ట్రోలర్‌కు అదిరిపోయే కౌంటరిచ్చిన ఆది సాయికుమార్.. పోస్ట్ వైరల్
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:29 PM
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై బాధ్యతారాహిత్యంగా కామెంట్లు చేయడం, ట్రోలింగ్ పేరుతో వ్యక్తిగతంగా అవమానించడం కొందరికి అలవాటుగా మారిపోయింది. అలా వచ్చిన ఓ కామెంట్‌పై ఆది సాయికుమార్ హుందాగా కౌంటర్ ఇచ్చారు.
టాలీవుడ్‌లో ఫలితాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నిరంతరం సినిమాలు చేసే హీరోల్లో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ఒకరు. అయితే సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై బాధ్యతారాహిత్యంగా కామెంట్లు చేయడం, ట్రోలింగ్ పేరుతో వ్యక్తిగతంగా అవమానించడం కొందరికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో తన కెరీర్, మార్కెట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఓ నెటిజన్‌కు ఆది సాయికుమార్ ‘ఎక్స్’ వేదికగా దిమ్మతిరిగే రీతిలో హుందాగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..
ఓ నెటిజన్ ఆది సాయికుమార్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు.. ఇప్పుడు నేను ప్యాంట్లు వేసుకుంటున్నా కానీ నువ్వు మాత్రం అక్కడే ఆగిపోయావు. నిన్న మొన్న వచ్చిన యూట్యూబర్ మౌళి గాడికి ఉన్న మార్కెట్ కూడా నీకు లేదు’’ అంటూ తీవ్రంగా ఎగతాళి చేశాడు. మొదట ఈ కామెంట్‌ను చూసి నవ్వుతున్న ఎమోజీలతో స్పందించిన ఆది.. ఆ తర్వాత అతడికి గట్టి కౌంటర్ ఇస్తూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
ప్రతి హీరో వెనుక ఓ పోరాటం ఉంటుంది!
ట్రోలర్‌కు బుద్ధి చెబుతూ.. ‘‘ప్రతి హీరోకూ సొంత కథ ఉంటుంది.. సొంత పోరాటం ఉంటుంది. నాన్న (సాయికుమార్) ఎన్నో ఏళ్లపాటు తీవ్రంగా శ్రమించారు.. రవి అన్న కూడా ఎంతో పోరాటం చేశారు. అలా కష్టపడ్డంత మాత్రాన వాళ్లు పనికిరారని, పని అయిపోయిందని అంటారా? అస్సలు కాదు! ప్రతి నటుడి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తులను కిందకు లాగేయాలని చూడటం మానేసి, వారిని ప్రోత్సహించడం నేర్చుకోండి. సినిమా అనేది ఒక నిరంతర ప్రయాణం.. అందులో గెలుపోటములు సహజమైన భాగాలు’’ అని ఆది కుండబద్దలు కొట్టేశారు.
ట్విట్టర్‌లో పెరుగుతున్న విష సంస్కృతిపై ఆది ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘‘ఇలాంటి నెగెటివ్ ఆలోచనల వల్లే ఎక్స్ అనేది సినిమాను ఆస్వాదించే వేదికగా కాకుండా, కేవలం ఫ్యాన్ వార్స్ కొట్టుకునే స్థలంగా మారిపోయింది. ప్రతి ఒక్కరి ప్రయాణాన్ని గౌరవించడం నేర్చుకోండి’’ అంటూ హితవు పలికారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కించపరిచేలా మాట్లాడిన ట్రోలర్‌పై సహనం కోల్పోకుండా, చాలా హుందాగా, లోతైన అర్థంతో ఆది సాయికుమార్ ఇచ్చిన ఈ సమాధానం నెటిజన్ల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం ఆది పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, సినీ ప్రియులు ఆయనకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
‘కరికాల’ చిత్రంలో కేథరిన్ థ్రెసా.. ఫస్ట్ లుక్ విడుదల
‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్, రశ్మికల స్పందనిదే
రాజమౌళి చెరిపేసిన సెంటిమెంట్స్ ఎన్నో.. ఇప్పుడు ‘వారణాసి’పై కొత్త చర్చ