సీమ పౌరుషం తర్వాత ఉత్తరాంధ్ర కళకు జై కొట్టిన నారా లోకేష్..
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:08 PM
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సినీ ప్రియుడిగా, మన సంస్కృతిని ప్రతిబింబించే కథలను ప్రోత్సహించే నాయకుడిగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సినీ ప్రియుడిగా, మన సంస్కృతిని ప్రతిబింబించే కథలను ప్రోత్సహించే నాయకుడిగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటికే 18వ శతాబ్దపు రాయలసీమ కరవు, వీరుల చరిత్ర నేపథ్యంలో విజయ్ దేవరకొండ నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం ‘రణబాలి’ (Ranabaali) ట్రైలర్‌ను మెచ్చుకుని చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తిన లోకేష్.. తాజాగా మరో నేల కళను వెలుగులోకి తెస్తున్న ఒక చిన్న చిత్రానికి బాసటగా నిలిచారు. రాయలసీమ పౌరుషానికి అండగా నిలిచిన ఆయన, ఇప్పుడు ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి జీవిత కథతో తెరకెక్కిన ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) చిత్రాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించి రెండు ప్రాంతాల మట్టి కథలకు పూర్తి న్యాయం చేశారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన బయోపిక్ చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్ పోషిస్తుండగా, గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన నారా లోకేష్.. ‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ‘‘సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమా పాటలు, టీజర్ నాలో ఎంతో ఆసక్తిని రేపాయి. అసలు ఎవరీ గరివిడి లక్ష్మి? ఏంటా కథ? అని ఆరా తీశాను. ఊరు పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని, బుర్రకథనే జీవితంగా బతుకుతూ.. కళకే ప్రాణం పోసిన రెడ్డి విజయలక్ష్మి యథార్థ గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ, సాంప్రదాయ బుర్రకథ శైలికి ఉత్తరాంధ్ర జానపదాలు, పల్లెపదాల సొబగులు జోడించి బుర్రకథ కళకే వన్నెతెచ్చిన మహోన్నత కళాకారిణి ఆమె. అలాంటి గరివిడి లక్ష్మి సినిమా విడుదల కోసం సామాన్య ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రంలో భాగమైన కళాకారులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ నటి ఆనంది, నటుడు రాగ్ మయూర్‌లను ట్యాగ్ చేస్తూ లోకేష్ అభినందించారు.
లోకేష్ ప్రోత్సాహం కొండంత బలం
మంత్రి నారా లోకేష్ ప్రశంసలపై చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది. ‘‘మా ‘గరివిడి లక్ష్మి’ చిత్రంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, మీ విలువైన ప్రశంసలకు హృదయపూర్వక ధన్యవాదాలు లోకేష్ గారు. బుర్రకథ కళకు, ఉత్తరాంధ్ర జానపద సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన గరివిడి లక్ష్మి గారి యథార్థ గాథను వెండితెరపైకి తీసుకురావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీలాంటి నాయకుల ప్రోత్సాహమే మా చిత్ర బృందానికి కొండంత బలాన్నిస్తుంది. ప్రేక్షకులందరి ఆదరాభిమానాలతో ఈ చిత్రం అందరి హృదయాలను గెలుచుకుంటుందని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొంది.
సీమ పౌరుషం.. ఉత్తరాంధ్ర సంస్కృతి
‘రణబాలి’ విషయంలో రాయలసీమ మట్టి వీరుల కథను, నాటి బ్రిటిష్ కరవు నేపథ్యాన్ని గొప్పగా చూపించారంటూ అభినందించిన లోకేష్.. ఇప్పుడు ఉత్తరాంధ్ర మారుమూల గ్రామం నుంచి వచ్చి తన గళంతో తెలుగు సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేసిన ఓ మహిళా జానపద కళాకారిణి బయోపిక్‌ను గుర్తించి ప్రశంసించడం విశేషం. బడ్జెట్ ఎంత, సినిమా పరిమాణం ఎంత అన్నది చూడకుండా.. మన మూలాలు, మట్టి సంస్కృతిని తెరపైకి తెస్తున్న చిత్రాలకు లోకేష్ ఇస్తున్న ఈ మద్దతుపై చిత్రసీమతో పాటు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ట్రోలర్‌కు అదిరిపోయే కౌంటరిచ్చిన ఆది సాయికుమార్.. పోస్ట్ వైరల్
‘కరికాల’ చిత్రంలో కేథరిన్ థ్రెసా.. ఫస్ట్ లుక్ విడుదల
‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్, రశ్మికల స్పందనిదే