నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్

ABN , Publish Date - Jul 13 , 2026 | 10:00 PM

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌‌లో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Buchi Babu about Peddi Digital Streaming

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కలయికలో వచ్చిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కి వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2లో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక ఎమోషనల్ నోట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ఈ విజయం మాది కాదు... మనందరిది’’ అంటూ ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఒక చిన్న కలగా మొదలైన ‘పెద్ది’ ప్రయాణాన్ని ప్రేక్షకులు ఇంత పెద్ద విజయంగా నిలబెట్టడంపై బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేశారు. సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ, అభినందనలు తన జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలని ఆయన పేర్కొన్నారు. టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో, నమ్మకంతో, ప్రాణం పెట్టి ఈ సినిమాను తీర్చిదిద్దారని, ఆ కష్టానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనే తమకు దక్కిన అతిపెద్ద బహుమతి అని లేఖలో రాసుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే రోజు వరకు కూడా ఎంతోమంది ప్రేక్షకులు థియేటర్లకే వచ్చి పెద్ద తెరపై సినిమాను ఆస్వాదించడం తమకు ఎంతో ప్రత్యేకమని బుచ్చిబాబు ఆనందం వ్యక్తం చేశారు.


ఇక థియేటర్ల రన్ ముగించుకుని నెట్‌ఫ్లిక్స్ ద్వారా సరికొత్త డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించించిన ఈ చిత్రం, ప్రపంచంలోని మరింత మంది ప్రేక్షకులకు చేరువ అవుతుందనే విషయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని బుచ్చిబాబు పేర్కొన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు పొందిన ఆనందాన్ని, ఇప్పుడు ఓటీటీలో కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలని మనసారా కోరుకుంటున్నట్లుగా ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ

బాలయ్యకి అన్నయ్యగా ఆ బాలీవుడ్ స్టార్.. నిజమైతే బాక్సాఫీస్ బద్దలే!

పెదనాన్న అంటూ చిరుకి అఖిల్ రిప్లై.. సోషల్ మీడియా తగలడిపోతోంది

Updated Date - Jul 13 , 2026 | 10:00 PM