'మహేంద్రగరి వారాహి'లో సిద్ధు జొన్నలగడ్డ!
ABN , Publish Date - Aug 29 , 2026 | 07:46 AM
సుమంత్ 'మహేంద్రగిరి వారాహి' చిత్రంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని రివీల్ చేశారు.
సుమంత్ నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి పర్వతాల నేపథ్యంతో, వారాహి మాత దైవశక్తి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీని ద్వారా తొలిసారి కథలోని ప్రధాన అంశాన్ని మేకర్స్ రివీల్ చేశారు. భక్తి, విశ్వాసం, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను మేళవించిన కథనం ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు దైవశక్తిపై విశ్వాసం, మరోవైపు ఆ నమ్మకం వెనుక ఉన్న నిజాన్ని అన్వేషించే ప్రయత్నం మధ్య సంఘర్షణను ట్రైలర్‌లో చూపించారు. దర్శకుడు సంతోష్ జగర్లపూడి ఆధ్యాత్మిక అంశాలతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను చక్కగా బ్యాలెన్స్ చేశారు. సుమంత్ తన పాత్రలో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఐశ్వర్య రాజేష్ వారాహి మాత పాత్రలో కనిపించనుండగా, సిద్ధు జొన్నలగడ్డ కీలకమైన పాత్రలో సర్‌ప్రైజ్ ఇచ్చారు. మినాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. భక్తి, మిస్టరీ, థ్రిల్‌ను కలగలిపిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
టెక్నికల్‌గా ‘మహేంద్రగిరి వారాహి’ భారీ స్థాయిలో కనిపిస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ ఆర్ట్స్ రూపొందించిన సెట్స్, పీరియాడికల్, ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సినిమాటోగ్రాఫర్ ప్రతాప్ ఆర్ కృష్ణా మహేంద్రగిరి ప్రాంతంలోని మిస్టీరియస్ ల్యాండ్‌స్కేప్‌ను, కథలోని కీలక ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్రైలర్‌లోని ఉత్కంఠను మరింత పెంచింది. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ, 'అనూప్ గారి మ్యూజిక్‌కి నేను ఫ్యాన్‌ని. లక్ష్మణ్ గారు ఎక్కడుంటే అక్కడ డబ్బు ఉంటుంది. ఆయనది లక్కీ హ్యాండ్. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. గత కొన్ని నెలలుగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. సినిమాలకు చాలా మంచి రన్ ఇస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అదే కంటిన్యూ అవుతూ ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా కూడా అంతే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి డివైన్ సినిమా మన కల్చర్‌ని చెబుతుంది. మన కల్చర్‌తో ఏ సినిమా వచ్చినా మనం సపోర్ట్ చేయాలి, దాని నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్‌ని తీసుకున్న డైరెక్టర్ సంతోష్‌కి అభినందనలు. ఈ సినిమా సుమంత్ అన్నకి ‘గోదావరి’ కంటే చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా ఎక్కువ పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో సుమంత్ అన్న లాంటి జెన్యుస్ వ్యక్తిని చూడలేదు. సార్' సినిమాలో తనతో నాలుగైదు రోజులు పనిచేశాను. అప్పటినుంచి నేను ఏదైనా రాసినా ముందు సుమంత్ అన్న దగ్గరకు తీసుకెళ్తాను. ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటాను. ఆయనకి ఈ సినిమా మీద నమ్మకం ఉందంటే కచ్చితంగా హిట్ అవుతుంది. సుమంత్ అన్నతో మళ్లీ పనిచేయాలని ఉంది' అని అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ, ' ‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత డైరెక్టర్ సంతోష్‌తో ఇది నా రెండో సినిమా. ఈ సినిమా దాదాపు మూడేళ్ల జర్నీ. ఇది చాలా పెద్ద బడ్జెట్‌లో, పెద్ద స్థాయిలో తీయాల్సిన సినిమా. అలాంటి సమయంలో మా నిర్మాతలు మధు గారు, లక్ష్మణ్ ముందుకు వచ్చారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ప్రేక్షకులందరి సపోర్ట్ కావాలి. ఈ సినిమా మీద నాకు చాలా మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీకు కూడా ఈ ట్రైలర్ ద్వారా కలిగిందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో మా 'డీజే టిల్లు' కూడా ఉన్నాడు. ఫస్ట్ టైమ్ మేం ట్రైలర్‌లో రివీల్ చేశాం. తను చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా సిద్ధుకి థాంక్యూ' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సంతోష్, నిర్మాత మధు, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటి మీనాక్షి గోస్వామి తదితరులు పాల్గొని తమ అనుభవాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్ పాత్రలతో మెప్పిస్తున్న భామలు
Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!
కృతి సనన్ రాఖీ యాడ్ వివాదం.. మధు చోప్రా హాట్ కామెంట్స్!