సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్.. ‘సింగ్ గీతం’కు అదిరిపోయే బూస్ట్

ABN, Publish Date - Jun 11 , 2026 | 11:09 PM

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ‘సింగ్ గీతం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి.. సింగీతం శ్రీనివాసరావు అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ అద్భుతమైన ట్వీట్ వచ్చింది.

PKCW Greetings to Sing Geetham

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ‘సింగ్ గీతం’ (Sing Geetham)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ మూవీని చూసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులెందరో వారి ఆశను వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్ (Pawan Kalyan Creative Works) బ్యానర్ నుంచి.. సింగీతం శ్రీనివాసరావు అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ అద్భుతమైన ట్వీట్ వచ్చింది. అందులో..

‘‘సింగ్‌ గీతం - సింగీతం శ్రీనివాసరావు అజరామరమైన వారసత్వానికి వేడుక

‘వయసు శరీరాన్ని నెమ్మదింపజేయవచ్చేమో కానీ, నిజమైన క్రియేటివిటీకి వయసుతో పనిలేదు’

‘సింగ్ గీతం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. తమ అద్భుత ఊహాశక్తితో భారతీయ సినిమాకు చెందిన ఎన్నో తరాలను ప్రభావితం చేసిన లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు అసాధారణ ప్రయాణాన్ని అభినందించడానికి మేము ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాము. 94 సంవత్సరాల వయసులో ఈ చిత్రం ద్వారా ఆయన మళ్లీ దర్శకుడి కుర్చీలో కూర్చున్నారు. దీక్షకు వయసుతో సంబంధం లేదని, ఒక నిజమైన కళాకారుడి ఆత్మ ఎల్లప్పుడూ యవ్వనంగానే ఉంటుందని సింగీతం మనకు గుర్తుచేస్తున్నారు.


1972లో ‘నీతి నిజాయితీ’ అనే చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటి నుంచి, భారతీయ సినిమాలో ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన క్లాసిక్ చిత్రాలను సృష్టించడం వరకు.. ఆయన చేసిన పనులన్నీ భయం లేని కథావిధానానికి, హద్దులు లేని క్రియేటివిటీకి నిదర్శనంగా నిలుస్తాయి. భాషతో సంబంధం లేకుండా కేవలం ఎమోషన్స్‌తోనే కథను చెప్పవచ్చని నిరూపిస్తూ ఆయన మనకు ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక విమానం’ అందించారు. ‘ఆదిత్య 369’ ద్వారా భారతీయ సినిమాలోనే ఊహాజనితమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘మైఖేల్ మదన కామరాజు, అపూర్వ సహోదరులు, భైరవద్వీపం, మయూరి, విచిత్ర సోదరులు’ వంటి చిత్రాలతో ఆయన ఎన్నో విభిన్నమైన జోనర్లను అలవోకగా హ్యాండిల్ చేస్తూ.. సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో నిరంతరం నిరూపిస్తూ వచ్చారు.

ఆయనని అత్యంత విశిష్టమైన వ్యక్తిగా నిలబెట్టింది కేవలం ఆయనకున్న బహుముఖ ప్రజ్ఞ మాత్రమే కాదు, ప్రేక్షకుల మేధస్సుపై ఆయనకున్న అచంచలమైన నమ్మకం. ఆయన ప్రేక్షకులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయలేదు. కొత్త ప్రయోగాలను ఆహ్వానించారు, ఒరిజినాలిటీని గౌరవించారు, కథలు చెప్పే విధానంలో ఎప్పటికప్పుడు సరిహద్దులను చెరిపేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు మధ్య ఎంతో కాలంగా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం, వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయడానికి ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఎన్నో క్రియేటివిటీ థాట్స్‌తో ప్రారంభమైంది. కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని పరిస్థితుల కారణంగా కార్యరూపం దాల్చలేదు.


ఆ కలయిక సాకారం కాకపోయినప్పటికీ, సింగీతంపై పవన్ కళ్యాణ్‌కు ఉన్న గౌరవం, అభిమానం ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పటికీ ఎందరో నటీనటులకు, ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తున్న ఒక దర్శకుడి యొక్క వినయం, వినూత్న ఆలోచనలను ఆయన ఎల్లప్పుడూ అభినందిస్తూనే ఉంటారు. చాలా మంది తమ విజయాలతో విశ్రాంతి తీసుకునే వయసులో కూడా, సింగీతం ఇప్పటికీ కలలు కంటున్నారు, సృష్టిస్తున్నారు, ఇంకా స్ఫూర్తినిస్తున్నారు. ఒక నిజమైన కళా నైపుణ్యాన్ని వయసుతో కొలవలేమని, ప్రతి రోజూ ఏదైనా కొత్తగా ఊహించాలనే సంకల్పమే దానికి కొలమానమని ఆయన ప్రయాణం మనకు గుర్తుచేస్తుంది.

ఈ లెజెండరీ దర్శకుడిని మళ్లీ మెగాఫోన్ పట్టేలా చేసి, ఆయన మాయాజాలాన్ని చూసేందుకు ప్రేక్షకులకు మరో అవకాశం కల్పించిన వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా, నాగ్ అశ్విన్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ టీమ్స్‌తో పాటు ‘సింగ్ గీతం’ చిత్రంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికీ మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా, చిత్రబృందానికి, నటీనటులకు ఈ సినిమా ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నాము..’’ అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!

Updated Date - Jun 11 , 2026 | 11:09 PM