శ్రీకాంత్ ఓదెలవైపు ప్రస్తుతం సినీ ఫ్యాన్స్ చూపు సాగుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి!

చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్

పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!

Updated Date - Sep 15 , 2026 | 10:25 AM