ఎన్టీఆర్‌తో మూవీ.. రావిపూడి ప్లాన్ మామూలుగా లేదుగా
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:06 PM
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే చర్చ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి.. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతోంది?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే చర్చ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR), టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతోంది? ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావడంతో నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి, తారక్‌తో ఏదైనా సీరియస్, ఎమోషనల్ సబ్జెక్ట్‌ను ఎంచుకుంటారా? లేక తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో తారక్‌ను చూపిస్తారా? అనే అనుమానాలు చాలామందిలో వ్యక్తమయ్యాయి.
అయితే, ఈ ఊహాగానాలన్నింటికీ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా చెక్ పెట్టారు. రీసెంట్గా ఐఫా వేడుకల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ షో ప్రదర్శన ముగిసిన తర్వాత ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమాపై కీలక విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో అభిమానులు ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ పుష్కలంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించేలా, గత పదేళ్లుగా ఎన్టీఆర్ (NTR) సినిమాల్లో మిస్ అవుతున్న ఆ వింటేజ్ కామెడీ యాంగిల్‌ను ఇందులో పూర్తిస్థాయిలో చూపించబోతున్నట్టు రావిపూడి స్పష్టం చేశారు. అంతేకాదు, ఇది ఏదో చిన్న స్థాయి సినిమా కాదని, ఎన్టీఆర్ ఇమేజ్, స్కేల్‌కు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో ఉండబోతోందని ఆయన చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నిజం చెప్పాలంటే, ఎన్టీఆర్‌ను పూర్తిస్థాయి ఫన్ మోడ్‌లో చూసి దాదాపు పుష్కరం దాటిపోయింది. ‘అదుర్స్, బృందావనం, బాద్షా’ వంటి చిత్రాల్లో తారక్ కామెడీ టైమింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘అదుర్స్’ సినిమాలో చారి పాత్రలో ఆయన చేసిన అల్లరిని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’, ‘వార్-2’.. ఇలా వరుసగా అన్నీ సీరియస్, ఇంటెన్స్ యాక్షన్ సినిమాలే చేస్తూ వచ్చారు. ఆయా చిత్రాల్లో అక్కడక్కడా ఒకటి రెండు పంచ్‌లు వేయించారు తప్ప, వి.వి. వినాయక్ లాగా తారక్‌లోని పూర్తిస్థాయి కామెడీ క్యాలిబర్‌ను బయటకు తీసిన దర్శకులు లేరనే చెప్పాలి. సరిగ్గా ఆ లోటునే ఇప్పుడు అనిల్ రావిపూడి భర్తీ చేయబోతున్నారు. రావిపూడి మాటలను బట్టి చూస్తుంటే, ‘అదుర్స్’ రేంజ్ ఫన్‌తో పాటు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని పూర్తి క్లారిటీ వచ్చేసింది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ (God Of War) అనే భారీ ప్రాజెక్ట్‌ను ఇదివరకే ప్రకటించారు. అయితే, ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ‘డ్రాగన్’ (Dragon) పూర్తికాగానే ఎన్టీఆర్, అనిల్ రావిపూడి సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా రిలీజ్ కాగానే, అనిల్ తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పైనే పెట్టనున్నారు. తారక్ మాస్ ఎనర్జీకి, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్లో ఎలాంటి కథ రాబోతోంది? తారక్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
క్రెడిట్ కొట్టేస్తున్నారు.. అల్లు అరవింద్‌కు రాజమౌళి సలహా
తెలుగు సినిమాల్లో డార్క్ హీరోయిజం.. ట్రెండ్ ఇదే కానీ..?
ఎన్టీఆర్, మహేష్, బన్నీ కాదు.. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ ప్రాజెక్ట్ ఇదే