సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

National Film Award: నాగబాబు బాటలోనే నిహారిక!

ABN, Publish Date - Jul 20 , 2026 | 02:39 PM

ప్రముఖ నటుడు నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ పై నిర్మించిన తొలి చిత్రం 'రుద్రవీణ'తో జాతీయ అవార్డులు అందుకోగా, ఆయన కుమార్తె నిహారిక సైతం తొలి చిత్రం 'కమిటీ కుర్రోళ్ళ'తో రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుని, తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది.

Nagababu - Niharika

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా! అన్నయ్య చిరంజీవిలోని ఉత్తమ కళాభిరుచిని వెండితెరపై ఆవిష్కరింప చేయాలనే కోరికతో అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి తొలి చిత్రంగా 'రుద్రవీణ' సినిమాను నాగబాబు నిర్మించాడు. కె. బాలచందర్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దంతగా ఆడలేదు. అయితే చిరంజీవి, శోభన నటన, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను తెలుగు సినిమా రంగంలో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిపాయి. అయితే ఈ సినిమా జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నర్గిస్ దత్‌ అవార్డుకు 'రుద్రవీణ' ఎంపికైంది. అలానే ఇళయరాజా ఉత్తమ సంగీత దర్శకుడిగానూ, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఉత్తమ నేపథ్య గాయకుడిగానూ 'రుద్రవీణ' సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత కూడా అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు పలు చిత్రాలను నిర్మించారు.


నాగబాబు కుమార్తె నిహారిక కూడా తండ్రిలానే నటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే నిర్మాతగానూ మారింది. పింక్ ఎలిఫెంట్‌ పిక్చర్స్ సంస్థను స్థాపించి, ఈ బ్యానర్ లో ఆమె నిర్మించిన తొలి ఫీచర్ ఫిల్మ్ 'కమిటీ కుర్రోళ్ళు' ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమా కేటగిరిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ మేకప్ మెన్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. దాంతో తండ్రి అడుగు జాడల్లో నడస్తూ నిహారిక సైతం తొలి చిత్రానికే జాతీయ అవార్డులు పొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాగబాబు తన తొలి చిత్రాన్ని అప్పటికే సూపర్ స్టార్ గా ఉన్న అన్నయ్య చిరంజీవితోనూ, ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తో నిర్మించారు. కానీ నిహారిక కొత్త నటీనటులతో, నూతన దర్శకుడితో 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా నిర్మించింది. 'రుద్రవీణ' కమర్షియల్‌ గా సక్సెస్ కాలేదు కానీ నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని అందుకుంది. తండ్రీలానే నిహారిక సైతం ఇప్పుడు వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. పింక్ ఎలిఫెంట్‌ పిక్చర్స్ బ్యానర్ పై రెండో చిత్రంగా 'రాక్షస'ను తీసి హిట్ కొట్టిన నిహారిక ఇప్పుడు అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా 'బరి' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాను తెరకెక్కించిన యదు వంశీనే దీనికి దర్శకుడు రావడం విశేషం.

ఇవి కూడా చదవండి:

చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం

సీతమ్మ పాత్రను నేను ఎంచుకోలేదు, ఆ దేవుడే: సాయి పల్లవి

బ్రదర్స్ బాండింగ్ అంటే ఇది.. ‘లెనిన్’ హిట్‌పై చైతూ!

Updated Date - Jul 20 , 2026 | 02:40 PM