బాలయ్య వర్సెస్ చిరంజీవి.. మరో ఆసక్తికర ఫైట్‌కు అంతా సిద్ధం

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:21 PM

అభిమాన తారల టాక్ షోస్ చూస్తే ఫ్యాన్స్‌కు వచ్చే కిక్కే వేరబ్బా.. అలాంటి కిక్‌ను అభిమానులకు అందించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇప్పటికే బాలయ్య ఈ రంగంలో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు చిరు ఎంట్రీతో ఆసక్తికర ఫైట్ మొదలవ్వబోతోంది.

Chiranjeevi vs Balakrishna

అభిమాన తారల టాక్ షోస్ చూస్తే ఫ్యాన్స్‌కు వచ్చే కిక్కే వేరబ్బా.. అలాంటి కిక్‌ను అభిమానులకు అందించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). త్వరలోనే చిరంజీవి పాడ్ కాస్ట్ షో (Chiranjeevi Podcast Show) మొదలు కానుందని టాక్. చిరు షో ఎలా ఉంటుందో ఆలోచిస్తూ.. ఇప్పటి వరకు తమ టాక్ షోస్‌తో అలరించిన టాలీవుడ్ స్టార్స్ ఎవరో ఒకసారి పరిశీలిస్తే..

తెలుగునాట మెగాస్టార్‌గా జేజేలు అందుకుంటున్న చిరంజీవి టాక్ షో అంటే తప్పకుండా ఆసక్తి అంబరాన్నంటేలా ఉంటుంది. చిరంజీవి పాడ్ కాస్ట్ షో ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కానుందట. ఈ షో కోసం చిరంజీవికి భారీ మొత్తం అందుతోందని టాక్. ఈ షోలో చిరంజీవి తన నటనా ప్రస్థానాన్ని, తాను ఎదుర్కొన్న అంశాలను, చిత్రసీమలో తాను మెగాస్టార్‌గా నిలచిన వైనాన్ని వివరిస్తారని తెలుస్తోంది. అలాగే ఆయన ఇంటర్వ్యూయర్ సీట్‌లో కూర్చొని మరికొందరు సెలబ్రిటీస్‌ను ప్రశ్నించే అవకాశం ఉందనీ సమాచారం. ఏది ఏమైనా చిరంజీవి పాడ్ కాస్ట్ షో విషయం తెలిసినప్పటి నుంచీ ఆయన అభిమానుల్లో ఆనందం చిందులు వేస్తోంది.


చిరంజీవి పాడ్ కాస్ట్ షో పై ఫ్యాన్స్‌లో ఎందుకంత ఉత్సాహం అంటే అందుకు కారణం లేకపోలేదు. టాలీవుడ్‌లో ఎందరు టాప్ స్టార్స్ ఉన్నా చిరంజీవి- బాలకృష్ణ (Chiranjeevi vs Balakrishna) మధ్య సాగే బాక్సాఫీస్ వార్ అత్యంత ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు స్టార్స్ 42 ఏళ్ళుగా బాక్సాఫీస్ బరిలో పలుమార్లు పోటీపడ్డారు. కొన్నిసార్లు బాలయ్యది పైచేయిగా సాగితే, మరికొన్ని సందర్భాల్లో చిరంజీవి ఆధిక్యం సాధించారు. ఇంతకు ముందు బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో నిర్వహించిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో (Unstoppable with NBK) విశేషాదరణ చూరగొంది. అంతకు ముందు కొంతమంది టాలీవుడ్‌కు సంబంధించిన తారలు కొన్ని టాక్ షోస్ నిర్వహించారు. అయినా బాలకృష్ణ లాంటి మాస్ హీరో నిర్వహించే షోకు దక్కే క్రేజే వేరుగా ఉంటుంది కదా. ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ద్వారా బాలయ్య తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. బాలయ్య అంటే భయపడేవారు సైతం ఆయన ‘స్పాంటేనియస్‌నెస్’ చూసి మురిసిపోయారు. బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ఒకానొక దశలో దేశంలోనే టాప్ షోగా నిలవడం గమనార్హం.

అంతకు ముందు టాలీవుడ్ స్టార్స్ నిర్వహించిన టాక్ షోస్ కంటే బాలయ్య ‘అన్ స్టాపబుల్’ విశేషాదరణ చూరగొంది. ‘ఆహా’లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనే ‘అన్ స్టాపబుల్’కు అంతటి క్రేజ్ దక్కిందంటే, ఇక శాటిలైట్ ఛానల్స్‌లో ప్రసారమై ఉంటే ఇంకెంత రేటింగ్స్ వచ్చేవో అనీ ఫ్యాన్స్ అంటూ ఉంటారు. తెలుగునాట టాక్ షోస్‌కు క్రేజ్ తీసుకువచ్చిన ఘనత నిస్సందేహంగా బాలకృష్ణకే దక్కుతుంది. ఆయన ‘అన్ స్టాపబుల్’లో పవన్ కళ్యాణ్, మహేశ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ పాలుపంచుకోవడం విశేషంగా నిలచింది. ఆ షోలోనే బాలకృష్ణ- చిరంజీవి సంభాషణతోనూ కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయని విశేషంగా వినిపించింది.. అయితే అది కార్యరూపం దాల్చలేదు. కానీ, ఇతర స్టార్స్‌తో బాలయ్య షోను భలేగా రక్తి కట్టించారు.


త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోయే చిరంజీవి పాడ్ కాస్ట్ షోకు, బాలయ్య ‘అన్ స్టాపబుల్’కు కాస్త సంబంధం ఉంది. బాలయ్య టాక్ షోకు పనిచేసిన రైటర్-డైరెక్టర్ బి.వి.యస్. రవి (BVS Ravi) ఇప్పుడు చిరు షోకూ వర్క్ చేస్తున్నారని వినికిడి. అసలు బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోను అంగీకరించడానికి ఆయన చిన్నకూతురు తేజస్విని కారణం. అదే తీరున ఇప్పుడు చిరంజీవి పాడ్ కాస్ట్ షో వెనుక ఆయన పెద్దకూతురు సుస్మిత ఉన్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య- చిరంజీవి షోస్ మధ్య కూడా సంబంధం ఉందని తెలిసిన ఇద్దరి ఫ్యాన్స్‌లోనూ ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ చోటు చేసుకుంది. అంతేకాదు, ‘అన్ స్టాపబుల్’ షోతో ఆల్ ఇండియాలోనూ హై రేటింగ్స్ చూశారు బాలయ్య.. అదే తీరున చిరంజీవి షోను కూడా రక్తి కట్టించాలని ఆయన అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇలా బాలకృష్ణ- చిరంజీవి మధ్య బాక్సాఫీస్ వార్ క్రియేట్ చేసే ఇంట్రెస్ట్ లాగే రాబోయే షో కూడా ఆసక్తి కలిగిస్తూ ఉండడం విశేషం.

బాలకృష్ణ కంటే ముందుగానే రానా దగ్గుబాటి (Rana Daggubati) ‘నంబర్ వన్ యారీ విత్ రానా’ అనే షోను జెమినీ టీవీ కోసం నిర్వహించారు. రెండు సీజన్స్ అయ్యాక, మూడో సీజన్‌ను ‘ఆహా’ ఓటీటీలో చేశారు రానా. తరువాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ‘రానా దగ్గుబాటి షో’ ఓ సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్స్‌ను రక్తి కట్టించారు. ఇక రానా ‘నంబర్ వన్ యారీ’ షో లో బాలకృష్ణ, వెంకటేశ్, జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్, నాని, నాగచైతన్య, సుమంత్, కియారా అద్వానీ, వరుణ్‌ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటి టాలీవుడ్ స్టార్స్ కనిపించారు. అదే తీరున అమెజాన్ ‘ద రానా దగ్గుబాటి షో’లోనూ వెంకటేశ్ , నాగచైతన్య, నాని లాంటివారు కనిపించారు. రానా షోస్‌లో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి డైరెక్టర్స్ కూడా పాల్గొన్నారు. అలా రానా కూడా టాక్ షోస్ తో అలరించారు.


బాలకృష్ణ, రానా తరువాత జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ గా జీటీవీ గ్రూప్ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోను నిర్వహించారు. ఇందులో నాగార్జున, ఆయన సోదరి నాగసుశీల పాల్గొన్న ఎపిసోడ్ అలరించింది. ఒకేసారి ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ కనిపించేవారు. ఇక నటీమణుల్లో జయప్రద (Jayapradha) నిర్వహించిన ‘జయప్రదం’ టాక్ షో తొలుత లోకల్ టీవీలో ప్రసారమైంది. ‘జయప్రదం’లో ఏయన్నార్, కె.విశ్వనాథ్, చిరంజీవి, కృష్ణంరాజు, జూనియర్ యన్టీఆర్, జయసుధ వంటివారు పాల్గొని అలరించారు. నటి మంచు లక్ష్మి కూడా జీ తెలుగులో ‘లక్ష్మీ టాక్ షో’ నిర్వహించారు. ఈటీవీలో ‘ప్రేమతో లక్ష్మీ’ కూడా మంచు లక్ష్మి (Manchu Lakshmi) హోస్ట్‌గా సాగింది. ఇలా ఎన్ని టాక్ షోస్ తెలుగునాట వెలుగు చూసినా, రాబోయే చిరంజీవి పాడ్ కాస్ట్ షోపై సినీ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే బాలయ్య ‘అన్ స్టాపబుల్’ను చిరు షో ఏ తీరున క్రాస్ చేస్తుందో చూడాలన్నదే వారి ఆసక్తికి కారణం. అప్పట్లో అప్ కమింగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌గా ఉన్న ‘ఆహా’లో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ రక్తి కట్టించింది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ జెయింట్ ప్లాట్ ఫామ్‌లో చిరు షో రానుంది.. ఎలా అలరిస్తుందో చూడాలి?

ఇవి కూడా చదవండి:

మోక్షజ్ఞ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్లు?

మరో విభిన్నమైన కథతో సిద్ధమైన ‘ది రెడ్ బ్యాగ్’ దర్శకుడు

Peddi Movie: దసరా బరిలో ‘పెద్ది’ కూడా..

Updated Date - Oct 04 , 2026 | 07:21 PM