Aakasamlo Oka Tara: జీవీ ప్రకాశ్.. మొత్తానికి తెలుగు వాళ్లను మెప్పించావ్ పో
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:21 AM
జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార చిత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన ముద్ర వేస్తు దూసుకెళుతున్నాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో స్టెయిట్ తెలుగు హీరో అని గుర్తింపును, స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టిన దుల్కర్ ప్రస్తుతం తెలుగులో కాంత, ఆకాశంలో ఒక తార (AakasamLo Oka Tara) అనే రెండు ప్రెస్టీజియస్ సినిమాలను లైన్‌లో పెట్టాడు.
అయితే దుల్కర్ (Dulquer Salmaan) జన్మదినం సందర్భంగా సోమవారం ఆయన నటిస్తున్న చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్ వీడియోలను మేకర్స్ రిలీజ్ చేశారు. వాటిలో.. తన హోం బ్యానర్‌గా చెప్పుకునే స్వప్న సినిమా (Swapna Cinema), గీతా ఆర్ట్స్ (Geetha Arts), లైట్ బాక్స్ మీడియా (Light Box Media) నిర్మాణంలో ఆకాశంలో ఒక తార అనే చిత్రం చేస్తున్నాడు. దీనికి గతంలో సేనాపతి, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన పవన్ సాధినేని (Pavan Sadineni) దర్శకత్వం వహిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. అమెరికాకు చెందిన సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) కథానాయికగా పరిచయం అవుతోంది. మరో వైపు.. నటుడు రానాతో కలిసి సంయుక్తంగా నిర్మించి నటిస్తున్న కాంత సినిమా టీజర్‌ను సైతం రిలీజ్ చేయగా ఈ రెండు వేటికవే భిన్నంగా ఉండి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా ఆకాశంలో ఒక తార సినిమా గ్లిమ్స్ గురించి సోషల్ మీడియాలో అధిక చర్చ జరుగుతుంది. కేవలం 50 సెకండ్లు మాత్రమే ఉన్న ఈ చిన్న వీడియో గ్లిమ్స్‌కు చాలామంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ స్పెషల్ ట్రాన్స్‌లోకి వెళ్లి పోతున్నారు. ఎలాంటి డైలాగ్స్, యాక్షన్ లేకుండా కేవలం బ్యా గ్రౌండ్ మ్యూజిక్‌తో మాత్రమే వచ్చిన ఈ గ్లిమ్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తోంది. ఒక్కసారి విన్న వారు దానిని వదలలేక పోతున్నారు. పదే పదే వింటూ తమను తామే మైమరిచి పోతున్నారు. దీంతో గ్లిమ్స్ రిలీజ్ అయి ఒక్క రోజు పూర్తి కాక ముందే 4 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం.
ఈ గ్లిమ్స్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో దుల్కర్‌కు మరో భారీ హిట్, ప్రేక్షకులకు ఓ ఫీల్ గుడ్ మూవీ కన్ఫమ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేగాక ఇప్పటివరకు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలకు సరైన మ్యూజిక్ ఇవ్వడు కేవలం తమిళ స్టార్లకు మాత్రమే మంచి సంగీతం అందిస్తాడనే అపవాదు మూట గట్టుకున్న జీవీ ప్రకాశ్ కుమార్ (G. V. Prakash Kumar) కు ఈసినిమా సంగీతం ఆపేరును తుడిచి పెట్టేసినట్లైంది. అనేక మంది జీవీ బ్యా గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకుంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.. అసలు ఏం తిని సంగీతం చేశావు అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఇంతవరకు వినకుంటే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ గ్లిమ్స్ చూసి, విని ఆస్వాదించండి.