Bandi Raghuram: 'వరం' దర్శకుడి కన్నుమూత!
ABN, Publish Date - May 01 , 2026 | 05:35 PM
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, దర్శకుడు బండి రఘురామ్ గుండెపోటుతో కన్నుమూశారు. సత్య, పూజా భారతి జంటగా ఆయన 'వరం' సినిమాను తెరకెక్కించారు.
ప్రముఖ దర్శకుడు సానా యాదిరెడ్డి (Sana Yadireddy) దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బండి రఘురామ్ (Bandi Raghuram) ఆ తర్వాత సత్య (Satya) హీరోగా 2004లో 'వరం' (Varam) చిత్రాన్ని తెరకెక్కించారు. పూజా భారతి (Pooja Bharathi) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శివాజీ (Shivaji) ఓ ప్రధాన పాత్ర పోషించగా, రమ్యకృష్ణ (Ramya Krishna) స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి (M.M. Keeravani) సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇందులో హీరోగా నటించిన 'బ్యాచిలర్' ఫేమ్ సత్య సైతం కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఈ సినిమాతో దర్శకుడిగా మారిన బండి రఘురామ్ కొద్ది రోజులు క్రితం గుండెపోటుతో కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉన్నత విద్యాధికుడైన బండి రఘురామ్ జర్నలిజంలో ఎంఫిల్, ఇంగ్లీష్ లిచరేచర్‌లో పీహెచ్‌డీ చేశారు. లిబియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెపర్ గానూ పనిచేశారు. సానా యాదిరెడ్డితో ఉన్న బంధుత్వం కారణంగా ఆయన తెరకెక్కించిన 'పిట్టలదొర' సినిమా నుండి పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. సినిమాపై ఉన్న మమకారంతో ఆ రంగంలో చాలా కాలం కొనసాగారు. కొన్ని చిత్రాలకు ఘోస్ట్ రచయితగా వర్క్ చేశారు. అయితే దర్శకుడిగా సరైన అవకాశాలు దొరక్క పోవడంతో ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఈటీవీ, వి 6, ఇండియన్ ఎక్స్ ప్రెస్ తదితర మీడియా సంస్థలలో స్పెషల్ కరస్పాండెంట్‌గా బండి రఘురామ్ పని చేశారు. ముఖ్యంగా మూవీ రివ్యూస్ రైటర్‌గా, సినీ విశ్లేషకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏప్రిల్ 28వ తేదీ ఈవింగ్ వాక్ కు వెళ్ళిన ఆయన తీవ్ర గుండెపోటుతో కుప్పకూలిపోయారని, వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్ళినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బండి రఘురామ్ మృతిపట్ల సినీ పాత్రికేయులు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!
ప్రేమలో పూజా హెగ్డే.. కుర్రాడు కత్తిలా ఉన్నాడుగా!
‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?