మాట తప్పిన తారక్.. అసంతృప్తిలో ఫ్యాన్స్!
ABN, Publish Date - Apr 22 , 2026 | 08:28 PM
ఆర్ఆర్ఆర్... ఈ ఒక్క సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమా సత్తా ఏంటో చాటిచెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటన చూసి హాలీవుడ్ దిగ్గజ దర్శకులే ఫిదా అయిపోయారు. అలాంటి హీరోపై ఇప్పుడు ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ (RRR)... ఈ ఒక్క సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమా సత్తా ఏంటో చాటిచెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). కొమరం భీమ్ పాత్రలో తారక్ నటన చూసి హాలీవుడ్ దిగ్గజ దర్శకులే ఫిదా అయిపోయారు. ఆ గ్లోబల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని, బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ హిట్స్ వస్తాయని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. సీన్ కట్ చేస్తే, ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ పరిస్థితి ‘వేచి చూడడం’ తప్ప మరో మార్గం లేనట్టుగా తయారైంది. ‘దేవర’ (Devara) చిత్రం రూ. 500 కోట్ల వసూళ్లు సాధించిన మాట వాస్తవమే. కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఆ సినిమాపై వచ్చిన ట్రోల్స్, విమర్శలు అభిమానులను కాస్త ఇబ్బందికి గురిచేశాయి. ఇక బాలీవుడ్ ఎంట్రీ అంటూ భారీగా ప్రచారం జరిగిన ‘వార్-2’ గురించి అయితే ఫ్యాన్స్ అస్సలు మాట్లాడుకోవడమే మానేశారు. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ఒకే ఒక్క పేరు మీద ఉన్నాయి.. అదే ‘డ్రాగన్’. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజే ఇండస్ట్రీ షేక్ అయింది. ఎన్టీఆర్ - నీల్ (NTRNEEL) కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాతో తారక్ మళ్ళీ తన పాత వైభవాన్ని అందుకుంటారని అంతా అనుకుంటున్నారు. అయితే, ఇక్కడే ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. సినిమా మొదలుపెట్టి ఏడాది దాటినా, కనీసం ఈ ఏడాదైనా సినిమా చూస్తామన్న ఆశలకు గండి పడింది. లేటయినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివర్లో ‘డ్రాగన్’ (Dragon) వస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే.. ఇప్పుడు ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11కు వాయిదా పడిందన్న వార్త పిడుగులా తగిలింది. నిజానికి ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతి ఏటా తన సినిమా ఉండేలా చూసుకుంటానని ఎన్టీఆర్ అభిమానులకు మాట ఇచ్చారు. కానీ పరిస్థితులు అందుకు సహకరించడం లేదు. ఎన్టీఆర్‌కు జరిగిన మైనర్ సర్జరీ ఒక కారణమైతే.. ఈ సినిమా కోసం ఆయన మారుతున్న తీరు మరో కారణం. ‘డ్రాగన్’ కోసం తారక్ ఒక నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో బాడీ మేకోవర్ చేస్తున్నారు. ఆ బీస్ట్ మోడ్ కోసం సమయం తీసుకుంటుండటంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.
సినిమా లేట్ అయినా పర్లేదు.. అవుట్‌పుట్ అదిరిపోవాలని కొందరు అంటున్నా, మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తితోనే ఉన్నారు. తమ హీరోను స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయిపోతోందని, మరీ ఇంత గ్యాప్ వస్తే అది క్రేజ్ మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కూడా కథలో చాలా మార్పులే చేశారనే టాక్ వినిపిస్తుంది. మామూలుగానే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోకు ఉండే ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ‘కేజీయఫ్1, 2, సలార్ పార్ట్ 1’కు మించి ఈ సినిమాలో ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయట. ఇక మే 20కు ఈ సినిమా నుంచి అఫీషియల్ టైటిల్‌తో పాటు, గ్లింప్స్ కూడా ఉండబోతుందని రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. మరి ఈ గ్లింప్స్ ఏ రేంజ్‌లో అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా.. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవుతుంది. కానీ ఆ వేట చూడాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఆగాల్సిందే. మరి తారక్ పడుతున్న ఈ కష్టానికి, అభిమానుల ఈ నిరీక్షణకు తగ్గట్టుగా ‘డ్రాగన్’ ఒక సాలిడ్ హిట్ అవుతుందేమో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?
అలా విమర్శించే వారిని వదలకండి: చంద్రబాబుకు బండ్ల సూచన
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!