పాత్రకు జీవం పోసేందుకు.. నటీనటుల్లో తరగని నటనాభిలాష!
ABN, Publish Date - Oct 04 , 2026 | 08:16 PM
విఖ్యాత గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలోకి పరకాయప్రవేశం చేసేందుకు రశ్మిక మందన్న తపిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నారు.
విఖ్యాత గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) పాత్రలోకి పరకాయప్రవేశం చేసేందుకు రశ్మిక మందన్న (Rashmika Mandanna) తపిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నారు. గతంలోనూ ఇలా తమ తమ పాత్రలను రక్తి కట్టించడానికి తపించి శిక్షణ తీసుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు.. వారిలో కొందరిని గుర్తు చేసుకుందాం.
సౌత్ ఇండియన్ యాక్ట్రెస్, ప్రత్యేకించి తెలుగువారి కోడలు రశ్మిక మందన్న సక్సెస్ రూటులో సాగిపోతున్నారు. ఓ సర్వే ప్రకారం ఆల్ ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్‌గానూ నిలిచారు రశ్మిక. ఇప్పటి వరకు తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలనే తపించారు రశ్మిక. ఇప్పుడు రశ్మికలోని నటికి సవాల్ విసరుతూ ప్రఖ్యాత గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్ర లభించింది. కన్నడ నటి అయిన రశ్మిక నటించే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తమిళంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసుతో కలసి కర్ణాటకకు చెందిన రాక్ లైన్ వెంకటేశ్ నిర్మిస్తూ ఉండడం విశేషం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీపై సినీ ఫ్యాన్స్‌లో అప్పుడే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సుబ్బులక్ష్మి పాత్ర కోసం కర్ణాటక సంగీతంలో రశ్మిక శిక్షణ తీసుకుంటూ ఉండడం విశేషంగా మారింది.
ఛాలెంజింగ్ రోల్స్ పోషించినప్పుడే నటీనటుల్లోని అసలైన టాలెంట్ ఏంటో జనానికి తెలుస్తుంది. తమకు సవాల్ విసరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయాలని తపించిన వారే ఆ యా రోల్స్‌లో జీవిస్తారు. మహానటుడు యన్టీఆర్ (NT Ramarao)కు తెలుగునాట గాడ్ ఇమేజ్ ఉండేదని అందరికీ తెలుసు. తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఆయన సొంతం. అంతటి మేటి నటుణ్ణి ‘బృహన్నల’ వంటి పేడి పాత్రలో నటింప చేయాలని భావించారు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. తనకున్న మాస్ ఫాలోయింగ్‌ను సైతం పక్కకు పెట్టి ‘నర్తనశాల’లో బృహన్నల పాత్రను యన్టీఆర్ ధరించారు. ఎక్కడా పట్టు తప్పని విధంగా బృహన్నలగా రామారావు రక్తి కట్టించారు. వాస్తవానికి ‘నర్తనశాల’లో కఠినతరమైన పాత్ర ఏదైనా ఉందంటే అది బృహన్నల పాత్రనే. దానిని యన్టీఆర్ నటించిన తీరు నభూతో నభవిష్యతి అని చెప్పక తప్పదు. విరాట రాజకుమారి ఉత్తరకు నాట్యం నేర్పించే బృహన్నల పాత్ర కోసం యన్టీఆర్ తపించారు. ప్రఖ్యాత నాట్యాచార్యులు వెంపటి సత్యం వద్ద నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. అలా బృహన్నల పాత్రకు జీవం పోశారు యన్టీఆర్.
బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన నవలల్లో విషాదాంతమైన ‘దేవదాసు’ ఎంతో ప్రాచుర్యం పొందింది. 1928లోనే మూకీగా అలరించిందీ కథ. తరువాత పీసీ బారువా 1935లో బెంగాలీలో తానే నటించి రూపొందించారు. ఈ మూవీ సక్సెస్‌తో హిందీలో ప్రఖ్యాత గాయకుడు సైగల్ హీరోగా ‘దేవదాస్’ తెరకెక్కించారు బారువా... రెండు భాషల్లోనూ అలరించింది. ఈ కథను తెలుగులో రూపొందించాలని వేదాంతం రాఘవయ్య, సముద్రాల భావించినప్పుడు పలువురు విమర్శించారు. అందులో ఏయన్నార్‌ను దేవదాసుగా ఎంచుకోవడంతో మరిన్ని విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఏయన్నార్ (ANR) ఆ విమర్శలను సవాల్‌గా తీసుకొని దేవదాసు పాత్ర కోసం తాగుబోతుగా నటించడానికి పలువురిని అధ్యయనం చేశారు. రాత్రి మత్తు కోసం కడుపునిండా పెరుగన్నం తినేవారట ఏయన్నార్. చివరకు ‘దేవదాసు’ అంటే ఏయన్నారే అనే పేరు సంపాదించారు.
ఆ నాటి నటీనటులే కాదు ఈ తరం వారు సైతం తమకు లభించిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి తపిస్తున్నారు. ‘మేరీ కోమ్’గా నటించడానికి ప్రియాంక చోప్రా బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందిరాగాంధీ, జయలలిత పాత్రల్లో రక్తి కట్టించడానికి కంగనా రనౌత్ సైతం ఎంతగానో శ్రమించారు. రమ్యకృష్ణ కూడా ‘క్వీన్’ వెబ్ సిరీస్‌లో జయలలిత పాత్రలో నటించి మెప్పించారు. ఇక మహానటి సావిత్రి పాత్రలోకి కీర్తి సురేశ్ పరకాయ ప్రవేశమే చేశారని చెప్పవచ్చు. సావిత్రిలాగా బొద్దుగా కనిపించడానికి తగిన డైట్ ఫాలో అయ్యారు కీర్తి. ఇలా తమ దరికి చేరిన పాత్రల కోసం ఈ నటీమణులు పడ్డ శ్రమ భావి నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
నటుల విషయానికి వస్తే ‘ఆంధ్రకేసరి’ పాత్రలో విజయ్ చందర్ జీవించిన తీరున ఎవరూ మరచిపోలేరు. ‘శ్యామ్ బహదూర్’లో విక్కీ కౌశల్, ‘83’లో కపిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ ఆ పాత్రల్లో జీవించడానికి శిక్షణ తీసుకున్నవారే. ‘బాగ్ మిల్కా బాగ్’లో మిల్కా సింగ్ పాత్ర కోసం ఫర్హాన్ అక్తర్ బాడీని తగినట్టుగా మార్చుకోవడానికి ఎంతగానో శ్రమించారు. ఇలాంటి నటీనటుల స్ఫూర్తితోనే నవతరం కూడా విలక్షణమైన పాత్రలు లభిస్తే అందుకు తగ్గ శిక్షణ తీసుకుంటోంది. అదే తీరున ఇప్పుడు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో జీవించడానికి రశ్మిక కృషి చేస్తున్నారు. ఇంకా ఎంతమంది ఈ బాటలో సాగుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
బాలయ్య వర్సెస్ చిరంజీవి.. మరో ఆసక్తికర ఫైట్‌కు అంతా సిద్ధం
మోక్షజ్ఞ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్లు?
మరో విభిన్నమైన కథతో సిద్ధమైన ‘ది రెడ్ బ్యాగ్’ దర్శకుడు