‘ఇరుముడి’ ఎఫెక్ట్.. రవితేజ హారర్ చిత్రానికి నిర్మాతలు దొరికేశారోచ్!
ABN , Publish Date - Aug 28 , 2026 | 08:47 PM
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. ‘ఇరుముడి’ సక్సెస్‌తో వరుస చిత్రాలకు ఆయన కమిట్ అవుతున్నారు.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన అసలైన స్టామినాను చూపిస్తూ రికార్డుల వేట కొనసాగిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) థియేటర్లలో భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135 కోట్ల గ్రాస్ మార్కును విజయవంతంగా దాటేసి, రవితేజ కెరీర్‌లోనే మైలురాయి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కంటెంట్‌తో పాటు రవితేజ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమా లాభాల పంట పండిస్తోంది. ఈ ఘన విజయం ఇచ్చిన నూతనోత్సాహంతో మాస్ మహారాజా తన తదుపరి ప్రాజెక్టులను మరింత వేగంగా, పక్కా ప్రణాళికతో లైన్‌లో పెడుతున్నారు.
ఇప్పటికే దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను లాక్ చేసిన రవితేజ, ఆ చిత్రాన్ని 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటు గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఆసక్తికరంగా వినిపిస్తున్న రవితేజ - వివేక్ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ఖరారైంది. వైవిధ్యభరితమైన కథనాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఇటీవల రవితేజను స్వయంగా కలిసి ‘ఇరుముడి’ ఘన విజయంపై అభినందనలు తెలిపారు. ఈ భేటీతో వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రంపై పూర్తి స్పష్టత వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ మహారాజా తొలిసారిగా పూర్తి స్థాయి ‘హారర్’ జానర్‌లో ఈ సినిమా చేస్తుండటం విశేషం.
రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక హారర్ చిత్రానికి ఎట్టకేలకు నిర్మాతలు కూడా ఖరారయ్యారు. ప్రముఖ నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని సంయుక్తంగా తమ బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పై ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. అలాగే ఈ చిత్రానికి విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్న నేపథ్యంలో, ప్రతిభావంతుడైన బొమ్మి నికేత్‌ని సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వివేక్ ఆత్రేయ వినూత్నమైన మార్క్ స్క్రీన్‌ప్లేకి, రవితేజ ఎనర్జీ, హారర్ ఎలిమెంట్స్ తోడైతే వెండితెరపై సరికొత్త మేజిక్ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న రవితేజ లైనప్‌లో ఈ హారర్ చిత్రం చేరడంతో అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హసిత్ గోలితో రవితేజ చేయనున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఈ సందర్భంగా నిర్మాతలు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
నిర్మాత ఎస్కేఎన్‌కు రాఖీ కట్టిన హీరోయిన్.. అంతా షాక్
శర్వా ‘భోగి’.. రాఖీ స్పెషల్ పోస్టర్ వైరల్
‘శతచిత్ర మన్మథుడు’.. కింగ్ నాగ్‌కు హ్యాపీ బర్త్‌డే