క్రెడిట్ కొట్టేస్తున్నారు.. అల్లు అరవింద్‌కు రాజమౌళి సలహా
ABN, Publish Date - Nov 28 , 2026 | 02:23 PM
పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ మూవీ సక్సెస్ ఈవెంట్లో రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) హీరోయిన్గా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. నవంబర్ 20న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ట్రెమండస్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ శుక్రవారం సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ.. ‘‘ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక కల కనడం ఒక ఎత్తు, ఆ కలను సాకారం చేసుకోవడం మరో ఎత్తు, సాకారం చేసుకున్న ఆ కల ఇంత మంచి సక్సెస్ తీసుకురావడం ఇంకో ఎత్తు. ఈ మూడు ఈరోజు జరిగాయి. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో ముందుగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఇంత మంచి సినిమాకు ఇంత గొప్ప ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ. ఈ కలను సందీప్, రమ్య, పవన్, రాజు బావ భుజాన మోశారు. ఒక కలను అన్నేళ్లు మోయడం అంత తేలిక కాదు. ఈ విషయంలో వారిని అభినందిస్తున్నాను.
సినిమా పరంగా స్వప్న, నా ఏజ్ ఒకటే. ఎందుకంటే స్వప్న బ్యానర్లోనే ‘స్టూడెంట్ నంబర్ వన్’ సినిమాతో నేను దర్శకుడిగా పరిచయం అయ్యాను. ‘ఆకాశంలో ఒక తార’ ఇంత అద్భుతంగా రావడానికి స్వప్నే కారణం. తనే ఈ స్థాయిలో రూపొందించింది. అల్లు అరవింద్ గారు అవార్డు విన్నింగ్ సినిమాలు చేస్తున్నారు. కాకపోతే నాకు ఒక కోరిక ఉంది. ఇలా కలిసి చేస్తున్నప్పుడు ఈ యంగ్ ప్రొడ్యూసర్స్ అందరూ క్రెడిట్ మొత్తం తీసేసుకుంటున్నారు. ఆయన ‘మగధీర’ చేసినట్టు సోలో ప్రొడక్షన్లో ఒక సినిమా చేయాలి. లేదంటే క్రెడిట్ అంతా వాళ్లే కొట్టేస్తున్నారు.
‘ఆకాశంలో ఒక తార’ హార్ట్ టచింగ్ సినిమా. ఈ కథ హార్ట్ టచింగ్‌గా ఉండటానికి స్క్రీన్‌ప్లే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా బిగినింగ్, ఎండింగ్లో ఉండే పాయింట్స్‌ను బ్లెండ్ చేస్తూ ఒక అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు. చివర్లో కల్పన, నాజర్ పాత్రల మధ్య ఉండే సన్నివేశం చూసినప్పుడు నిజంగా చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి సీన్లు, డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. ‘నీ కల ఆకాశంలో ఉంటే భూమితో నాకేం అవసరం’ అనే డైలాగ్ కూడా కచ్చితంగా గంగరాజు గారే రాసి ఉంటారు. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఇంకా సినిమా చూడని వారు ఉంటే కచ్చితంగా ఈ వీకెండ్ వెళ్లి సినిమా చూడండి.
ఇందులో చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా నటించారు. రుహాని చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే దుల్కర్ సిస్టర్‌గా చేసిన శ్వాసిక క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది. శ్రుతి తన పాత్రను ఎంతో సహజంగా చేసింది. ఆ పాత్రలో ఇమిడిపోయింది. తెలుగులో ఎవరినైనా సరే ఆదరిస్తారు. కాకపోతే ఒక తెలుగు అమ్మాయి జయప్రద గారు, శ్రీదేవి గారిలా గొప్ప స్టార్ అయితే బాగుంటుందని మనసులో ఉంటుంది. ఆ లోటును సాత్విక భర్తీ చేస్తుంది. తప్పకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తుంది. ఈ సినిమా దుల్కర్ భుజాల మీద నిలబడింది. అందులో సందేహం లేదు. దుల్కర్ లేకపోతే ఇలాంటి అందమైన సినిమాను చూసేవాళ్లం కాదు. ఈ విషయంలో దుల్కర్‌కు థ్యాంక్యూ. దుల్కర్ విషయంలో ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటుంది. దుల్కర్ మనోడే. పవన్ సాధినేని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో నాకు తెలుసు. ఒక దర్శకుడిగా నేను అర్థం చేసుకోగలను. కచ్చితంగా పవన్‌కు చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుంది. ఇలా మనసుల్ని కదిలించే సినిమాలు మరిన్ని చేసి, నిర్మాతలకు డబ్బులు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ అభినందనలు’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
తెలుగు సినిమాల్లో డార్క్ హీరోయిజం.. ట్రెండ్ ఇదే కానీ..?
ఎన్టీఆర్, మహేష్, బన్నీ కాదు.. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ ప్రాజెక్ట్ ఇదే
‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. కోన వెంకట్, బాబీ పోస్టులతో ఫుల్ క్లారిటీ