‘డార్లింగ్’ క్రేజ్‌తో ‘ఈశ్వర్’.. వర్కవుట్ అవుతుందా?
ABN , Publish Date - Apr 26 , 2026 | 08:59 AM
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఓల్డ్ చిత్రాలను వరసగా థియేటర్లలో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవునని చెప్పక తప్పదు. అందుకు కారణం మాత్రం ‘డార్లింగ్’ చిత్రమే.
రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా నటించిన ఓల్డ్ చిత్రాలను వరసగా థియేటర్లలో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవునని చెప్పక తప్పదు. అందుకు కారణం మాత్రం ‘డార్లింగ్’ (Darling) చిత్రమే. ఈ సినిమా తాజాగా రీ రిలీజ్ అవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ప్రభాస్ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ‘ఈశ్వర్’ (Eeswar) చిత్రాన్ని రీ రిలీజ్‌కు తీసుకువస్తున్నారు. 2024లో ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకుని ఈ సినిమాను 4కె వెర్షన్‌లో రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ‘డార్లింగ్’ క్రేజ్, కలెక్షన్స్ చూసి, మరోసారి థియేటర్లలోకి ‘ఈశ్వర్’ని తెచ్చేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు.
రెబల్ మానియా అంటూ ‘ఈశ్వర్’ చిత్రాన్ని జూన్ 13న రీ రిలీజ్‌కు చేయబోతున్నట్లుగా తెలుపుతూ, అధికారికంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే, ఇంతకు ముందు ప్రభాస్ బర్త్‌డేకి వచ్చినప్పుడు ఈ సినిమా అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇటీవల ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ నిరాశ పరచడంతో.. ఫ్యాన్స్ ‘డార్లింగ్’ కోసం ఎగబడ్డారు. అందుకే ఈ సినిమా రీ రిలీజ్‌లో రికార్డులను క్రియేట్ చేసింది. ‘డార్లింగ్’ సక్సెస్ చూసి, వెంటనే ‘ఈశ్వర్’ని థియేటర్లలోకి తీసుకురావాలనుకోవడం, అందులోనూ జూన్ నెలలో అంటే సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే, జూన్ నెలలో భారీ ప్రాజెక్ట్స్ విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి అలాంటి సమయంలో ‘ఈశ్వర్’ రీ రిలీజ్ అంటే, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
‘ఈశ్వర్’ సినిమా విషయానికి వస్తే.. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండేలా దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రభాస్ ఈ చిత్రంతోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. అశోక్ కుమార్ నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీని లక్ష్మీ నరసింహా మూవీస్ సంస్థ రీ రిలీజ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
లెజెండరీ మల్టీస్టారర్ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!
Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు