Rc17: మాష్టారు మీ చర్యలు ఊహాతీతం.. అసలేం ఫ్లాన్ చేస్తున్నారు సార్!
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:26 PM
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ బడ్జెట్ రూ.400 కోట్లు అని ప్రచారం జరుగుతుండగా, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు.
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా, ఏ సోషల్ మీడియా వేదిక చూసినా నడుస్తున్న ఒకే ఒక్క టాపిక్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వస్తున్న 'RC17' సినిమా గురించే. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో, ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా పూర్తయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వచ్చి ఈ చిత్రానికి క్లాప్ నిచ్చి లాంఛ్ చేయడంతో, మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక పూజా కార్యక్రమాల అనంతరం మేకర్స్ వదిలిన ఒక ప్రీ-లుక్ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ఆ పోస్టర్‌లోని చిన్న సైన్‌ని చూసి.. ఇది మైథాలాజికల్ టచ్ ఉన్న సినిమా అనీ, ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనీ సినీ విశ్లేషకులు రకరకాలుగా డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా ఒకెత్తైతే.. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఈ సినిమా బడ్జెట్ గురించిన ఒక హాట్ టాపిక్ వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఏకంగా రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు టీ-సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. సుకుమార్ గత చిత్రం 'పుష్ప-2' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం, రామ్ చరణ్‌తో ఆయనకున్న బాండింగ్ కారణంగా మేకర్స్ ఈ సినిమాలో బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. సినిమాకు కావలసిన భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఇంకా హీరో రెమ్యునరేషన్ అన్నీ కలుపుకుంటే ఈ రేంజ్ ఖర్చు పెట్టడం షరామామూలే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లోనే ఈ రూ. 400 కోట్ల మార్క్‌ని ఈజీగా వెనక్కి తెస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ముహూర్తపు వేడుక నాటికైనా హీరోయిన్ ఎవరో రివీల్ అవుతుందని అంతా భావించారు. కానీ అక్కడ కూడా అలాంటి క్లారిటీ ఏదీ రాలేదు. దీనికి కారణం.. ఇప్పటివరకు ఎవరినీ ఫైనల్ చేయకపోవడమే అని తెలుస్తోంది.
మొదట్లో కొంతమంది పేర్లు అనుకున్నప్పటికీ.. కథలో వచ్చిన కొన్ని మార్పుల కారణంగా ఆ పేర్లన్నీ పక్కన పెట్టి మళ్లీ కొత్తగా వేట మొదలుపెట్టినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సంగీతం అందించే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానిపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. సుకుమార్ సినిమాలంటేనే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కచ్చితంగా ఉంటుందనే ఒక సెంటిమెంట్ ఉంది. మరి ఈసారి కూడా అదే కాంబో రిపీట్ అవుతుందా, లేక వేరే సంగీత దర్శకుడు రంగంలోకి దిగుతారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. మరి ఈ చిత్రంలో చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? లాంటి అప్డేట్స్ కోసం ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.