నిన్న తండ్రితో... రేపు కొడుకుతో... నయన్ నట విన్యాసం!
ABN, Publish Date - Jul 15 , 2026 | 03:40 PM
రామ్ చరణ్, సుకుమార్ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్ర చేయబోతోందనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన వర ప్రసాద్ గారు'లో హీరోయిన్‌గా నటించిన నయన్ ఇప్పుడు చెర్రీ మూవీలో నటిస్తే ఖచ్చితంగా ప్రాజెక్ట్ కు ఊహించని క్రేజ్ ఏర్పడుతుంది.
ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో చిరంజీవి సరసన నటించింది నయనతార. ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. విశేషం ఏమంటే నయనతార చిరంజీవితో కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 'సైరా' చిత్రంలో చిరుకు జోడీగా నటించింది. అలానే 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవికి సోదరి తరహా పాత్రను చేసింది. ఇలా చిరంజీవితో మూడు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార తొలిసారి ఆయన కొడుకు రామ్ చరణ్ మూవీలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. చెర్రీ పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని విజయం రూపంలో ప్రేక్షకులు అందించారు. దాంతో ఆ కష్టాన్ని మర్చిపోయి... చరణ్ సేద తీరుతున్నాడు. ఆ తర్వాత తనతో 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన సుకుమార్‌తో చెర్రీ సినిమా చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాతో నయనతార ఓ కీలకమైన పాత్ర చేయబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. ఆమెది హీరోయిన్ పాత్ర కాకపోయినా... దానికి సరి సమానంగా ఉండే పాత్ర అని, ఈ సినిమాకు ఆమె పాత్ర బ్యాక్ బోన్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే మూవీ లైన్ రామ్ చరణ్ కు చెప్పి, ఓకే చేయించుకున్న సుకుమార్... ఫైనల్ వర్షన్ సిద్థం చేయడానికి తన బృందంతో కలిసి అమెరికా వెళ్ళాడట. అక్కడ నుంచి రాగానే... ఫైనల్ డ్రాఫ్ట్ ను రామ్ చరణ్ కు అందచేసి, ఇదే యేడాది అక్టోబర్ లో మూవీకి పూజా కార్యక్రమాలు జరుపుతారని అంటున్నారు.
దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో హీరో హీరోయిన్‌తో పాటు ప్రత్యేకంగా చెప్పుకునేలా కొన్ని పాత్రలను అద్భుతంగా డిజైన్ చేస్తుంటారు. చెర్రీతో తాను చేయబోయే సినిమాలో నయన్ పాత్ర కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే... నయన్ ఫ్యాన్స్ కు పండగే.
ఇవి కూడా చదవండి:
రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల
నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్
కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ