సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jr. NTR: గాయాలు కొత్త కాదు... మరి గోప్యత ఎందుకు!?

ABN, Publish Date - Jul 28 , 2026 | 03:43 PM

ఎన్టీఆర్‌ భుజానికి గాయం అయ్యిందనే ఒకే ఒక్క వార్త... ఎన్నో సందేహాలకు తెరలేపింది. గాయం షూటింగ్‌లో జరిగిందా? ఇంటిలో జరిగిందా? అనేది తెలియక అభిమానులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.

Jr NTR

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు కొత్త కాదు. ఆయనకు తొలి సూపర్ హిట్‌ను అందించిన 'స్టూడెంట్‌ నెం.1' చిత్రం నుంచి 'ట్రిపుల్ ఆర్' వరకూ ఎన్టీఆర్ చాలా చిత్రాల షూటింగ్‌లో గాయపడ్డారు. అంతేకాదు... ఆ మధ్య ఓ యాడ్ ఫిల్మ్ మేకింగ్‌ సమయంలోనూ గాయపడ్డారు. అలానే తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసి, హైదరాబాద్‌ వస్తుండగా, ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీటన్నింటినీ ఎన్టీఆర్ ధైర్యంగా ఎదుర్కొని బయట పడ్డారు. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి షూటింగ్స్ లో పాల్గొన్నారు.

అయితే ఇటీవల ఎన్టీఆర్ విషయంలో ఎందుకో గోప్యత ఎక్కువ జరుగుతోంది. ఆయన డైరెక్ట్ గా రంగంలోకి రాకుండా పీ.ఆర్. టీమ్‌తోనే వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆ మధ్య 'రా ఎన్టీఆర్' బృందం నిధులు సేకరిస్తున్నారని తెలిసినప్పుడు ఎన్టీఆర్ స్వయంగా మీడియా ముందుకు రాకుండా తన పీఆర్ టీమ్‌లోనే 'రా ఎన్టీఆర్' సంస్థకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పించారు. ఆ తర్వాత 'రా ఎన్టీఆర్'లోని కీలక వ్యక్తులు ఎన్టీఆర్ చెబితేనే తమ కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెడతామని చెప్పినా... ఎన్టీఆర్ వ్యూహాత్మక మౌనం పాటించారు తప్పితే... వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు.


అలానే సోమవారం ఎన్టీఆర్ భుజానికి గాయం అయ్యిందనే ప్రకటన ఆయన పీ.ఆర్. టీమ్‌ నుంచి వచ్చింది. అందులో వైద్యం చేస్తున్న డాక్టర్ల పేర్లు చెప్పారు తప్పితే అసలు భుజానికి గాయం ఎలా అయ్యింది? ఎంత తీవ్రంగా అయ్యింది? అనే విషయాలను మాత్రం బయట పెట్టలేదు. ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటూనే ఆ గాయం నుంచి కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని అన్నారు. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ హెల్త్ కు సంబంధించి ఎప్పటి కప్పుడు అప్ డేట్స్ ఇస్తామని ప్రకటించారు. నిజంగా అంత తీవ్రమైన గాయం కాకపోతే ఇక అప్ డేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అనేది అభిమానులను తొలిచి వేస్తున్న ప్రశ్న.


ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ 'డ్రాగన్' షూటింగ్‌ హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని వార్తలు వచ్చాయి. అందులో యాక్సన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ కు ఈ గాయం అయ్యిందని కొందరు చెబుతున్నారు. కానీ ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా తమ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగినట్టు చెప్పలేదు. దాంతో ఎన్టీఆర్‌ కు ఎప్పుడు? ఎక్కడ గాయం అయ్యిందనే ప్రశ్న ఉదయిస్తుంది. అలానే అసలు ఎన్టీఆర్‌ 'డ్రాగన్‌' షూటింగ్‌లో పాల్గొంటున్నారా? ఆయన లేకుండానే షూటింగ్‌ జరుపుతున్నారా? అనే సందేహమూ కలుగుతుంది. ఒకవేళ ఎన్టీఆర్ 'డాగ్రన్' షూటింగ్‌ లో పాల్గొనకపోతే... ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్న వస్తుంది. అప్పుడు గాయం ఇంటిలోనే జరిగిందని అనుకోవాలి. లేదా ఎన్టీఆర్ చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తారని చెబుతుంటారు. అలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగిందా? అనే డౌట్ కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఒక గాయం చుట్టూ ఎన్నో సందేహాలు ముసిరి ఉండగా, ఓ చిన్న ప్రెస్ నోట్‌ విడుదల చేసి, అందరినీ ఆందోళనకు గురిచేసినట్టు అయ్యింది. లక్షలాది మంది అభిమానులు ఉన్న ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి గోప్యత సబబు కాదని కొందరు చెబుతున్నారు. ఎన్టీఆర్‌తోనే ఓ చిన్న పాటి వీడియో తీసి, ఎలాంటి ఆందోళన చెందవద్దని అభిమానులకు చెప్పించి ఉంటే... ఊహాగానాలకు తావు ఇచ్చే ఆస్కారం ఉండేది కాదన్నది వారి అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

హీరో రవి మోహన్‌కు ఊరట.. నెలకు రూ.40 లక్షల భ‌ర‌ణం డిమాండ్ తిరస్కరణ

బాక్సాఫీస్ బరిలో.. రెండు కుటుంబాలు.. నలుగురు హీరోలు! విజ‌యం.. ఎవ‌రికి ద‌క్కేనో

ఎన్టీఆర్ భుజానికి గాయం... ఎనిమిది వారాల విశ్రాంతి!

Updated Date - Jul 28 , 2026 | 03:56 PM