పవన్, చరణ్.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..
ABN, Publish Date - Aug 15 , 2026 | 08:54 PM
మెగా అభిమానులకు త్వరలోనే పూనకాలు తెప్పించే వార్త రాబోతోంది. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ట్రీట్ ఇవ్వబోతున్నారు.
మెగా అభిమానులకు త్వరలోనే పూనకాలు తెప్పించే వార్త రాబోతోంది. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒకే నెలలో షూటింగ్స్ ప్రారంభించబోతున్నారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓజీ 2’ పట్టాలెక్కేందుకు ముస్తాబవుతోంది.
ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమాతో ఆయన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తన అందం, అభినయంతో ఆకట్టుకోగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది.
‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘RC17’ చేయనున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన, సుకుమార్ టేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ బ్లాక్‌బస్టర్ జోడీ కలవనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ చిత్రం నవంబర్ నెలలోనే గ్రాండ్‌గా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.
ఇక ఇంకోవైపు బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అభిమానులకు అదిరిపోయే తీపి కబురు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రస్తుతం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఓజీ 2’లో నటించబోతున్నారు. యంగ్ సెన్సేషన్ సుజీత్ దర్శకత్వంలో రానున్న ఈ సీక్వెల్ సైతం నవంబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ చూపించిన బాడీ లాంగ్వేజ్, ఆ వింటేజ్ స్టైల్, ఆయన మేనరిజమ్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీనికి తోడు సుజీత్ స్టైలిష్ మేకింగ్, ఎస్. థమన్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని అందించాయి. అందుకే ఇప్పుడు ‘ఓజీ 2’ కోసం సినీ ప్రేమికులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మిస్తుండటం మరో విశేషం.
ఒకే నెలలో.. అదీ నవంబర్‌లో బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’, అబ్బాయ్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబో ప్రాజెక్ట్స్ షూటింగ్‌లు మొదలవుతుండటం టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ న్యూస్ అని చెప్పాలి. రెండు భారీ ప్రాజెక్టులు ఒకే సమయంలో పట్టాలెక్కడం సినీ అభిమానులకు నిజంగా పండుగే. దీనిపై పూర్తి వివరాలు, అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
‘ది ఇండియన్ బార్డర్’ నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ సాంగ్ విడుదల
బోనాలు.. ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!
SYG: సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’.. డేట్ ఫిక్స్