నిర్మాతలకు చుక్కలు చూపిన సెప్టెంబర్‌

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:26 AM

సెప్టెంబర్ మాసంలో పంతొమ్మిది స్ట్రయిట్‌ మూవీస్ తో పాటు ఏడు డబ్బింగ్‌ సినిమాలు విడుదలయ్యాయి. దారుణమైన ట్రోలింగ్స్ మధ్య కూడా నాని 'ది ప్యారడైజ్‌' గౌరవ ప్రదమైన ఓపెనింగ్స్ ను రాబట్టుకోగా, తమిళ డబ్బింగ్‌ సినిమా 'మండాడి' చక్కని విజయాన్ని నమోదు చేసుకుంది.

Telugu Movies

ఆగస్ట్ తో పోల్చితే సెప్టెంబర్ లో తెలుగులో మూడు సినిమాలు ఎక్కువే వచ్చాయి. డబ్బింగ్‌తో కలిపి ఆగస్ట్ లో 23 చిత్రాలు విడుదలైతే, సెప్టెంబర్‌ నెలలో 19 స్ట్రయిట్‌ సినిమాలు, ఏడు అనువాద చిత్రాలు వచ్చాయి. అయితే రాశికి తగ్గ వాసి మాత్రం లేదనే చెప్పాలి. సెప్టెంబర్‌లో వచ్చిన చిన్న సినిమాలన్నీ వాష్ అవుట్ అయిపోయాయి. భారీ అంచనాలతో వచ్చిన 'ప్యారడైజ్‌' కూడా వివాదాల నడుమే సాగింది. ఈ సినిమా తొలి వారాంతానికి 150 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేయగా, తమిళ డబ్బింగ్‌ సినిమా 'మండాడి' రూ. 125 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఆగస్ట్ 21న మలయాళంలో విడుదలై, తెలుగులో సెప్టెంబర్ 4న జనం ముందుకు వచ్చిన 'బెత్లెహెం కుటుంబ యూనిట్‌' సినిమా ఏకంగా వరల్డ్ వైడ్‌ రూ. 330 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కేవలం పాతిక కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా సాధించిన అఖండ విజయానికి అందరూ ఆనందపడుతున్నారు. ఆ రకంగా సెప్టెంబర్‌లో తెలుగులో జనం ముందుకు వచ్చిన సినిమాల్లో ఈ మూడే వందకోట్ల మైలు రాయిని క్రాస్ చేశాయి.


సెప్టెంబర్‌ ఫస్ట్ వీకెండ్‌లో ఐదు స్ట్రయిట్‌, మూడు డబ్బింగ్‌ సినిమాలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన 'రోమాంచకం' జనాలను మెప్పించలేక పోయింది. 'అల్లరి' నరేశ్‌ 'రంభ ఊర్వశి మేనక' సైతం బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. ఆ వారం వచ్చిన 'సహ, ధర్మస్థల నియోజకవర్గం', డబ్బింగ్‌ సినిమాలు 'ఐ యామ్‌ గేమ్‌, మిర్జాపూర్‌: ద మూవీ' పరాజయం పాలయ్యాయి. ఒక్క 'బెత్లెహాం కుటుంబ యూనిట్‌' మాత్రమే మెరుగైన ఫలితాన్ని తెలుగులో ఇచ్చింది. ఆ తర్వాతి వారంలో రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్‌ హీరోగా పరిచయమైన 'మారెమ్మ' ఘోర పరాజయం పాలైంది. సుమంత్‌ 'మహేంద్రగిరి వారాహి' జనాలను మెప్పించలేక పోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఆనంద్ దేవరకొండ 'ఎపిక్‌' సైతం ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. కార్తీ తమిళ అనువాద చిత్రం 'సర్దార్‌ 2' ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ వారం వచ్చిన ఐదు చిత్రాలలో తమిళ డబ్బింగ్‌ సినిమా 'మండాడి' ఒక్కటే ఊహించని విజయాన్ని అందుకుంది. సముద్రతీర వాసుల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సూరి, సుహాస్‌ పోటాపోటీగా నటించారు. ఈ చిన్న సినిమా ఏకంగా రూ. 125 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేయడం విశేషం.


సెప్టెంబర్ మూడో వారాంతంలో ఎనిమిది స్ట్రయిట్‌, రెండు డబ్బింగ్‌ సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఫలితాన్ని పొందలేదు. చంద్రమహేశ్‌ తీసిన 'పిఠాపురంలో...', చంద్ర సిద్ధార్థ్‌ తెరకెక్కించిన 'ఈ పాట కోరిన వారు' చిత్రాలు జనాలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేక పోయాయి. ఇతర చిత్రాలు 'మిస్సింగ్‌ మేఘన, కాగితం పడవలు, సీక్రెట్ సోల్జర్, హ్యాపీ జర్నీ' కూడా నిరాశ పర్చాయి. ఇక చివరి వారంలో వచ్చిన మూడు స్ట్రయిట్‌ సినిమాలలో 'అనుమాన పక్షి, కళ్యాణం కమనీయం జీవితం' గురించి ఎవ్వరూ మాట్లాడుకోనే లేదు. ఆ వారం అందరి దృష్టీ నాని నటించిన 'ది ప్యారడైజ్‌' మీదే ఉంది. 'దసరా' తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో వచ్చిన చిత్రం కావడం, రిలీజ్‌కు ముందే పాటలు హిట్‌ కావడంతో 'ప్యారడైజ్‌'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తీవ్రమైన హింస, సెకండ్ హాఫ్‌ ట్రాక్‌ తప్పడంతో 'ప్యారడైజ్‌' నెగెటివ్‌ టాక్‌ మూటగట్టుకుంది. అలాంటి సమయంలో కూడా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌కు రూ. 150 కోట్ల గ్రాస్ ను వసులు చేయడం విశేషం. కానీ... సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నైజాం ఏరియాలో బ్రేకీవెన్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా స్ట్రయిట్‌ తెలుగు సినిమాలకు సెప్టెంబర్‌ మాసం ఏ మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

కన్యత్వం చుట్టూ తిరిగే బోల్డ్ కథతో సినిమా.. సమంత బంగారమే స్ఫూర్తట

ఈ వారం మూడు కొత్త సినిమాలు.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి

ఫెడరేషన్ అధ్యక్షుడిపై జానీ మాస్టర్ వైఫ్ సుమలత యుద్ధం మొదలు

Updated Date - Oct 01 , 2026 | 11:40 AM