బాక్సాఫీస్ బరిలో.. రెండు కుటుంబాలు.. నలుగురు హీరోలు! విజ‌యం.. ఎవ‌రికి ద‌క్కేనో

ABN , Publish Date - Jul 27 , 2026 | 09:13 PM

రెండు కుటుంబాలకు చెందిన నలుగురు హీరోలు కొద్ది రోజుల వ్యవధితో బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నారు. భలే ఆసక్తిగా ఉంది కదూ.. ఇంతకూ ఆ రెండు ఫ్యామిలీస్ ఏవి? ఆ నలుగురు హీరోలు ఎవరు?.

Ravi Teja, vijay

రెండు కుటుంబాల నుండి నలుగురు హీరోలు బాక్సాఫీస్ బరిలో పోటీకి సై అంటున్నారంటే విశేషమే కదా!. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మాస్ మహరాజా రవితేజ- ఆయన తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు (Maadhav Bhupathiraju) సినిమాల గురించి. రవితేజ (Ravi Teja) హీరోగా రూపొందిన ఇరుముడి (Irumudi) సినిమా ఆగస్టు 21న విడుదలవుతోంది. ఇక మాధవ్ హీరోగా పరిచయమవుతున్న మారెమ్మ (Maremma) మూవీ కూడా మూడు వారాల గ్యాప్ తో సెప్టెంబర్ 1న న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇలా పెదనాన్న, అబ్బాయి మధ్యనే పోటీ సాగడం ఆసక్తిగా ఉందని సినీజనం అంటున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో సాగే కుటుంబకథా చిత్రంగా 'ఇరుముడి' రూపొందింది. ఇక 'మారెమ్మ' తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ రెండు చిత్రాల మధ్య గ్యాప్ లేకపోయినా, వేర్వేరు ఇతివృత్తాలతో రూపొందడం వల్ల ఏ మాత్రం బాగున్నా జనం రెండు చిత్రాలనూ ఆదరిస్తారని పరిశీలకుల మాట.

అన్నదమ్ముల.. అడ్జెస్ట్ మెంట్

రెండో ఫ్యామిలీ ఏదంటే 'దేవరకొండ' వారిది.'దేవరకొండ బ్రదర్స్' గా పేరొందిన విజయ్ దేవరకొండ, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మూడు వారాల గ్యాప్ తో బాక్సాఫీస్ బరిలో పోటీకి సిద్ధమవుతున్నారని టాక్. విజయ్ దేవరకొండ, ఆయన భార్య రశ్మిక జంటగా రూపొందిన 'రణబాలి' చిత్రాన్ని మేకర్స్ సెప్టెంబర్ 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా కొంత ఆలస్యమయ్యేలా ఉందని తెలుస్తోంది. దీంతో విజయ్, ఆనంద్ ఇద్దరూ ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చేశారని టాక్. ఆనంద్ హీరోగా రూపొందిన ఎపిక్ ( Epic) చిత్రాన్ని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఆ తరువాత మూడు వారాలకు అంటే సెప్టెంబర్ చివరలో కానీ, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ విజయ్ (Vijay Deverakonda) నటించిన రణబాలి (Ranabaali) ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఏది.. ఎలా మురిపించేనో?

రెండు ఫ్యామిలీస్- నలుగురు హీరోల సినిమాలు కేవలం మూడు వారాల వ్యవధిలో వస్తున్నాయి. వీరిలో వరుస ఫ్లాపులు చూస్తోన్న రవితేజకు తప్పనిసరిగా ఓ హిట్ కావాలి. ఇక ఆయన తమ్ముని కొడుకు మాధవ్ కు పరిచయచిత్రం కాబట్టి మంచి మార్కులు పడాలి. విజయ్ దేవరకొండ కూడా సరైన సక్సెస్ చూసి ఎన్నో ఏళ్ళయింది. విజయ్ తన భార్య రశ్మికతో కలసి నటించడం వల్ల 'రణబాలి'కి ఎంతో క్రేజ్ ఉంది. ఆనంద్ దేవరకొండ కూడా ఓ బంపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఈ నలుగురు హీరోలు తమ చిత్రాలతో హిట్టు పట్టాలనే ఆశిస్తున్నారు. మరి ఈ నలుగురి సినిమాల్లో ఏది ఏ తీరున జనాన్ని మురిపిస్తుందో చూడాలి.

Updated Date - Jul 27 , 2026 | 09:52 PM