కన్యత్వం చుట్టూ తిరిగే బోల్డ్ కథతో సినిమా.. సమంత బంగారమే స్ఫూర్తట
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:59 PM
సమాజంలో మహిళలు ఎదుర్కొనే సున్నితమైన, వివాదాస్పద అంశాలను చర్చిస్తూ ఇండిపెండెంట్ చిత్రాలు రావడం అరుదు. అలాంటి ఒక బోల్డ్, భావోద్వేగ కాన్సెప్ట్‌తో వస్తున్న తాజా చిత్రమే ‘ఇంప్యూర్’.
సమాజంలో మహిళలు ఎదుర్కొనే సున్నితమైన, వివాదాస్పద అంశాలను చర్చిస్తూ ఇండిపెండెంట్ చిత్రాలు రావడం అరుదు. అలాంటి ఒక బోల్డ్, భావోద్వేగ కాన్సెప్ట్‌తో వస్తున్న తాజా చిత్రమే ‘ఇంప్యూర్’ (Impure). కాకినాడలో పుట్టి పెన్సిల్వేనియాలో పెరిగిన ఎన్నారై యువతి వారాహి మల్లిపాముల (Varahi Mallipamula) ఈ చిత్రంతో నిర్మాతగా, రచయిత్రిగా, నటిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ చేసిన వారాహి.. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, లండన్‌లలో టెక్ రంగంలో ఉద్యోగం చేస్తూనే తన సినీ కలను సాకారం చేసుకున్నారు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రులు, వారాంతాల్లో దాదాపు ఆరేళ్ల పాటు కష్టపడి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
‘కన్య’ కాదనే కారణంతో పెళ్లి రద్దు.. ఆలోచింపజేసే కథాంశం
సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి డైరెక్షన్ విభాగంలో పనిచేసిన నిశాంతి ఎవాని ఈ ‘ఇంప్యూర్’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. పెళ్లి చేసుకోబోయే యువతి ‘కన్య’ కాదని అత్తమామలకు తెలియడంతో, ఆ సంబంధాన్ని రద్దు చేయడమనే ప్రధానాంశం చుట్టూ ఈ చిత్రం నడుస్తుంది. సాధారణంగా టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల పాత్రలకు కూడా నార్త్ ఇండియన్ హీరోయిన్లను తీసుకుంటుంటారని, పైగా మహిళా ప్రాధాన్య చిత్రాలకు మార్కెట్‌లో ఆదరణ దక్కడం కష్టమనే అభిప్రాయం ఉందని వారాహి పేర్కొన్నారు. అందుకే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం అచ్చతెలుగు నటి యషా ముత్తులూరిని ఎంపిక చేశారు.
చెల్లి పెళ్లికి అమ్మ పెట్టిన ఖర్చుతో మొదలై..
ఈ చిత్ర విశేషాలను వారాహి మల్లిపాముల పంచుకుంటూ.. ‘‘నేను కొన్నేళ్లుగా సినిమాల కోసం తీవ్రంగా ప్రయత్నించి నిరాశకు గురవడం మా అమ్మ చూశారు. మా చెల్లి పెళ్లికి అమ్మ చాలా ఖర్చు చేశారు. దాంతో ‘నీ సినిమా కల కోసం కూడా ఆ స్థాయిలోనే డబ్బులిస్తాను, సినిమా చేసుకో’ అని చెప్పారు. ఆ డబ్బుతో సినిమా మొదలుపెట్టాను కానీ ఒక పూర్తి స్థాయి సినిమా తీయడానికి అది చాలలేదు. దీంతో భారీగా అప్పులు చేసి, నటీనటులు, టెక్నీషియన్లను ఎంపిక చేసుకోవడానికి న్యూయార్క్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చాను’’ అని తెలిపారు.
సమంత, నందిని రెడ్డిలే నాకు స్ఫూర్తి
‘‘మహిళా ప్రాధాన్య చిత్రాలు అనగానే నిర్మాతలు వెనకడుగు వేస్తారు. నేను ఎంతోమంది నిర్మాతలకు కథ చెప్పినా సందేహాలు వ్యక్తం చేశారు. అయితే సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్ చిత్రాలు మహిళా కేంద్రిత సినిమాలతోనూ ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాలు సాధించవచ్చని నిరూపించాయి. వారి స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని ఎవరి మీదా ఆధారపడకుండా నేనే స్వయంగా థియేటర్లలో పంపిణీ చేస్తున్నాను. రక్తపాతం, వయోలెన్స్ సినిమాల మధ్య మా ఇండిపెండెంట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఒక కొత్త కోణంలో చూస్తారని నమ్ముతున్నాను’’ అని వారాహి ధీమా వ్యక్తం చేశారు.
గ్రామీ నామినీస్ సంగీతం.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ
ఈ చిత్రానికి గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన అంతర్జాతీయ స్థాయి సంగీత కళాకారులు రాజా కుమారి, కరణ్ పాండవ్ కలిసి పాటలను స్వరపరిచారు. ఇందులోని ‘ఓఎమ్‌జి’ పాటకు మంచి ఆదరణ దక్కుతోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. ఇందులో సాయి కృష్ణ కీలక పాత్రలో అద్భుతంగా నటించారు. లాస్ ఏంజిల్స్‌లోని ప్రఖ్యాత టీసీఎల్ చైనీస్ థియేటర్‌లో వరల్డ్ ప్రీమియర్, న్యూయార్క్‌లోని హిస్టారిక్ సినిమా విలేజ్‌లో ఈస్ట్ కోస్ట్ ప్రీమియర్‌ను ప్రదర్శించుకున్న ‘ఇంప్యూర్’ చిత్రం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా అక్టోబర్ 2న పాన్-ఇండియా వ్యాప్తంగా ఎంపిక చేసిన పరిమిత థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
ఈ వారం మూడు కొత్త సినిమాలు.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి
ఫెడరేషన్ అధ్యక్షుడిపై జానీ మాస్టర్ వైఫ్ సుమలత యుద్ధం మొదలు
జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్: AIFEC సమావేశంలో కీలక తీర్మానం