పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!
ABN , Publish Date - Sep 14 , 2026 | 07:28 PM
పావలా శ్యామల కుమార్తె మాధవికి సైతం 'మా' చేదోడుగా నిలువబోతోంది. రమణాచారి ఫౌండేషన్ సాయంతో మాధవి బాగోగులను తాము చూసుకుంటామని 'మా' కోశాధికారి శివ బాలాజీ తెలిపారు.
ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నటి పావలా శ్యామల కుమార్తె మాధవి బాధ్యతలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భుజానకెత్తుకుంది. 'మా' సభ్యురాలు అయిన దగ్గర నుంచి పావలా శ్యామల అంత్యక్రియల వరకూ 'మా' దగ్గరుండి అన్ని చేసింది. ఇప్పుడు తల్లి మరణంతో ఒంటరి అయిన మాధవికి సైతం 'మా' చేదోడు వాదోడుగా ఉండటానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని 'మా' ట్రెజరర్ శివ బాలాజీ మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ, 'పావలా శ్యామల గారు ‘మా’లో జాయిన్ అయినప్పటి నుంచి ఆమెకి ఫించన్ ఇస్తూ వచ్చాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఇచ్చారు. 2019లో ఈ ఇష్యూని చిరంజీవి గారి వద్దకు తీసుకు వెళ్లారు. ఆయన ఇచ్చిన ఫండ్ కాకుండా మెంబర్ షిప్ ఫ్రీగా ఇప్పించారు. ఆమె ఏ ఇష్యూ వచ్చిన మీడియా ముందుకు వచ్చేవారు. ఏ ఆశ్రమంలో పెట్టినా ఆమె ఉండేది కాదు. మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాం. పావలా శ్యామల గారి కూతురు మాధవి గారిని కూడా మేం చూసుకుంటామని ‘మా’ పెద్దలు మాటిచ్చారు. కానీ ఆమె ‘మా’ మెంబర్ కాదు. ‘మా’ ఫండ్ ను వాడలేం. అందుకే గత నెల రోజులుగా ఈ విషయం మీదే మేం చర్చించుకున్నాం. మాణిక్ గారు రమణాచారి ఫౌండేషన్ తో మాట్లాడారు. ఫుడ్డు, బెడ్డు, ఫిజియో థెరపీ ఆయనే చూసుకుంటామని చెప్పారు. కేర్ టేకర్ని మాత్రం మేం నియమించాం. ‘మా’ అసోసియేషన్ ఫండ్ నుంచి మాత్రం వృథా చేయడం లేదు. చాలా మంది సాయం చేస్తామని ఫోన్స్ చేస్తున్నారు. అలా ఇవ్వాలని అనుకునే వారు ‘మా’కి విరాళం ఇవ్వండి. మేం ఆ ఫండ్ ను మాధవి గారి కోసం వాడతాం. ఇప్పటికే నరేష్ గారు, మురళీ మోహన్ గారు రూ. 50 వేల చొప్పన విరాళం అందించారు’ అని అన్నారు.
జాయింట్ సెక్రటరీ కళ్యాణీ మాట్లాడుతూ, 'పావలా శ్యామలా గారిని ‘మా’ ఎప్పుడూ విస్మరించలేదు. ఆమెకు అండగా నిలుస్తూనే వచ్చాం. మా మీద విమర్శలు చేసే వారు ఒక్క రోజు ఆమెని ఇంట్లో పెట్టుకుని సేవలు చేస్తే బాగుండేది. మాటలు అనడం తేలిక. సహాయం చేయడం కష్టం. మా విష్ణు బాబు ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. పావలా శ్యామల గారి కూతురు మాధవిని కూడా మేమే చూసు కుంటున్నాం. ఆమె కాళ్ల మీద ఆమె నిలబడేలా చేయాలన్నదే ‘మా’ లక్ష్యం. కేర్ టేకర్‌ను పెట్టి రమణాచారి గారి ఫౌండేషన్లో మాధవిని ‘మా’ చూసుకుంటోంది. ‘మా’ మీద బురద జల్లకండి. విమర్శించే వారంతా కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
చివరగా పావలా శ్యామల కుమార్తె మాధవి మాట్లాడుతూ, 'ఇంతకు ముందు మా అమ్మకు, నాకు 'మా' అసోసియేషన్ చేయూత నిచ్చింది. ఇప్పుడు అదే విధంగా విష్ణు గారు, మెంబెర్స్ నాకు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళు నేను చెప్పని విషయాన్ని వక్రీకరించి రాయొద్దని నేను అభ్యర్ధిస్తున్నాను' అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వడ్లపట్ల, మాణిక్, శశాంక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
Sydney Sweeney: నగ్నంగా స్పోర్ట్స్ యాడ్.. సిగ్గులేదా.. ఆడవారి పరువు తీసావ్
Amitabh Bachchan: జయా బచ్చన్‌కు అసలు టైమ్ చెప్పని అమితాబ్.. బిగ్‌బీ ఫన్నీ ట్రిక్ ఇదే!
మంగళ గౌరి.. డ్రాగన్ పాప లేడీ ఓరియెంటెడ్ సినిమా మొదలెట్టేసింది