ఎన్టీఆర్, మహేష్, బన్నీ కాదు.. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ ప్రాజెక్ట్ ఇదే
ABN, Publish Date - Nov 27 , 2026 | 10:30 PM
సందీప్ రెడ్డి వంగా.. తీసింది కేవలం మూడు సినిమాలే అయినా, ఆ సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలను తలకిందులు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్. తాజాగా సందీప్.. ‘స్పిరిట్’ తర్వాత చేసే ప్రాజెక్ట్ వివరాలను తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. తీసింది కేవలం మూడు సినిమాలే అయినా, ఆ సినిమాలతో బాక్సాఫీస్ లెక్కలను తలకిందులు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy), ‘కబీర్ సింగ్’, ఆ తర్వాత ‘యానిమల్’ (Animal).. ఇలా ప్రతి సినిమాతో తనదైన మేకింగ్ స్టైల్‌తో ఇండియా వైడ్‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు సందీప్. ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో ‘స్పిరిట్’ (Spirit) అనే భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌పై ఉండగానే.. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా ఏ హీరోతో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలందరి పేర్లను తెరపైకి తెస్తూ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపిస్తూ వస్తోంది. ఇలా.. ‘స్పిరిట్’ తర్వాత మా హీరోతోనే సందీప్ సినిమా ఉంటుందంటూ ఎవరికి వారు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు కూడా సందీప్ తమ హీరోతో సినిమా చేయాలని ఆశపడుతున్నారు.
కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఊహాగానాలకు, ప్రచారాలకు సందీప్ రెడ్డి వంగా స్వయంగా చెక్ పెట్టేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో ఆయన ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్‌గా చెప్పేశారు. ‘స్పిరిట్’ సినిమా పనులు పూర్తయిన వెంటనే, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో క్రేజీ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ (Animal Park) మొదలుపెట్టబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలియంది కాదు. ఆ సినిమా చివర్లో ‘యానిమల్ పార్క్’ అంటూ ఇచ్చిన లీడ్‌తో పార్ట్-2 పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు సందీప్ చేసిన ఈ ప్రకటనతో ‘యానిమల్ పార్క్’ త్వరలోనే పట్టాలెక్కబోతోందని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే, ఈ వార్త రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తుండగా.. అటు బన్నీ, మహేష్, ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర బాలీవుడ్ హీరోల అభిమానుల ఆశలకు మాత్రం గట్టి బ్రేక్ పడినట్లయింది. ‘స్పిరిట్’ పూర్తవగానే సందీప్ మళ్లీ బీ-టౌన్ బాట పట్టడం ఖాయమని తేలిపోయింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ప్రభాస్ ‘స్పిరిట్’, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్ పార్క్’ సినిమాల తర్వాతైనా సందీప్ మన టాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. కోన వెంకట్, బాబీ పోస్టులతో ఫుల్ క్లారిటీ
హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. డిటైల్స్ ఇవే
మోక్షజ్ఞ ఎంట్రీకి మెగా బ్రేక్.. అసలు కారణం ఇదేనా?