తండ్రి పాత్రకు పొట్ట బాగా ఉండాలన్నారు.. ఏం చేసేవాడినంటే: త్రినాథరావు నక్కిన
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:41 PM
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తోన్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీ గురించి నిర్మాతలు చెప్పిన ముచ్చట్లివే.
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తోన్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిర్మాతలు త్రినాథరావు నక్కిన (Thrinadha Rao Nakkina), కాండ్రేగుల నాయుడు (Kandregula Naidu) మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలిపారు.
ముందుగా త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ..
‘‘కాండ్రేగుల నాయుడు అనకాపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. సినీ ఇండస్ట్రీలోకి వస్తానంటూ.. నాతో ఎప్పుడూ చెబుతుండేవాడు. నేను వద్దని చెబుతుండేవాడిని. చివరకు పట్టుదలతో నిర్మాత అయ్యాడు. ‘అనకాపల్లి’ కథను నేనే రాసుకున్నా. కానీ తీయకుండా అలా పెట్టేశాను. దర్శకుడిగా జర్నీ మొదలైన తర్వాత కొన్ని సమీకరణాలు మారుతూ ఉంటాయి. అందుకే నా దగ్గర ఉన్న మంచి కథల్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై తీయాలని అనుకుంటున్నాం. ఈ మూవీని కూడా నేనే తీసినట్లుగా భావించవచ్చు. ఈ మూవీని పూర్తిగా అనకాపల్లిలోనే షూట్ చేశాం. లొకేషన్స్ రియల్‌గా ఉండాలని మా సొంత ఊర్లోనే తీశాం. ఇది ఓ టౌన్‌లో జరిగే లవ్ స్టోరీ. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ కథకి ఈ టైటిల్ యాప్ట్. పైగా సొంతూరు అనే మమకారంతో ఆ పేరు పెట్టాను. ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఎమోషన్స్ అంటే ఏంటో తెలియడం లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ తెలియాలని, తెలియజేయాలని ఈ మూవీని తీశాం. ప్రస్తుత తరానికి ఈ సినిమాతో ఓ సందేశం ఇవ్వాలని అనుకున్నాను. ఇది నా బాధ్యతగా భావించాను. యాక్షన్ ఎక్కువగానే ఉన్నా.. ఫ్యామిలీ డ్రామానే డామినేట్ చేస్తుంది. ఇక ఇందులో నేను కూడా ఓ పాత్ర చేశాను. ప్రతీ దర్శకుడిలో ఓ నటుడు ఉంటాడు. దర్శకుడు, హీరో అందరూ కలిసి నన్ను ఒప్పించారు. నాకు పొట్ట ఉన్నా కూడా.. ఇంకా పొట్ట కావాలని మా దర్శకుడు అనేవాడు. అందుకే ప్రతీ రోజూ సెట్‌కి వెళ్లేటప్పుడు బిర్యానీ ఫుల్లుగా తినేసేవాడ్ని. ఇంద్రజ, విక్రమ్, సంధ్య అద్భుతంగా నటించారు. ఇందులోని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ పోటీ పడుతూ నటించారు. ప్రస్తుతం నేను డైరెక్ట్ చేస్తున్న ‘నేను రెడీ’ పూర్తయింది. రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. దర్శకుడిగా కొన్ని స్క్రిప్ట్‌లు రెడీ చేశాను. నిర్మాతగా మాత్రం సినిమాలు వెంటనే రావు. కాస్త గ్యాప్ ఉంటుంది. ‘ధమాకా’ని మించిన కథ, స్క్రిప్ట్ కుదిరితేనే ‘ధమాకా-2’ గురించి ఆలోచిస్తాను’’.. అని తెలిపారు.
మరో నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ..
‘‘మా సొంత ఊరిలో షూట్ చేయడంతో మాకు బాగా కలిసి వచ్చింది. ప్రతీ ఒక్కరూ మాకు సపోర్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకెంతో సపోర్ట్ చేసింది. నేచురల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల అవుట్ పుట్ చాలా ఎఫెక్టివ్‌గా వచ్చింది. త్రినాథరావు చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. కథ విన్న వెంటనే.. మనం చేసేద్దామని చెప్పేశాను. నేను ఏమీ మార్పులు చేర్పులు చెప్పలేదు. ఓ సినిమా వెనుక చాలా మంది కష్టం ఉంటుంది. బడ్జెట్ పెడుతున్నామంటే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. కష్టపడేది వాళ్లు అయినా.. పేరు మాత్రం మాకు వస్తుంది. అందుకే బ్యానర్లు స్థాపించాం. రెగ్యులర్‌గా సినిమాల్ని నిర్మించాలని అనుకుంటున్నాం. సొంతూరిలో మా సినిమాని తీయడం నాకెంతో ఆనందంగా అనిపించింది. మొత్తం 75 లొకేషన్లలో చిత్రీకరించాం. సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది. నాది, త్రినాథరావుది ఒకే ఊరు. హైదరాబాద్‌లో ఉన్నా.. అతని మనసు మాత్రం మాతోనే, మా ఊర్లోనే ఉంటుంది. నేను నా జర్నీని త్రినాథరావుతో కంటిన్యూ చేస్తాను. మంచి కథలు వస్తే సొంతంగానూ, ఇతర బ్యానర్లతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
గ్లామర్ డోస్ పెంచితే ఆఫర్స్ వచ్చేస్తాయా రాశీ..
ఓరి మీ దుంప తెగ.. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా!
‘రాంబాయి’ కూడా ఫీల్డ్‌లోకి దిగిందిగా!