సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రదీప్ రావత్ మృతి.. టాలీవుడ్‌లో స్పందనేది

ABN, Publish Date - Aug 05 , 2026 | 03:39 PM

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన రఫ్ అండ్ విలనిజంతో మెప్పించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం భివాండీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.

Pradeep Rawat

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన రఫ్ అండ్ విలనిజంతో మెప్పించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (Pradeep Rawat) (74) మంగళవారం భివాండీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. 1952లో ఢిల్లీలో జన్మించిన ప్రదీప్ రామ్‌సింగ్ రావత్, బ్యాంక్ ఉద్యోగం వదిలి దూరదర్శన్ మెగా సీరియల్ ‘మహాభారత్’లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘బాఘీ’, ‘లగాన్’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆయనను, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘సై’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఆ చిత్రంలో 'భిక్షు యాదవ్' పాత్రలో ప్రదీప్ రావత్ కనబరిచిన భయంకరమైన నటన టాలీవుడ్ చరిత్రలోనే ఐకానిక్ విలనిజంగా నిలిచిపోయింది.


‘సై’ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ.. ఇలా దాదాపు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ భయంకరమైన విలన్‌గా, పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించారు. ‘గజినీ, ఛత్రపతి, స్టాలిన్, భద్ర, జగడం’ వంటి చిత్రాలు ఆయన నటనకు నిదర్శనం. తెలుగు చిత్ర పరిశ్రమను తన ‘గాడ్ మదర్’గా భావిస్తూ, టాలీవుడ్ అంటే తనకు ఎంతో అభిమానమని ఆయన అనేక ఇంటర్వ్యూలలో ఆప్యాయంగా చెప్పేవారు.


అయితే, అంతటి ఘన చరిత్ర ఉన్న నటుడు మరణిస్తే.. టాలీవుడ్ నుంచి సరైన స్పందన లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మినహా, టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకులు గానీ, నిర్మాతలు గానీ కనీసం సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించకపోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా, ఆయనను టాలీవుడ్‌కు పరిచయం చేసి గాడ్‌ఫాదర్‌లా నిలిచిన రాజమౌళి నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి సంతాప సందేశం రాకపోవడం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనిషి ఉన్నప్పుడు ఉపయోగించుకుని, చనిపోయాక కనీసం గుర్తుచేసుకోకపోవడం టాలీవుడ్ స్వార్థానికి నిదర్శనమని కామెంట్లు వస్తున్నాయి. ఇక ఇందులో చెప్పుకునేది ఏమైనా ఉందీ అంటే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున మంచు విష్ణు నివాళులు అర్పించడం. ఏది ఏమైనా, భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

ఇవి కూడా చదవండి:

తండ్రి పాత్రకు పొట్ట బాగా ఉండాలన్నారు.. ఏం చేసేవాడినంటే: త్రినాథరావు నక్కిన

గ్లామర్‌ డోస్ పెంచితే ఆఫర్స్‌ వచ్చేస్తాయా రాశీ..

ఓరి మీ దుంప‌ తెగ.. స్పైడ‌ర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!

Updated Date - Aug 05 , 2026 | 03:39 PM