RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:16 PM
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న రెండో చిత్రం RC17 కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త బాగా హైలెట్ అవుతోంది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన మ్యాజికల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయితే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదా. అలాంటి ఓ క్రేజీ కాంబినేషనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కలయిక. వీరిద్దరి క్రేజీ ప్రాజెక్ట్ RC17 కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 2018లో వీరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. కమర్షియల్ హంగులతో పాటు బలమైన భావోద్వేగాలను జోడించి సుకుమార్ తీర్చిదిద్దిన ఆ సినిమా, చరణ్ కెరీర్లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అయితే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో RC17కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను దసరా పండుగ శుభ ముహూర్తాన పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, ఈ ప్రారంభోత్సవం రోజే అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ను కూడా అందించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దసరాకు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి, సరిగ్గా డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు చిత్రబృందం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం ఒక డెడ్‌లైన్ నిర్దేశించుకున్నారట. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట. అంటే.. సరిగ్గా 12 నెలల్లో సినిమా పని మొత్తం ఫినిష్ చేయాలనేది సుకుమార్ అండ్ టీమ్ లక్ష్యం. సాధారణంగా పెద్ద బడ్జెట్ సినిమాలు, చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ కాంబినేషన్ అనగానే ప్రొడక్షన్ టైమ్ చాలా ఎక్కువ పడుతుంది. కానీ, సుకుమార్ పక్కా ప్రణాళికతో కేవలం 12 నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారట.
అయితే, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో, ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకునే సుకుమార్ కాంబోకి ఇది ఒక పెద్ద సవాల్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే, పాన్ ఇండియా రేంజ్ బిగ్ బడ్జెట్ మూవీల షూటింగ్ ప్రారంభమయ్యాక.. భారీ సెట్లు, కష్టమైన యాక్షన్ షెడ్యూళ్లు, విదేశీ లొకేషన్లు, నటీనటుల డేట్స్ సర్దుబాటు చేయడం వల్ల ప్రొడక్షన్ టైమ్ పెరగడం సహజం. ప్రొడక్షన్ లేట్ అయ్యే కొద్దీ సినిమాపై బడ్జెట్ భారం పెరగడంతో పాటు, అన్ని విభాగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం సవాల్‌గా మారుతుంది. ఇటీవల మనం చూస్తున్న చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుకుమార్ ఈ డెడ్‌లైన్‌ను అందుకుని సరికొత్త రికార్డు సృష్టిస్తారో లేదో చూడాలి. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఉంటారా లేక వేరే ఎవరైనా వస్తారా అనే విషయంపై రకరకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఈ కాంబినేషన్ మరోసారి ‘రంగస్థలం’ రేంజ్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా? సుకుమార్ అనుకున్న సమయానికి సినిమాను థియేటర్లలోకి తెస్తారా? అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
రాజమౌళి బ్రాండ్‌కు అక్కడ ట్రబుల్!
‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్స్
డబ్బులిచ్చి మరి ‘సిగ్మా’పై నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారా? నమ్మవచ్చా!